ఖమ్మం: గంజాయిని అక్రమంగా రవాణా చేసిన కేసులో ఖమ్మం కోర్టు సోమవారం సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో దోషిగా తేలిన వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ. 2.00 లక్షల మొత్తాన్ని జరిమానాగా విధిస్తూ ఖమ్మం ఫస్ట్ అడిషనల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కె. ఉమాదేవి సంచలన తీర్పు చెప్పారు.
ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా కొణిజర్ల పోలీసులు 2020 అక్టోబర్ 8వ తేదీన తనికెళ్ళ గ్రామ శివారులో వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అనుమానస్పదంగా కనిపించిన ఇన్నోవా కారును తనిఖీ చేయగా రూ. 19.00 లక్షల విలువ గల 130 కేజీల గంజాయి పట్టుబడింది. దీన్ని రవాణా చేస్తున్న వ్యక్తిని అదుపులో పోలీసులు తీసుకుని విచారించగా అక్రమార్జన కోసం చింతూరు నుండి జహీరాబాద్ కు గంజాయి సరఫరా చేస్తునట్లు విచారణలో వెల్లడైంది.
ఈ కేసులో నిందితునిగా పట్టుబడిన కేతావత్ ప్రవీణ్ కుమార్ (25) అనే యువకుడిని సంగారెడ్డి జిల్లా మనియార్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈమేరకు కొణిజర్ల పోలీస్ స్టేషన్ లో NDPS-1985 చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు సమగ్ర దర్యాప్తు అనంతరం కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. నిందితుడు కేతావత్ ప్రవీణ్ కుమార్ పై పోలీసులు మోపిన అభియోగం రుజువు కావటంతో అతన్ని దోషిగా నిర్ధారిస్తూ, అతనికి 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ. 2.00 లక్షల మొత్తాన్ని జరిమానాగా విధిస్తూ న్యాయమూర్తి కె. ఉమాదేవి తీర్పు చెప్పారు.
కేసులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జమ్ముల శరత్ కుమార్ రెడ్డి ప్రాసిక్యూషన్ వినిపించారు. కాగా ఏపీపీ శరత్ కుమార్ రెడ్డిని, అప్పటి విచారణ అధికారులైన సీఐ వసంతకుమార్, ఎస్ఐ మొగిలి, కోర్టు హెడ్ కానిస్టేబుల్ రామారావు, కానిస్టేబుల్ మల్లికార్జున రావు, కోర్టు లైజనింగ్ కె.శ్రీకాంత్ (SI)) హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరావు, శ్రీనివాస్, హోంగార్డ్ ఆఫీసర్ ఎండీ.ఆయూబ్ లను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఈ సందర్భంగా అభినందించారు.

