Top 5 This Week

Related Posts

ఖమ్మంలో మరో ఆధ్మాత్మిక వైభవానికి 12న అంకురార్పణ

ఖమ్మం: ఖమ్మం నగరంలో ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత పెంపొందించేలా అల్లీపురంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించనున్నట్లు తెలంగాణా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రకటించారు. భద్రాద్రి రాముడు కొలువైన ఖమ్మం జిల్లాలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఖమ్మం నగరంలోని అల్లీపురం వద్ద టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ స్థలాన్ని శనివారం మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. ఆలయ నిర్మాణానికి కేటాయించిన భూమి విలువ సుమారు రూ.100 కోట్ల వరకు ఉంటుందన్నారు. భూసేకరణ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డిని ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.

అల్లీపురం వద్ద టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ స్థలాన్ని అదనపు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లతో కలిసి పరిశీలిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ నిర్మాణానికి ఎంతో భక్తి భావంతో ఆమోదం తెలిపారని, టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు సహకారంతో ఆలయ నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించేలా సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ఈ నెల 12న అల్లీపురం వద్ద ఆలయ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. అమరావతిలోనీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నమూనాలోనే అల్లీపురంలో ఆలయాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు.

ఆగమ శాస్త్ర నిబంధనలకు అనుగుణంగా ఆలయ నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. భూమిపూజ కార్యక్రమానికి ఖమ్మం నగరంలోని అన్ని సంఘాలు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఆలయ నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఖమ్మం నగరం నుంచే కాకుండా నల్గొండ, వరంగల్ తదితర జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చేలా భూమి పూజ కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పించాలని మంత్రి సూచించారు. మీడియా ప్రతినిధులు ప్రత్యేక కథనాలు ప్రచురిస్తూ కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు.

Popular Articles