Top 5 This Week

Related Posts

ఖమ్మం జిల్లాలో ప్రముఖ వ్యాపారవేత్తల ‘హీరో’యిజం

ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఈశ్వరప్రగడ హరిబాబు, అతని కుమారుడు రంగనాధ్ పెనుబల్లి మండల కేంద్రంలో బైకుల విధ్వంసానికి పాల్పడిన ఘటన తీవ్ర వివాదాస్పదమవుతోంది. దశాబ్ధాలుగా ఖమ్మ జిల్లాలో ప్రముఖ బైకుల కంపెనీ డీలర్ గా వ్యవహరిస్తున్న హరిబాబు తన కుమారునితో కలిసి అదే కంపెనీకి చెందిన ద్విచక్ర వాహనాల విధ్వంసానికి పాల్పడిన ఉదంతం తీవ్ర చర్చకు దారి తీసింది. ప్రముఖ చార్టెడ్ అకౌంటెంటుగానేగాక, ఖమ్మం నగరంలో ఓ స్టార్ హోటల్ ను నిర్వహిస్తున్న హరిబాబు, అతని కుమారుడు పెనుబల్లి మండలం కేంద్రంలో సాగించిన విధ్వంసపు ఘటన ఇప్పుడు వ్యాపార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

ఖమ్మంలో శ్రీశ్రీశ్రీ ఆటోమోబైల్స్ పేరుతో ప్రముఖ సంస్థ హీరో కంపెనీకి చెందిన బైకుల ప్రధాన డీలర్ గా తన వ్యాపార కార్యకలాపాలను సాగిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బోనకల్, పెనుబల్లి, ఇల్లెందు తదితర ప్రాంతాల్లో ఇతరులకు సబ్ డీలర్ షిప్ ఇచ్చి హీరో బైకుల విక్రయాలను చేస్తున్నారు. అయితే బుధవారం పెనుబల్లి సబ్ డీలర్ షిప్ హీరో బైకుల విక్రయ కేంద్రంలో ఈశ్వరప్రగడ హరిబాబు, అతని కుమారుడు రంగనాథ్ బైకుల విధ్వంసానికి పాల్పడినట్లు సీసీ ఫుటేజీ వీడియో వెల్లడిస్తోంది.

అయితే తాము వారివద్ద బైకులు కొనుగోలు చేయడంలేదనే నెపంతో తమ షోరూంకు వచ్చి హరిబాబు, అతని కుమారుడు రంగనాథ్ బైకుల విధ్వంసానికి పాల్పడినట్లు పెనుబల్లి హీరో షోరూం సంస్థ నిర్వాహకుడు స్థానిక మీడియా వర్గాలకు చెప్పారు. సీసీ ఫుటేజీ ఆధారంగా తాను ఈ ఘటనపై ఫిర్యాదు చేయనున్నట్లు కూడా పేర్కొన్నారు. కానీ ఈ ఉదంతానికి దారి తీసిన పరిస్థితులు, పరిణామాలపై ‘సమీక్ష’ న్యూస్ ఈశ్వర ప్రగడ హరిబాబును వివరణ కోరగా, పెనుబల్లి సబ్ డీలర్ కంపెనీ నిబంధనలను ఉల్లంఘించినందువల్లే తాము ఆయా ఘటనకు పాల్పడాల్సి వచ్చిందన్నారు.

జిల్లాలో తాను హీరో కంపెనీ బైకుల విక్రయానికి ప్రధాన డీలర్ నని, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పలువురికి సబ్ డీలర్ షిప్ ఇచ్చి వ్యాపారం చేస్తున్నట్లు చెప్పారు. కానీ పెనుబల్లి షోం రూం నిర్వాహకులు కంపెనీ నిబంధనలను ఉల్లంఘించి, భద్రాచలం నుంచి బైకులు తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇన్సూరెన్స్ నుంచి, బైకుల విక్రయం వరకు వివిధ అంశాల్లో కంపెనీ రూల్స్ కు విరుద్ధంగా అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఫలితంగా తమ విక్రయాలు పడిపోయి, తాము బంగారం తాకట్టు పెట్టి బ్యాంకుల్లో రుణం తీసుకోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయని, దాదాపు రూ. 1.50 కోట్ల మేర వాహనాల విక్రయాలు స్తంభించాయన్నారు.

ఆయా అనేక పరిణామాల్లో తమకు ఆవేశం కలిగినమాట వాస్తవమేనని హరిబాబు చెప్పారు. కంపెనీ నిబంధనలను అతిక్రమించిన పెనుబల్లి సబ్ డీలర్ షిప్ ను రద్దు చేయాలని తమకు సంస్థ నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ సంయమనం పాటించినట్లు చెప్పారు. ఆర్థికంగా తమకు నష్టం వాటిల్లిన పరిణామాల్లోనే ఆగ్రహం కలిగిందని ఈశ్వరప్రగడ హరిబాబు ‘సమీక్ష’ న్యూస్ తో పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై తమకు ఇప్పటి వరకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని, బాధితులు ఫిర్యాదు చేస్తే చట్టప్రకారం చర్య తీసుకుంటామని పోలీసు వర్గాలు ‘సమీక్ష’ న్యూస్ కు చెప్పాయి.

Popular Articles