Top 5 This Week

Related Posts

రైతుల పెద్దన్నా..! ఆ ‘ఎగవేత’ల సంగతేందన్నా!?

(సమీక్ష ప్రత్యేక కథనం)
‘ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం సుభిక్షంగా ఉండదు. ఈనానుడిని మా ప్రభుత్వం, వ్యక్తిగతంగా నేను సంపూర్ణంగా విశ్విస్తాను, నమ్ముతాను..’
ఇవీ నిన్న సిద్దిపేట జిల్లా నర్మెటలో నిర్వహించిన రైతు ఉత్సవాల సభలో తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. రైతు భరోసాగా పేరు మార్చిన ‘రైతుబంధు’ నిధుల విడుదలలో ఈసారి ప్రభుత్వం వినూత్నంగా వ్యవహరిస్తుండడమే చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 3,600 కోట్ల నిధులు రైతు భరోసా పథకం ద్వారా విడుదల చేస్తున్నామని, మిగతా నిధులు వచ్చే 45 రోజుల్లో దశలవారీగా 20 రోజులకోసారి విడుదల చేస్తామని సీఎం నిన్నటి సబలో వెల్లడించారు.

‘పోయినసారి మనదగ్గర నగదు ఉండె.. తొమ్మిది రోజుల్లోనే రూ. 9,000 కోట్ల రైతు భరెోసా నిధులను ఆయాల్ల మీ ఖాతాల ఏసినం.. మీ అకౌంట్లల్ల ఒక్కసారి జూసుకోండి.. తొమ్మిది రోజుల్లోనే ఆయాల్ల ఏసినం.. ఆయల్ల ఉన్నయ్ గాబట్టి మీకే ఒడ్డించినం..ఇయ్యాల కొంచెం ఎన్క ముందుంది గాబట్టి 45 రోజుల్లో రూ. 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేసి రైతును రాజును చేసే బాధ్యత నాదీ, మా ప్రభుత్వానిది.. అండగా ఉండండి. ఆశీర్వదించండి’ అని సీఎం రేవంత్ రెడ్డి రైతులను కోరారు.

అయితే రైతు భరోసా నిధుల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం గడచిన నాలుగు సీజన్లలో రెండు సీజన్లకు రైతులకు అన్యాయం చేసిందనే విమర్శలకు ఆధారాలు లేకపోలేదు. అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా 2023 యాసంగి పంట పెట్టుబడి నిధులు ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపివేశారు. తమ ప్రభుత్వం వచ్చాక ఎకరానికి రూ. 15,000 చొప్పున ఇస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి యాసంగి 2023 యాసంగి పంట భరోసా నిధులను 2024 మార్చిలో విడుదల చేశారు.

ఆ తర్వాత రైతుబంధు అంశంలో తర్జన, భర్జనలు కొనసాగాయి. రాళ్లు, రప్పలు, గుట్టలు గల భూములకు ఇవ్వాలా? వద్దా? ఎకరాలకొద్దీ భూములు గల భూస్వాములకు రైతుబంధు పథకాన్ని వర్తింపజేయాలా? వద్దా? అనే మీమాంస, చర్చల మధ్యే పుణ్యకాలం కాస్తా గడిచిపోయి 2024లో రైతులకు భరోసా నిధులు మొత్తానికే ఇవ్వకపోవడం గమనార్హం. ఆ తర్వాత ఎట్టకేలకు హామీ ప్రకారం ఎకరానికి రూ. 15,000 మొత్తం కాకుండా.. రూ. 12,000 చొప్పున నిర్ణయిస్తూ 2025 మార్చిలో, అదే సంవత్సరం జూన్ లో రెండుసార్లు రైతుభరోసా నిధులను విడుదల చేశారు.

అంటే 2024, 2025 సంవత్సరాల్లో మొత్తం నాలుగుసార్లు రైతుల ఖాతాల్లో జమచేయాల్సిన భరోసా నిధులను కేవలం రెండుసార్లు అందించారనేది సుస్పష్టం. ఇదే దశలో ఈసారి యాసంగి పెట్టుబడి కింద ఇవ్వాల్సిన రైతు భరోసా నిధులను ప్రస్తుతం పంట ముగిసే సమయానికి వినూత్న తరహాలో విడుదల చేయడం గమనార్హం. గత పద్ధతికి భిన్నంగా రైతుకు భూమి ఎంత ఉన్నప్పటికీ, సోమవారం ఎకరం వరకు రైతు భరోసా నిధులు జమ అవుతాయని చెబుతున్నారు. మరో 45 రోజుల్లో వంతులవారీగా నిధులను జమ చేస్తామని సాక్షాత్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

అయితే ఈ నిధులు గత యాసంగి పంటకు సంబంధించినవేనా? అనే రైతుల ప్రశ్నపై మాత్రం అధికారికంగా స్పష్టత లేదు. రైతుభరోసా కింద నిరుడు బడ్జెట్ లో రూ. 18,000 కోట్లను కేటాయించిన ప్రభుత్వం కేవలం వానాకాలం సీజన్ కు మాత్రమే రూ. 8881 కోట్ల నిధులను విడుదల చేసింది. యాసంగి పంట నిధులను ఇప్పటి వరకు విడుదల చేయలేదు. కానీ ఈసారి బడ్జెట్ లోనూ రైతు భరోసా కింద రూ. 18,000 కోట్లను కేటాయించింది.

ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెలాఖరు వరకు దశలవారీగా విడుదల చేస్తామని ప్రకటించిన రైతు భరోసా నిధులు ప్రస్తుత యాసంగి పెట్టుబడి సాయం కిందనే పరిగణిస్తారా? లేదా? అనేది రైతుల్లో ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ప్రస్తుతం ఎకరం వరకు విడుదల చేసిన భరోసా నిధులను ‘తొలివిడత’గా ప్రభుత్వం వర్గాలు చెబుతుండడమే ఇందుకు కారణం. ఈ పరిస్థితుల్లో వచ్చే ఖరీఫ్ సీజన్ పెట్టుబడి సాయాన్ని జూన్ లో విడుదల చేస్తే తప్ప ప్రస్తుతం విడుదల చేసిన నిధులను యాసంగి సాయం కింద పరిగణించే అవకాశం లేదు. ఒకవేళ జూన్ లో ప్రభుత్వం మళ్లీ నిధులను విడుదల చేయకుంటే మాత్రం గత యాసంగి నిధులకు సర్కారు మంగళం పాడినట్లుగానే భావించాల్సి వస్తుందని కర్షక వర్గాలు చెబుతు యి.

మొత్తంగా రైతుభరోసా నిధుల అంశంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కర్షకుల నుంచి విమర్శల పాలవుతోందనేది కాదనలేని నిజం. ఈ పరిస్థితుల్లో రైతులకు ‘పెద్దన్న’గా ఉంటానని సీఎం రేవంత్ ఇచ్చిన భరోసాపై.. మరి గత ఎగవేతల సంగతేందన్నా..? అని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇదే దశలో ప్రస్తుత నిధుల విడుదల, వచ్చే ఖరీఫ్ సీజన్ పెట్టుబడి సాయానికి సంబంధించిన అంశంలో పూర్తి స్పష్టత రావాలంటే ఏప్రిల్ నెలాఖరు వరకు, ఆ తర్వాత ఖరీఫ్ సీజన్ వరకు వేచి చూడాలని రైతు వర్గాలు చెబుతున్నాయి.

Popular Articles