హైదరాబాద్: తెలంగాణా రాష్ట్ర మూడో శాసనసభ ఏడో సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శాసనసభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు, విప్ లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, శాసనమండలి, శాసనసభల కార్యదర్శులు స్వాగతం పలికారు. సభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడి స్థానం వద్దకెళ్లి మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావును మర్యాదపూర్వకంగా పలకరించారు. కేసీఆర్ యోగక్షేమాల గురించి ఆరా తీసి, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి సీఎం రేవంత్ అడిగి తెలుసుకున్నారు.

శాసనసభ తొలిరోజు దివంగత మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్ రెడ్డి(సూర్యాపేట)కి, కొండా లక్ష్మారెడ్డి (చేవెళ్ల)కి శాసనసభ సంతాపం తెలిపింది. ఆ తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జీరో అవర్‌ను చేపట్టారు. తరువాత సభను జనవరి 2 వ తేదీకి వాయిదా వేశారు. కాగా సంతాప తీర్మానాల అనంతరం కేసీఆర్ సభ నుంచి వెళ్లిపోయారు.

