హైదరాబాద్: విద్యుత్ శాఖకు చెందిన ఓ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ఏడీఈ) బినామీగా అనుమానిస్తున్న ఒకరి నివాసంలో రూ. 2.18 కోట్ల నగదును ఏసీబీ అధికారులు గుర్తించిన ఘటన ఇది. హైదరాబాద్ లోని ఇబ్రహీంబాగ్ లో విద్యుత్ శాఖ ఏడీఈ (ఆపరేషన్స్)గా పనిచేస్తున్న ఏరుగు అంబేడ్కర్ నివాసంలో మంగళవారం ఏసీబీ అధికారులు సోదాలు ప్రారంభించారు. ఉదయం నుంచి కొనసాగుతున్న దాడుల్లో భాగంగా అంబేడ్కర్ కుటుంబ సభ్యుల, బంధువుల నివాసాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈమేరకు అంబేడ్కర్ బినామీగా భావిస్తున్న ఒకరి ఇంట్లో అధికారుల తనిఖీల సందర్భంగా రూ. 2.18 కోట్ల నగదుకు సంబంధించిన కట్టలు పట్టుబడడం గమనార్హం.

ఏడీఈ అంబేడ్కర్ భారీగా ఆస్తులు పోగేసుకున్నట్లు గుర్తించిన అధికారులు తనిఖీల్లో ఇప్పటి వరకు.. శేరిలింగంపల్లిలో ఓ ఫ్లాట్, గచ్చిబౌలిలో జీ ప్లస్ భవనం, పదెకరాల భూమి గల ఓ కెమికల్ కంపెనీ, హైదరాబాద్ లో ఆరు నివాసయోగ్య ఓపెన్ ప్లాట్లు, ఒక వ్యవసాయ క్షేత్ర భూమి, రెండు కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లను గుర్తించారు.ఇవిగాక రూ. 2.18 కోట్ల నగదు కట్టల మొత్తాన్ని ఏడీఈ బినామీగా అనుమానిస్తున్న వ్యక్తి ఇంట్లో కనుగొన్నారు. కాగా ఏడీఈ ఆక్రమాస్తులకు సంబంధించి సోదాలు ఇంకాకొనసాగుతున్నట్లు ఏసీబీ ప్రకటించింది.


