తల్లాడ: ఖమ్మం జిల్లా తల్లాడ వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో జనగామ జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను జఫర్ గఢ్ మండలం ఉప్పుగల్లుకు చెందిన కారు డ్రైవర్ చిల్లర బాలకృష్ణ, రాయల అనిల్ గా పోలీసులు గుర్తించారు. ఇదే ప్రమాదంలో ఉప్పుగల్లుకు చెందిన అజయ్, కొల్లిపాక క్రాంతి, గట్టు రాకేష్ లు గాయపడగా, ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో తల్లాడ మండలం మిట్టపల్లి వద్ద గల ఓ దాబా హోటల్ సమీపాన ప్రమాదం జరిగింది. తల్లాడ వైపు వస్తున్న కారును కల్లూరు వైపు వెడుతున్న లారీ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో బాలకృష్ణ, అనిల్ అక్కడికక్కడే మరణించారు. మిగతా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

కాగా ప్రమాదం గురించి సమాచారం అందుకున్న తల్లాడ ఎస్ఐ వెంకటేష్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్సులో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారులో చనిపోయి ఇరుక్కుపోయిన ఇద్దరి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు పూరీ జగన్నాధ్ యాత్ర చేసుకొని తిరిగి వస్తునట్లు సమాచారం.

