ఖమ్మం: ఖమ్మం జిల్లాలో నేరాలు నియంత్రణలోనే ఉన్నాయని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ వెల్లడించారు. సమర్థులైన పోలీసులు, అధికారుల వల్ల ఇది సాధ్యమైందన్నారు. ఫలితంగా గడచిన ఏడాది కాలంలో జిల్లా వ్యాప్తంగా దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, హత్యాయత్నాలు, చైన్ స్నాచింగ్ వంటి ముఖ్యనేరాలు గణనీయంగా తగ్గినట్లు పేర్కొన్నారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ సునీల్ దత్ 2025 సంవత్సరంలో జిల్లాలో చోటు చేసుకున్న నేరాలకు సంబంధించిన వార్షిక నివేదకను విడుదల చేశారు.
ఈ సందర్భంగా సీపీ సునీల్ దత్ మాట్లాడుతూ, సమర్థవంతమైన పోలీసింగ్ ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే చోరీ సొత్తు రికవరీ 9 శాతం, జరిగిన నేరాలను ఛేదించడం 11 శాతం పెరిగిందన్నారు. సైబర్ నేరగాళ్లు దోచుకున్న సుమారు రూ. 4.5 కోట్ల నగదును భాదితుల అకౌంట్లలోకి తిరిగి జమ అయ్యేలా చేయడంతో పాటు మరో 1.5 కోట్ల రూపాయలు హోల్డ్ చేసేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. లోక్ ఆదాలత్ ద్వారా 36,709 కేసులు పరిష్కారమయ్యాయని చెప్పారు. ప్రాసిక్యూషన్ అధికారులు, పోలీసుల సమన్వయంతో వివిధ కేసుల్లో దోషులకు శిక్ష శాతం పెరిగిందన్నారు.

అదేవిధంగా ఈ ఏడాది జరిగిన 928 రోడ్డు ప్రమాదాలలో 332 మంది మృతి చెందారని, మరో 809 మంది గాయపడ్డారని సీపీ తెలిపారు. గంజాయి సేవించే వారిపైన కేసులు నమోదు చేయడంతో గంజాయి సరఫరా, రవాణాను కట్టడి చేశామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో నేరాల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. నేరాలు జరిగే చోటుకు ఉన్నతాధికారులు పరిశీలనకు వెళ్లడం ద్వారా వాటి పరిష్కారంతో పాటు నేరాల కట్టడికి చర్యలు చేపట్టినట్లు సునీల్ దత్ వివరించారు.

పోలీస్ పెట్రోలింగ్, ఆకస్మిక వాహనాల తనిఖీ, కమ్యూనిటీ కాంటాక్టు కార్యక్రమాలు, ప్రజలతో సమన్వయం, ప్రధాన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టామన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇప్పించడం ద్వారా ఫింగర్ ప్రింట్స్, ఇతర ఆధారాల సేకరణ ద్వారా చోరీ సొత్తును రికవరీ చేయడంలో గణనీయమైన పురోగతిని సాధించామన్నారు. చోరీ కేసుల్లో నిందితులను త్వరగా గుర్తించడం, వారి కదలికలపై నిఘా పెట్టడం, జైలు నుంచి విడుదలైన నేరస్థులపై నిఘా వేయడం ద్వారా ఘటనలను కట్టడి చేశామన్నారు.

సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని, ప్రతి కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ముందుకు రావాలన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా బ్లాక్ స్పాట్లుగా గుర్తించిన ప్రదేశాల్లో లోపాలను సరిదిద్ది సిగ్నల్ లైట్లు, బారికేడ్ల వినియోగం, రేడియం స్టిక్కర్లతో సైన్ బోర్డులు, స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశామన్నారు. విద్యా సంస్థల్లో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

విలేకరుల సమావేశంలో అడిషనల్ డీసీపీలు ప్రసాద్ రావు, రామానుజం, ఏసీపీలు వసుంధర యాదవ్, రమణమూర్తి, తిరుపతిరెడ్డి, మహేష్, సర్వర్, సత్యనారాయణ పాల్గొన్నారు

