Top 5 This Week

Related Posts

మంత్రి తుమ్మలపై ‘బద్నాం’ స్కెచ్: టీవీ రిపోర్టర్ ఓవరాక్షన్, ఇంటెలిజెన్స్ ఏఎస్ఐపై దౌర్జన్యం!

తెలంగాణా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును రైతాంగంలో బద్నాం చేసేందుకు ప్రభుత్వ వ్యతిరేక మీడియాకు చెందిన ఓ ఛానల్ రిపోర్టర్ చేసిన ఓవరాక్షన్ ఖమ్మం జిల్లా మీడియా సర్కిళ్లలో చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన ఓ అధికారిపై దౌర్జన్యానికి పాల్పడడమేగాక, అతని ఫోన్ లాక్కుని నేలకేసి విసిరికొట్టి ధ్వంసం చేసినట్లు తెలుస్తున్న ఘటన పోలీసు శాఖలోనూ తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ‘సమీక్ష’ సేకరించిన సమాచారం ప్రకారం.. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

వైరా నియోజకవర్గంలోని కొణిజర్ల మండలం కేంద్రంలో గల గోపవరం ప్రాథమిక సహకార సంఘం (పీఏసీఎస్) వద్ద రైతులకు గురువారం యూరియా బస్తాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వ్యతిరేక మీడియాకు చెందిన ఓ టీవీ ఛానల్ జిల్లా స్థాయి రిపోర్టర్ యూరియా పంపిణీ చేస్తున్న పీఏసీఎస్ కేంద్రం వద్దకు వెళ్లాడు. అక్కడ యూరియా కోసం క్యూలో నిల్చున్న రైతులను ఒక్కొక్కరిని పక్కకు పిలిచి, ‘ఈ ప్రభుత్వంలో మీకు యూరియా కష్టాలు ఉన్నాయి కదా? గత ప్రభుత్వంలో ఇటువంటి కష్టాలు లేవు కదా? మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మీకు సకాలంలో యూరియాను అందించడంలో విఫలమయ్యారు కదా? మీ స్పందనను తెలియజేస్తారా?’ అంటూ తాను పనిచేసే ఛానల్ గొట్టాన్ని రైతుల నోటివద్ద ఉంచి బలవంతంగా ప్రభుత్యానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసే విధంగా రెచ్చగొడుతున్నాడు.

కొణిజర్లలోని గోపవరం పీఏసీఎస్ వద్ద రైతులకు యూరియా పంపిణీ చేసినప్పటి చిత్రం

ఈ దృశ్యాలను పక్కనే ఉండి గమనిస్తున్న ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ ఒకరు సదరు ఛానల్ రిపోర్టర్ అతి చేష్టలను ప్రశ్నించాడు. ఇప్పటికే సమస్య ఉంది? మీరిలా రైతులను ఉద్ధేశపూర్వకంగా రెచ్చగొడితే ఎలా? రిపోర్టర్ విధులు ఇవి కావనుకుంటా? అని సర్ధిచెప్పే ప్రయత్నం చేశాడు. వినకపోవడంతో రిపోర్టర్ ప్రవర్తనను ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ తన ఫోన్ ద్వారా వీడియో తీయడం ప్రారంభించాడు. అయితే తనను వీడియో తీస్తున్నట్లు గమనించిన ఆయా ఛానల్ రిపోర్టర్ ఆక్రోశంతో ఏఎస్ఐని బెదిరిస్తూ, నన్నే వీడియో తీస్తావా? ఎవరు నువ్వు? అంటూ అతని చేతిలో గల మొబైల్ ఫోన్ ను లాక్కుని నేలకేసి కొట్టడంతో అది ధ్వంసమైనట్లు సమాచారం.

ఈ ఘటనతో అవాక్కయిన ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ తన విధులకు భంగం కలిగించారని భావించి కొణిజర్ల పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెడుతుండగా, ఛానల్ రిపోర్టర్ తనకు గల పాత పరిచయాలతో ఓ పోలీసు ఉన్నతాధికారికి ఫోన్ చేసి ఏఎస్ఐ తనపై పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో మంత్రి తుమ్మల వెంటే నిత్యం ఉండే కాంగ్రెస్ నాయకుడు సైతం ఆయా ఛానల్ రిపోర్టర్ కు మద్ధతుగా ఓ పోలీసు ఉన్నతాధికారికి ఫోన్ చేసి, ఏఎస్ఐ ఫిర్యాదు చేయకుండా నిలువరించారనే ప్రచారం జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రశాంతంగా ఎరువుల పంపిణీ జరుగుతున్న ప్రాంతానికి ప్రభుత్వ వ్యతిరేక మీడియాకు చెందిన రిపోర్టర్ వెళ్లి ప్రవర్తించిన తీరుపై తుమ్మల అనుచరుడే అతనికి మద్ధతుగా నిలిచారనే అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మొత్తంగా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును ‘బద్నాం’ చేసేందుకు ప్రభుత్వ వ్యతిరేక మీడియాకు చెందిన ఛానల్ రిపోర్టర్ ఓవరాక్షన్ ఘటన ఇటు కాంగ్రెస్ లోనే కాదు, అటు ఖమ్మం జిల్లా మీడియా సర్కిళ్లలో, పోలీసు శాఖలో భిన్నాభిప్రాయాలకు తావు కల్పిస్తోంది. కాగా ఇదే రిపోర్టర్ గతంలోనూ పలు అంశాల్లో తీవ్ర వివాదాస్పదమయ్యాడు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇతని వ్యవహార తీరుపై పలు ఆరోపణలు కూడా రావడం గమనార్హం. చూడాలి ఈ ఉదంతంపై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఏ విధంగా స్పందిస్తారో..?

Popular Articles