గార్ల: పూర్వ ఖమ్మం జిల్లా, ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన ఇద్దరు యువుతులు అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. కాలిఫోర్నియాలో విహార యాత్రకు వెళ్లి, తిరుగు ప్రయాణంలో ఉండగా ప్రమాదవశాత్తు కారు లోయలో పడి గార్ల మండలం ముల్కనూరుకు చెందిన కడియాల భావన, గార్లకు చెందిన మేఘనా రాణి ప్రాణాలు కోల్పోయారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.
గార్ల మండల కేంద్రంలో మీ సేవా కేంద్రం నిర్వాహకుడు పుల్లఖండం వెంకట నాగేశ్వరరావు-శిరీష దంపతుల కుమార్తె మేఘనారాణి (25), ముల్కనూరు ఉప సర్పంచ్ కడియాల కోటేశ్వరరావు-రేణుక దంపతుల చిన్న కుమార్తె భావన (24)లు ఉన్నత విద్యనభ్యసించేందుకు అమెరికా వెళ్లారు. మూడేళ్ల కిందట అమెరికాకు వెళ్లిన ఈ ఇద్దరు యువతులు ఎమ్మెస్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నట్లు సమాచారం. క్రిస్మస్ సెలవులు కావడంతో స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. యాత్రను ముగించుకుని తిరిగి ప్రయాణిస్తుండగా ఓ లోయలో కారు పడిపోవడంతో ఈ ఘోరం చోటు చేసుకుంది.
ఎంపీ వద్దిరాజు దిగ్భ్రాంతి:
కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గార్ల మండలానికి చెందిన మేఘన, భావనలు తమ నిండు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధాకరమని ఆయన తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. తిరుపతిలో ఉన్న ఎంపీ రవిచంద్రకు ఈ విషాదవార్త తెలియగానే వెంకట నాగేశ్వరరావు, కోటేశ్వరరావులను ఫోన్ ద్వారా పరామర్శించారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న అమ్మాయిలు రోడ్డు ప్రమాదం బారినపడి అకాల మరణం చెందడం బాధాకరమన్నారు. బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రుల దుఃఖం పూడ్చలేనిదని ఎంపీ రవిచంద్ర అన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోవద్దని, తాను అండగా ఉంటానని, మృతదేహాలను వెంటనే స్వస్థలానికి రప్పించేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడుతానని ఎంపీ వద్దిరాజు బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు.

