Top 5 This Week

Related Posts

బెంగళూరు నుంచి పట్టుకొస్తుంటే చూశావా? కొయ్యూరు ‘ఎన్కౌంటర్’పై ఆ ఎస్పీ ఫోన్

ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఘటన హిడ్మా ‘ఎన్కౌంటర్’. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పీఎల్జీఏ బెటాలియన్-1 కమాండర్ మడ్వి హిడ్మా ఎన్కౌంటర్ ఉదంతంపై భిన్నాభిప్రాయాలకు సోషల్ మీడియా మాంచి వేదికగా మారిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ కగార్ తో కకావికలమవుతున్న మావోయిస్ట్ పార్టీకి చెందిన కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ మాత్రమే కాదు, హిడ్మా వంటి కేంద్ర కమిటీ సభ్యులు ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోతున్న ఉదంతాలు ఆ పార్టీ చరిత్రలో సంచలన వార్తాంశాలుగా మారాయి.

కానీ 26 ఏళ్ల క్రితమే ఇటువంటి ‘అతిపెద్ద’ నష్టపు ఘటనను ఇప్పటి మావోయిస్ట్, అప్పటి పీపుల్స్ వార్ పార్టీ ఎదుర్కుంది. అదే కొయ్యూరు ఎన్కౌంటర్.. ఈ ఘటనలో అప్పటి పీపుల్స్ వార్ కేంద్ర కమిటీ సభ్యుడు నల్లా ఆదిరెడ్డి అలియాస్ శ్యాం, రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి అలియాస్ మహేష్, ఉత్తర తెలంగాణా కమిటీ కార్యదర్శి శీలం నరేష్ అలియాస్ జగన్ లతోపాటు లక్ష్మీరాజం అనే మరో యువకుడు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్ ఘటన గురించి కొత్తగా చెప్పేదేముంది? అందరికీ తెలిసిందే కదా! అని భావిస్తే వార్త వెనుక గల ఆసక్తికర అంశం మిస్సయినట్లే..

కొయ్యూరు ఎన్కౌంటర్ మృతుల స్మారక స్థూపం (ఫైల్)

ప్రతి ఎన్కౌంటర్ కూ ఓ నేపథ్యం ఉంటుంది. అందుకు దారి తీసిన పరిస్థితులు ఉంటాయి. ఎన్కౌంటర్ ఎందుకు చేయాల్సి వచ్చిందో పోలీసులు వెల్లడిస్తారు. దాని పూర్వాపరాల లోతు ఏమిటో పరిశీలించి, అవసరమైతే పరిశోధించి, అందిన విశ్వసనీయ సమాచారం మేరకు జర్నలిస్ట్ అనేవాడు తాను పనిచేసే సంస్థ పాఠకులకు ప్రత్యేకం(Exclusive) వార్తా కథనంగా అందిస్తుంటాడు. వృత్తిపరంగా జర్నలిస్టు విధుల్లో ఇదో భాగం. ప్రధాన పత్రికల మధ్య పోటీ తీవ్రంగా ఉన్నపుడు పత్రిక ప్రతిష్టను మరింత పెంచేందుకు కమిటెడ్ గా పనిచేసే ప్రతీ జర్నలిస్ట్ ఇదే విధంగా వ్యవహరిస్తాడు. ఈ నేపథ్యంలోనే విప్లవోద్యమ చరిత్రలోనే సంచలన ఘటనగా నిలిచిన కొయ్యూరు ఎన్కౌంటర్ జరిగి సరిగ్గా 26 ఏళ్లు పూర్తయిన సందర్బంగా అటువంటి ఆసక్తికర అంశాన్ని వివరించే ప్రయత్నమిది.

అది.. 1999వ సంవత్సరం.. డిసెంబర్ 2వ తేదీ. నేను కరీంనగర్ జిల్లా ‘వార్త’ స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేస్తున్నాను. నేను రాసే ‘క్రైం’ వార్తలకు ప్రత్యేకంగా ‘ప్రభాతవార్త క్రైం బ్యూరో’ అనే డేట్ లైన్ ను యాజమాన్యం ఇచ్చింది. ఆరోజు ఉదయం 10 గంటలకల్లా ఆఫీసుకు వచ్చాను. దాదాపు 11.00 గంటల ప్రాంతంలో స్పెషల్ బ్రాంచ్ ఆఫీసు నుంచి ఫోన్ కాల్.. అప్పట్లో ల్యాండ్ ఫోన్లు మాత్రమే ఉండేవి. మల్హర్ మండలంలో ఎన్కౌంటర్ జరిగిందని, ఓ నక్సలైట్ చనిపోయాడనేది సమాచారం. ఆ తర్వాత మరో గంటకు ఇంకో ఫోన్ కాల్. ఒక్కరు కాదు, ఎన్కౌంటర్ మృతులు ఇద్దరు.. అనేది తాజా సమాచారం. ఒక్కరు లేదా ఇద్దరు చనిపోయిన ఎన్కౌంటర్ ఘటనలను జర్నలిస్టులు అప్పట్లో సాధారణంగా భావించే పరిస్థితి ఉందేది.

కొయ్యూరు ఎన్కౌంటర్ లో మృతి చెందిన పీపుల్స్ వార్ అగ్రనేతలు నల్లా ఆదిరెడ్డి, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి, శీలం నరేష్ (ఫైల్)

ఆ తర్వాత మరో గంటకు స్పెషల్ బ్రాంచ్ ఆఫీసు నుంచే సీఐ వీరేశ్వర్ రావు నుంచి ఫోన్. మొత్తం నలుగురు నక్సలైట్లు చనిపోయినట్లు వెల్లడి. అందులో ముఖ్య నాయకులు కూడా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. మల్హర్ మండలంలోని అడవి సోమన్ పల్లి-కొయ్యూరు అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ ఘటనా స్థలానికి మీడియాను తీసుకువెళ్లేందుకు ఎస్పీ ఆఫీసు నుంచే వాహనం ఏర్పాటు చేసినట్లు సీఐ వీరేశ్వర్ రావు చెప్పారు. ఒక్కసారిగా అలర్ట్ అయ్యింది నా బుర్ర. మృతులు నలుగురు అంటే.. పెద్ద ఎన్కౌంటరే. ముఖ్యనేతలు ఉన్నట్లు చెబుతూనే, వెహికిల్ ఏర్పాటు చేశారంటే భారీ ఘటనగానే ఓ అంచనా. వార్త ఆఫీసుకు ఎదురుగానే ఉండేది కరీంనగర్ ఎస్పీ ఆఫీసు. కాకపోతే ఎంట్రన్స్ ఫారెస్ట్ ఆఫీసు వైపు వెళ్లే మార్గం నుంచి ఉండేది. వెనుకవైపు గ్రౌండ్ నుంచి మాత్రం నడుచుకుంటూ కూడా వెళ్లవచ్చు.

నేను ఎస్పీ ఆఫీసుకు వెళ్లేసరికే పోలీసులు ఏర్పాటు చేసిన ఓ జీపు ముందే వెళ్లిపోయింది. అందులో కొందరు జర్నలిస్ట్ మిత్రులు వెళ్లిపోయారు మరో జీపు బయలుదేరడానికి సిద్దంగా ఉంది. కాస్త ఆలస్యంగా అక్కడికి వచ్చిన నాతో సహా జర్నలిస్టులను తీసుకుని మహీంద్రా కమాండర్ పోలీస్ జీపు సుల్తానాబాద్, పెద్దపల్లి, మంథని మీదుగా వేగంగా వెడుతోంది. దాదాపు 100 కి.మీ వేగంతో ఆ జీపును పోలీస్ డ్రైవర్ నడుపుతున్నారు. అప్పట్లో అదే జెట్ స్పీడ్ గా భావించవచ్చు. ఘటనా స్థలానికి చేరుకునే సరికే సాయంత్రం అయింది. చలికాలం కదా..? కాస్త త్వరగానే చీకటి కూడా పడుతోంది. అక్కడి వాతావరణం, దృశ్యం అత్యంత బీభత్సంగా ఉంది. భారీ ఎత్తున ఏర్పాటు చేసిన టెంట్లు, ఏదో ఫంక్షన్ జరిగినట్లు, వందలాది మందికి వంట చేసే సామర్థ్యం గల పెద్దపెద్ద గిన్నెలు, పాత్రలు, ఓ భారీ జనరేటర్ వంటి సామాగ్రితో ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశపు భౌతిక స్థితి సాక్షాత్కరించింది.

అటవీ ప్రాంతమంతా కాల్పులతో దద్దరిల్లినట్లు, నక్సలైట్ల సామూహిక సమావేశంపై పోలీసులు విరుచుకుపడినట్లు కనిపిస్తున్న ఎన్కౌంటర్ ఘటనా స్థలి దృశ్యం. పీపుల్స్ వార్ నక్సలైట్లు ‘ప్లీనరీ’ నిర్వహిస్తున్నారని, మిలిటరీ శిక్షణ కూడా ఇస్తున్నట్లు తమకు అందిన విశ్వసనీయ సమాచారంతో గాలింపు చర్యలు చేపట్టగా, ఎదురుపడిన నక్సలైట్లను లొంగిపోవాలని హెచ్చరికలు, కాల్పులు జరిపిన నక్సల్స్, ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు.. ఫలితమే ఎన్కౌంటర్. ఈ ఘటనలో మొత్తం నలుగురు నక్సలైట్లు చనిపోయారని, అందులో పార్టీ అగ్ర నేతలు, కేంద్ర కమిటీ సభ్యులు నల్లా ఆదిరెడ్డి, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి, శీలం నరేష్ లు ఉన్నట్లు పోలీసుల సమాచారం. చనిపోయిన మరో నక్సల్ ను గుర్తించాల్సి ఉందని ప్రకటన. ఎన్కౌంటర్ స్థలంలో 30 మంది నక్సల్స్ ఉండగా, మిగతా వారు తప్పించుకున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. డీజీపీ హెచ్ జె. దొర కూడా హైదరాబాద్ నుంచి వివరాలు వెల్లడించారు.

‘వార్త’ దినపత్రిక ప్రచురించిన స్పాట్ స్టోరీ

ఇంకేముంది తెలుగు మీడియానే కాదు, ఆంగ్ల మీడియా కూడా మరుసటి రోజు కొయ్యూరు ఎన్కౌంటర్ ఘటనను బ్యానర్ స్టోరీగా ప్రచురించాయి. నేను పనిచేస్తున్న ‘వార్త’ పత్రిక కూడా ఘటనను ‘ముగ్గురు వార్ అగ్రనేతల ఎన్కౌంటర్’ శీర్షికతో బ్యానర్ స్టోరీగా ప్రచురిస్తూనే, దాని పక్కనే డబుల్ కాలమ్ స్టోరీగా ‘బెంగుళూరు నుంచి పట్టుకొచ్చారా?’ అనే హెడ్డింగ్ తో మరో ఆసక్తికర వార్తా కథనాన్ని ప్రచురించింది. కొయ్యూరు ఎన్కౌంటర్ తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, పీపుల్స్ వార్ కు చెందిన ముగ్గురు అగ్రనేతలను బెంగుళూరు నుంచి పట్టకొచ్చారని, సారక్కిగేట్ అనే డెన్ నుంచి వారిని పట్టుకుని ఎన్కౌంటర్ లో కాల్చి చంపారనే ఆరోపణలతో కూడిన ప్రచారం జరుగుతోందనేది ఆయా వార్తా కథనపు సారాంశం.

‘వార్త’ దినపత్రిక ప్రచురించిన ప్రత్యేక వార్తా కథనం

‘వార్త’ పత్రిక ప్రచురించిన ఈ ప్రత్యేకం కథనం (Exclusive Story) అప్పట్లో పెను సంచలనం. కేవలం ‘వార్త’లో మాత్రమే ఈ కథనం పబ్లిష్ అయింది. మిగతా పత్రికలన్నీ వెనుకబడిపోయాయి. వార్తను రాసిన నాకు పత్రిక సీఎండీ గిరిష్ సంఘీ, ఎడిటర్ రామచంద్రమూర్తి, పత్రికకు చెందిన ఇతర ముఖ్యుల నుంచి ప్రశంసలు. పాఠకలోకం నుంచి కూడా అభినందనలు. సహచర జర్నలిస్టుల నుంచి ఆరోగ్యకరమైన పోటీ తత్వంతో కూడిన కితాబులు. ఇదే సమయంలో అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్పీ, ఇప్పటి జమ్మూ కశ్మీర్ డీజీపీ నళిన్ ప్రభాత్ నుంచి సైతం ఉదయాన్నే ఫోన్ కాల్. ఆయనకు తెలుగు భాష అంతంత మాత్రమే. నాకూ హిందీ భాషపై పూర్తి పట్టు లేదు. అవసరానికి వరంగల్, హైదరాబాద్ లతో కూడిన ఉర్దూను మిక్స్ చేసి మాట్లాడడం మాత్రమే నాకు అప్పటి వరకు తెలిసిన హిందీ భాష.

కరీంనగర్ లో ఎస్పీగా విధులు నిర్వహించిన ప్రస్తుత జమ్మూ కశ్మీర్ డీజీపీ నళిన్ ప్రభాత్

గుర్తున్నంత వరకు ఇదీ ఫోన్ లో ఎస్పీ నళిన్ ప్రభాత్, నాకూ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ:

ఈ నేపథ్యంలోనే పౌరహక్కుల సంఘం వాళ్లు సైతం కొయ్యూరు ఎన్కౌంటర్ బూటకమని, బెంగుళూరులోని సారక్కి గేట్ నుంచి నల్లా ఆదిరెడ్డిని, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డిని, శీలం నరేష్ ను పట్టుకొచ్చి కాల్చి చంపారని ఆరోపించడం గమనార్హం. కొయ్యూరు ఎన్కౌంటర్ పై ఇటువంటి తీవ్ర ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే, ఆ మరుసటి రోజు ఎస్పీ నళిన్ ప్రభాత్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆరోపణలను తోసిపుచ్చారు. ఎన్కౌంటర్ బూటకమనే ఆరోపణలు నిరాధారమని, తాను ఆర్ఈసీలో చదువుకోలేదని, నక్సలైట్లకు, తమకు వ్యక్తిగత వైరం కూడా ఏమీ లేదని వ్యాఖ్యానించడం విశేషం. పౌర హక్కుల సంఘం ఆరోపణలకు నళిన్ ప్రభాత్ ఆ తర్వాత పరిణామాల్లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

మొత్తం ఘటనలో ఐపీఎస్ అధికారి నళిన్ ప్రభాత్ వ్యవహారశైలి ఈ సందర్భంగా ప్రత్యేక ప్రస్తావనార్హం. ఇటువంటి వార్తలు రాసిన ఏ విలేకరిపైనా ఆయన వ్యక్తిగత కోపం పెంచుకునేవారు కాదు. ఉదయం ఫోన్ చేసి ఆగ్రహించినా, ఏ సాయంత్రానికో మళ్లీ ఫోన్ చేసి, లేదా మరో సందర్బంలోనో.. తమకూ ఒత్తిళ్లు ఉంటాయని, ఇటువంటి వార్తల వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని ఆఫ్ ది రికార్డుగా పేర్కొనేవారు. ఉదయం వేళ ఆగ్రహించినా, సాయంత్రానికి చల్లబడేవారు. అలా రాస్తే ఎలా? అనే తరహాలో కూల్ గానే మాట్లాడేవారు.

ఇప్పుడు ఈ పరిస్థితులు ఉన్నాయా? అంటే మాత్రం.. వర్తమాన ఎన్కౌంటర్లు, ఘటనా స్థలాలకు విలేకరులను అనుమతించకపోవడం, నక్సలిజంపై పాలకుల విధానపరమైన అంశాలు అందరికీ తెలిసిందే. అంతేకాదు అటువంటి ‘సాహస’ వార్తలకు ఇప్పటి మీడియా సంస్థల యాజమాన్యాలు ధైర్యంతో స్థానం కల్పిస్తున్నాయా? వాటిని రాసిన విలేకరికి సపోర్ట్ ఇస్తున్నాయా? అనే ప్రశ్నలకు కూడా సమాధానం కొత్తగా చెప్పేదేమీ లేదు. ఇదీ లోకవిదితమే!

కొసమెరుపు: ఇంతకీ ఈ Exclusive ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చిందంటారా? ప్రతి జర్నలిస్టుకూ నమ్మకమైన ‘సోర్స్’ ఉంటుంది. ఆ సోర్స్ విశ్వసనీయమైనదా? కాదా? అనేది చెప్పే వ్యక్తికీ, తెలుసుకునే జర్నలిస్టుకు మధ్య గల వృత్తిపరమైన సంబంధాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇంత భారీ ఎన్కౌంటర్ లో కేంద్ర కమిటీ సభ్యులైన ముగ్గురు అగ్రనేతలు మాత్రమే చనిపోయారనే సంశయంపై సమాచారం తెలుసుకునే ప్రక్రియలో ‘సోర్స్’ను సంప్రదిస్తే ‘బెంగుళూరు, సారక్కి గేట్ డెన్’ అని మాత్రమే రెండు పదాల సమాధానం మాత్రమే వచ్చింది. సోర్స్ ఎవరనేది చెప్పరు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు.. ఎందుకంటే అది వృత్తి ధర్మం కాదు కాబట్టి. చెబితే అతను ‘జర్నలిస్ట్’ కాదు కాబట్టి.

✍ ఎడమ సమ్మిరెడ్డి
(డిసెంబర్ 2, కొయ్యూరు ఎన్కౌంటర్ జరిగిన రోజు)

Popular Articles