నాట్యం, సంగీతం ద్వారా దేవుడిని అర్చించే దేవదాసీ కుటుంబంలో 1916 సెప్టెంబర్ 16 న పుట్టిన ఎమ్మెస్ పూర్తి పేరు ‘మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి’. పేరులో ఊరిపేరు, తండ్రిపేరు పెట్టుకునే సాధారణ తమిళనాడు సంప్రదాయానికి భిన్నంగా.. ఎంఎస్ పేరులో ఊరిపేరు తరువాత తండ్రికి బదులు దేవదాసీ సంప్రదాయం ప్రకారం తల్లి ‘షణ్ముఖ వడివు’ పేరు ఉంది. సుబ్బులక్ష్మికి తండ్రి సుబ్రమణ్య అయ్యర్. పదేళ్లనుంచే తల్లి షణ్ముఖవడివు దగ్గర సంగీతం నేర్చుకొని పాడటం మొదలుపెట్టారు. సెమ్మంగుడి శ్రీనివాసయ్యర్ లాంటి దిగ్గజ సంగీతజ్ఞుల శిష్యరికం చేసి 12వ ఏట అరంగేట్రం చేసినప్పుడు కర్ణాటక సంగీత జగత్తులో ఒక ఉజ్జ్వల తార వెలసిందని అందరూ మెచ్చుకోవడం మొదలయింది. ఎదిగిన సుబ్బులక్ష్మిని దేవదాసీ సంప్రదాయం ప్రకారం ఒక చెట్టియార్ ప్రాపకానికి అప్పగిద్దామని తల్లి ప్రయత్నించింది. ఇది గమనించిన ఎమ్మెస్.. పారిపోయి మద్రాసులో సదాశివం అనే జర్నలిస్టు పంచన చేరింది.
ఇంటింటా వినిపించే శ్రీవారి సుప్రభాతం మొదలు భజగోవిందం దాకా.. విష్ణు సహస్ర నామం మొదలు కనకధారాస్తవం దాకా.. మరే కీర్తనలైనా ఆ గంధర్వ గాయని గాత్రంలో వింటూ ఉంటే అదొక మధురమైన ఆధ్యాత్మిక భావన. భారతీయ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసి ఇంటింటా పరిచయమైన సంగీత విదుషీమణి ఎంఎస్ సుబ్బులక్ష్మి. పట్టు చీర, నుదుటిమీద కుంకుమ బొట్టు, తలలో మల్లెపూలు.. ఎవరూ మరువలేని స్ఫురద్రూపం ఆమె సొంతం. ఏడు దశాబ్దాల కాలంలో మూడు తరాలను తన్మయత్వంలో ఓలలాడించిన సంగీత సామ్రాజ్ఞి ఎమ్మెస్. గొంతులోనే వీణ ఉన్నదా అనిపించేంత గాత్రాన్ని సొంతం చేసుకున్న సుస్వరలక్ష్మి.. సుబ్బులక్ష్మి. ఎంతో కాలంగా ఆమె బయోపిక్ వస్తున్న సంగతి వార్తల్లో ఉంటూ వస్తోంది. కీర్తి సురేష్, విద్యాబాలన్ పేర్లు జనం నోళ్లలో నానిన తరువాత చివరికి సాయి పల్లవి పేరు ఫిక్స్ అయింది. ఈ సందర్భంగా ఒకసారి ఎమ్మెస్ జీవితాన్ని గుర్తుచేసుకుందాం.

ఎమ్మెస్ సంగీత ప్రస్థానం వేగం పుంజుకొని ముందుకు దూసుకుపోతున్నా, మద్రాసులోని గానసభల్లో పాడి మెప్పించేదాకా ఆమెను గుర్తించే పరిస్థితి లేదు. కానీ గానసభల్లో బ్రాహ్మణ ఆధిపత్యం వేళ్ళూనుకు పోయిన రోజులవి. అలాంటి ఛాందసవాదుల మెప్పు పొందటానికి ఆమె దేవదాసీ నేపథ్యం అడ్డు పడుతున్న వేళ సదాశివం ఆమెకు అండగా నిలబడ్డారు. జర్నలిస్టు, బ్రాహ్మణుడు కావటంతో అతణ్ణి కాదనలేకపోయారు గానసభల నిర్వాహకులు. ఆ విధంగా సుబ్బులక్ష్మి మద్రాసులో పేరు మోసిన సంగీత గాన సభల్లో పాడి అభినందనలందుకున్నారు. అదే సమయంలో అప్పటికే పెళ్ళయి, ఇద్దరు పిల్లలున్న సదాశివం ఆమెతో ప్రేమలో పడ్డారు. ఆ తరువాత కొంత కాలానికి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు.

తన చివరి శ్వాస దాకా సంగీతమే ఊపిరిగా బతికారామె. ముఖ్యంగా శాస్త్రీయ సంగీతానికి సుబ్బులక్ష్మి ఎనలేని సేవలు చేశారు. తన గాన ప్రతిభకు ప్రతీకగా భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ తో కేంద్ర ప్రభుత్వం ఆమెను గౌరవించింది. నాట్యానికి, సంగీతానికి అత్యంత గౌరవం లభించే తమిళనాట కర్ణాటక సంగీతంలో ఎం ఎస్ సుబ్బులక్ష్మి, డి.కె.పట్టమ్మాళ్, ఎం.ఎల్.వసంతకుమారిని కలిపి మహిళా సంగీత త్రయంగా చెబుతారు. అయితే, సంగీతంతోబాటు వెండితెరమీద సైతం తన ఆధ్యాత్మిక గానామృతానికి స్ఫురద్రూపాన్ని జోడించి మరింత ఆకట్టుకున్న ఘనత ఎం ఎస్ కు మాత్రమే దక్కింది. సావిత్రి, శకుంతల, మీరా చిత్రాలతో సినీ సంగీతాభిమానులను అపురూపమైన సంగీత సంపదనందించిన ఘనత ఆమెది. ఐక్యరాజ్యసమితిలో ఆమె గానం చేశాక సభ యావత్తూ లేచి నిలబడి పది నిమిషాలపాటు చప్పట్లు కొట్టటమే ఆమె భారతీయ సంగీతాన్ని విశ్వ వీధుల్లో నిలిపారనటానికి నిదర్శనం. పండిత పామరులను సమానంగా, అలరించగలిగిన ఘనత ఆమె సొంతం. రామన్ మెగసెసే అవార్డు మొదలు పద్మ భూషణ్, పద్మ విభూషణ్ మీదుగా భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ దాకా ఆమె పురస్కారాల పరంపర సాగింది. ఏడు దశాబ్దాల పాటు తన అద్భుత గాన కౌశలంతో సాగించిన కర్ణాటక సంగీత స్వరయాత్ర .. భారతీయ శాస్త్రీయ సంగీత ప్రపంచంలో ఒక సువర్ణాధ్యాయం. సప్తస్వరాలకు అందని ఎనిమిదో స్వరం 2004లో మూగబోయింది.

ఎమ్మెస్ సుబ్బులక్ష్మికి ఒక ప్రేమ కథ ఉంది. ఆమెతో ‘శకుంతలై’ సినిమాలో హీరోగా నటించిన గుడలూర్ నారాయణస్వామి బాలసుబ్రమణియం అందగాడు, సంగీత పరిజ్ఞానం ఉన్నవాడు. అతనితో ఎమ్మెస్ ప్రేమలో పడ్డారు. సాన్నిహిత్యం పెరిగినా, ఎడబాటు తప్పలేదు. వాళ్ళ మధ్య ప్రేమలేఖలు నడిచాయి. కానీ సదాశివం ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనే పట్టుదలతో ఉండటంతో ఇద్దరినీ విడదీశారు. తనకు మహోన్నత సంగీత జీవితాన్నిచ్చిన వ్యక్తి కోసం ఎమ్మెస్ తన ప్రేమికుణ్ణి వదులుకుంది. సదాశివం ఆమెను పంజరంలో చిలకలా మార్చారనే మాట చాలాకాలం అందరూ చెప్పుకుంటూ వచ్చారు.
1940నాటి సుబ్బులక్ష్మి ప్రేమ కథ అప్పటి తరానికి చూచాయిగా మాత్రమే తెలుసు. కానీ “MS – A Life in Music” పేరుతో ఆమె జీవిత చరిత్ర రాసిన పేరుమోసిన జర్నలిస్టు టీజేఎస్ జార్జ్ ఆమె అనుమతితో ఈ విషయాలన్నీ బైటపెట్టారు. ఆమె తన వియోగ దుఃఖాన్ని, ప్రణయ వర్ణననూ ఏ మాత్రం దాచుకోకుండా ఆ లేఖల్లో రాశారు. ఆ పుస్తకం చివర్లో అనుబంధం రూపంలో ఆమె ప్రేమలేఖలు కూడా ప్రచురించారు. చిన్నప్పటి తల్లి వేధింపులు, ప్రియుణ్ణి దూరం చేసిన భర్త సదాశివానికి తాను రెండో భార్య కావటం, అయినా సదాశివం అనుమానపు చూపుల లాంటి ఎన్నో బాధాకరమైన అనుభవాలు ఆమె జీవిత చరిత్రలో గుది గుచ్చి అందించారు జార్జ్. దీపం కింద చీకటిలా ఆమె సుమధుర సుస్వరాల గాత్రం వెనుక దాగిన మూగవేదన ఆమె జీవిత చరిత్ర వల్లనే ఎక్కువమందికి తెలిసింది.

భారతీయ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఆ విదుషీమణి జీవితాన్ని తెరకెక్కించాలన్న ప్రయత్నాలు కొంత సాగుతూనే ఉన్నాయి. ‘మహానటి’ చిత్రం ద్వారా సావిత్రి పాత్రలో జీవించిన కీర్తి సురేష్ నటిస్తారని ఒకసారి, బాలీవుడ్ నటి విద్యా బాలన్ పోస్ట్ చేసిన వీడియో ఆధారంగా ఆమే ఆ సినిమాలో నటిస్తారని ఇంకోసారి ప్రచారమైంది. కానీ ఆ ప్రచారంలో నిజం లేదని చెబుతూ ఇప్పుడు సాయి పల్లవి పేరు వార్తల్లోకెక్కింది. పాన్ ఇండియా సినిమా రామాయణ్ లో సీతగా నటిస్తున్న సాయి పల్లవి ఎప్పుడు డేట్స్ ఇస్తుందో, ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఇంకా స్పష్టత లేదు. ఏమైనా, ఈ బయోపిక్ లోనైనా ఎమ్మెస్ జీవితపు వెలుగు నీడలు వెలుగు చూస్తాయేమో చూడాలి!

✍️ తోట భావనారాయణ

