Top 5 This Week

Related Posts

లొంగు‘బాట’పై దామోదర్ కీలక అడుగు!

మేడారం: మావోయిస్ట్ పార్టీకి చెందిన మరో కీలక నేత లొంగు‘బాట’ను ఎంచుకున్నట్లేనా? ఆ పార్టీ తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధపడినట్లు తాజా సమాచారం. ఇందుకు అవసరమైన మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. దామోదర్ వెంట కనీసం 40 నుంచి 50 మంది ఇతర స్థాయి నక్సల్స్ కూడా లొంగుబాటలో పయనించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈమేరకు దామోదర్ స్వగ్రామమైన కాల్వపల్లి, ఆ పక్కనే గల ఊరట్టం, నార్లాపూర్, మేడారం, రెడ్డిగూడెం తదితర ప్రాంతాల్లో అతని లొంగుబాటుపై భిన్న ప్రచారం జరుగుతోంది.

దామోదర్ లొంగుబాటను ఆశ్రయిస్తే తెలంగాణాలో ఆ పార్టీకి భారీ షాక్ గానే పరిగణించవచ్చు. లొంగుబాటు అంశంలో దామోదర్ గడచిన నాలుగు నెలలుగా తర్జనభర్జన పడుతున్నట్లు ఏటూరునాగారం ఏజెన్సీ ఏరియాలో ప్రచారం జరుగుతోంది. ఛత్తీస్ గఢ్-తెలంగాణా సరిహద్దుల్లో గల ములుగు జిల్లాలోని అటవీ ప్రాంతాల్లోనే దామోదర్ టీం కదలికలు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా భావిస్తున్నాయి. లొంగుబాటు పయనంలో భాగంగానే దామోదర్ కదలికలు ఉన్నట్లు ఆ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే దశలో దామోదర్ లొంగుబాటుకు అవసరమైన అనుకూల పరిస్థితులను కల్పించేందుకు పోలీసులు వేచి చూస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.మరి కొద్దిరోజుల్లోనే దామోదర్ లొంగుబాటు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా తెలంగాణాకు చెందిన నక్సలైట్లు లొంగిపోవాలని, అందుకు ప్రభుత్వ విధానం కూడా అనుకూలంగా ఉందని, అన్నిరకాల సహాయ, సహకార, పునరావాస కార్యక్రమాలను ప్రభుత్వం అందిస్తుందని డీజీపీ శివధర్ రెడ్డి నిన్న 41 మంది మావోయిస్టులు లొంగిపోయిన సందర్భంగా మరోసారి స్పస్టం చేశారు. దామోదర్ సహా తెలంగాణకు చెందిన నక్సల్స్ జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన పిలుపునిచ్చారు. నక్సల్స్ అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వేర్వేరుగా ఉండదని, ఒకే విధంగా ఉంటుందని వెల్లడించారు. కేంద్రం విధించిన గడువు తర్వాత.. అంటే వచ్చే మార్చి 31వ తేదీ తర్వాత కూడా నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్లలో ఎటువంటి మార్పు ఉండదని కూడా ఆయన స్పష్టం చేయడం గమనార్హం.

Popular Articles