ఛత్తీస్ గఢ్ అడవుల్లో భద్రతా బలగాలు గట్టి పట్టును సాధిస్తున్నాయి. మావోయిస్టు నక్సలైట్లకు చెందిన ఆయుధ సామాగ్రి గుట్టు మట్లను రట్టు చేస్తున్నాయి. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీని కోలుకోలేని దెబ్బ తీస్తున్న వివిధ రకాల పోలీసు బలగాలు వారి ఆయువుపట్టు ప్రాంతాల ఆచూకీని కనుక్కుంటూ ఆయుధపరంగానూ తీవ్ర నష్టానికి గురి చేస్తున్నాయి. బీజాపూర్ జిల్లా భట్టి గూడ అడవుల్లో మావోయిస్టుల శిక్షణా శిబిరాన్ని పోలీసులు ఇటీవలే ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు తమ ఆయుధ సంపత్తిని, ఇతరత్రా మందుగుండు సామాగ్రిని దాచిపెట్టిన రహస్య బంకర్లను, గుట్టల్లోని ‘డెన్’ వంటి ప్రదేశాలను కనుగొన్నాయి. బీజాపూర్, సుక్మా జిల్లా అడవుల్లో మావోయిస్టులు తమ భద్రత కోసం తవ్వుకున్న రహస్య సొరంగాలను సైతం పోలీసులు కనిపెట్టారు. ఇదే దశలో తాజాగా నక్సలైట్లకు చెందిన భారీ డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుక్మా జిల్లా మెటగూడ, డ్యూలర్ గ్రామల సమీపంలో ని అటవీ ప్రాంతంలో 203 కోబ్రా బెటాలియన్, 131 సీఆర్పీఎఫ్ బలగాలు జాయింట్ ఆపరేషన్ ద్వారా మావోయిస్టులకు చెందిన భారీ డంపును స్వాధీనం చేసుకున్నాయి. ఈ డంపులో మందుపాతరలు, బ్యారల్ గ్రెనేడ్ లాంఛర్లు, జనరేటర్, లేత్ మిషన్, తుపాకుల తయారీకి ఉపయోగించే వివిధ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు ఛత్తీస్ గఢ్ లోని నారాయణ్ పూర్, బీజాపూర్ జిల్లాల్లో 23 మంది మావోయిస్టు నక్సలైట్ల పోలీసులకు లొంగిపోయారు. బీజాపూర్ జిల్లా ఊసూరు ప్రాంతానికి చెందిన 14 మంది, నారాయణ్ పూర్ జిల్లాకు చెందిన 9 మంది నక్సలైట్లు లొంగిపోయినట్లు పోలీసులు అధికారిక ప్రకటన చేశారు.
ఛత్తీస్ గఢ్ అడవుల్లో మావోయిస్టులకు చెందిన డంపుల్లో, డెన్ లాంటి గుట్టల్లోని రహస్య స్థావరాల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న వివిధ రకాల ఆయుధ సామాగ్రిని ఈ దిగువన గల వీడియోలో చూడవచ్చు.
. .

