సరైన శాస్త్రీయత లేకుండా కాంట్రాక్టర్ ల కోసం అనాటి ప్రభుత్వం బస్సు డిపో రోడ్ లో డివైడర్ లు కట్టి డిపో రోడ్ ను అస్తవ్యస్తంగా చేశారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమైనా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని బస్సు డిపో రోడ్ ను 100 అడుగుల మేర విస్తరణ చేయాలని సీపీఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్ డిమాండ్ చేశారు. ఆదివారం పార్టీ ఖమ్మం టూ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో డిపో రోడ్ లో డివైడర్ లను తొలిగించిన తీరును పరిశీలన చేశారు.
ఈ సందర్భంగా వై విక్రమ్ మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా తమ పార్టీ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకుని డిపో రోడ్ ను వెడల్పు చేయాలని ఆందోళనలు చేశామన్నారు. నూతన బస్టాండ్ బైపాస్ రోడ్ వైపు రావడం ఫలితంగా డిపో రోడ్ లో ట్రాఫిక్ బాగా పెరిగి వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, డిపో రోడ్ లో చిన్న వెహికల్ ఆగినా ట్రాఫిక్ విపరీతంగా జామ్ అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం నిధులు కేటాయించి రోడ్ వెడల్పు చేయకుండా కాంట్రాక్టర్ ల లాభాలు కోసం కేవలం ఎటువంటి శాస్త్రీయత లేకుండా కేవలం డివైడర్ లు మాత్రమే కట్టి ట్రాఫిక్ సమస్యను మరింత తీవ్రతరం చేశారని విమర్శించారు.

ఇప్పుడు జిల్లా మంత్రి జోక్యం చేసుకుని భవిష్యత్తు ట్రాఫిక్ దృష్టిలో ఉంచుకుని 100 అడుగుల రోడ్ గా వెడల్పు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కేవలం అధికారులు డివైడర్ లు మాత్రమే తొలిగిస్తే సమస్య పరిష్కారం కాదన్నారు. రోడ్ వెడల్పు చేసి ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ టూ టౌన్ కార్యదర్శి బోడపట్ల సుదర్శన్, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు టి.విష్ణు వర్ధన్, నాయకులు భుక్యా ఉపేంద్ర, జె వెంకన్న బాబు, షేక్ హుస్సేన్, నాగేశ్వరరావు, ఏటా రాజేష్, మల్లికార్జున్ రెడ్డి, గుమ్మడి బిక్షం, వినోద్ , షేక్ షఫీ, రమేష్ తదితరులు పాల్గొన్నారు

