(‘AK-47’ ముందుకు ‘హిట్ లిస్ట్’ జర్నలిస్ట్..! తర్వాత ఏం జరిగింది!? పార్ట్ -2)
ఉదయం పత్రిక మాజీ విలేకరి, ఫారెస్టర్ శ్రీహరి హత్య తర్వాత కాజీపేట ఈనాడు విలేకరిగా కొనసాగుతున్న కృష్ణారావు పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. నిత్యం అభద్రతతో, ప్రాణభయంతో జీవించడం అతనికి నరకప్రాయంగానే మారిందని చెప్పాలి. వరంగల్ త్రినగరిలో జీవిస్తున్నప్పటికీ తన నివాస చిరునామాను మిత్రులకు సైతం చెప్పేందుకు కూడా కృష్ణారావు ఇష్టపడేవాడు కాదు. నక్కలగుట్టలోని ఏ గీతాభవన్ చౌరస్తాలోనో, ఇరిగేషన్ ఎస్ఈ ఆఫీసువద్దో అప్పుడప్పుడూ కనిపిస్తూ, భయం భయంగా.. దినదినగండం నూరేళ్ల ఆయుష్షు తరహాలోనే కనిపిస్తుండేవాడు కృష్ణారావు. నేనూ ఈనాడులోనే పనిచేస్తుండడం వల్ల ‘బాబాయ్’గా పరస్పరం సంబోధించుకునేవాళ్లం. శ్రీహరి హత్యానంతరం కృష్ణారావును కాపాడేందుకు దాసరి కృష్ణారెడ్డి తదితర యూనియన్ నాయకులు సంసిద్ధమయ్యారు.
ఇందులో భాగంగానే ప్రతిఘటన పార్టీకి చెందిన లీగల్ నాయకుల ద్వారా సాయుధ నక్సల్స్ నేతలతో మాట్లాడేందుకు వాళ్లు చేయని ప్రయత్నం లేదు. అయితే ఈ ఇద్దరు విలేకరుల ‘హిట్ లిస్ట్’ అంశం పార్టీ జిల్లా నాయకుడు చలమన్న చేతుల్లో మాత్రమే ఉండేది. సత్తెన్న, ప్రసాదన్న నాయకులు చలమన్నకన్నా పార్టీపరంగా పెద్ద హోదాలో ఉన్నప్పటికీ, ఇటువంటి అంశాలలో చలమన్నదే కీలక నిర్ణయంగా ప్రచారం ఉండేది. శ్రీహరి హత్యోదంతం కూడా చలమన్న నాయకత్వంలోనే జరిగిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అందుకే విషయం చలమన్నతోనే పరిష్కారం కావాలనే నిర్ణయానికి జర్నలిస్టు యూనియన్ నాయకులు వచ్చారు. ప్రతిఘటన పార్టీలో చలమన్నది ప్రత్యేక చరిత్రగానే చెప్పాలి. వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, దుందుడుకు స్వభావం, నమ్మినవారికోసం ఎంతకైనా తెగించే వ్యక్తిత్వంగా చలమన్నకు పార్టీలో పేరుండేది.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కాదు బహుషా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విప్లవోద్యమ చరిత్రలోనే అధునాతన AK-47 ఆయుధాన్ని చేబూనిన తొలి నక్సల్ లీడర్ గా చలమన్నకు పేరుండేది. తాడ్వాయి అడవుల్లోని ఓ వాగువద్ద జరిగిన ఎన్కౌంటర్ ఘటనలో AK-47 గొట్టంలోకి ఇసుక దూరిన కారణంగా అది పేలకపోవడంతో దాన్ని అక్కడే వదిలేసి చలమన్న కాల్పుల ఉదంతం నుంచి తప్పించుకున్నారు. ఈ సందర్భంగానే చలమన్నవద్ద AK-47 ఆయుధం ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. అప్పటికీ పీపుల్స్ వార్ వద్దగాని, మరే ఇతర విప్లవ సంస్థ వద్దగాని ఇంకా అప్పటికి AK-47 ఆయుధం లేదు. ఎస్ఎల్ఆర్ వంటి తుపాకులు మాత్రమే జనశక్తి వంటి నక్సల్ గ్రూపు వద్ద ఉండేవని పోలీసులు గుర్తించారు. ప్రతిఘటన గ్రూపులో కోపిష్టి నాయకునిగా ప్రాచుర్యం పొందిన చలమన్న నుంచి పిలుపు వస్తే అప్పట్లో రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు గజగజ వణికపోయేవారు. ఇటువంటి చలమన్నతో మాట్లాడి కృష్ణారావు ప్రాణాన్ని కాపాడేందుకు వరంగల్ సీనియర్ జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘం నాయకులు ఎన్నో తిప్పలు పడ్డారు. చివరి ప్రయత్నంగా తాడ్వాయి మండలం బీరెల్లి గ్రామ అడవులకు సైతం జర్నలిస్ట్ సంఘం నాయకులు వచ్చారు. అప్పుడు నేను కూడా ఈ సీనియర్ జర్నలిస్టుల వెంటే ఉన్నాను. కానీ బీరెల్లి సమీపంలోనే ఉన్న చలమన్న కలిసేందుకు కూడా మాకు అవకాశం ఇవ్వలేదు.
ఈ పరిస్థితుల్లో.. ఏదైనా అవకాశం ఉంటే నువ్వు మాట్లాడి కృష్ణారావు ప్రాణాన్ని కాపాడు సమ్మిరెడ్డీ.. అని విషయం నావైపు నెట్టారు జర్నలిస్టు సంఘం పెద్దలు. మీకే అపాయింట్మెంట్ ఇవ్వని చలమన్న నాకెందుకు కలిసే అవకాశం ఇస్తారు సర్.. అని నేను చెప్పాను. వాస్తవానికి నేను అప్పుడు ఏటూరునాగారం తాలూకా కేంద్రానికి ఈనాడు పత్రికకు కంట్రిబ్యూటర్ ను మాత్రమే. పాత తాలూకా కేంద్రమైన ఏటూరునాగారం కేంద్రానికి నేను ఈనాడుకు తొలి విలేకరిగా నియమితుడినయ్యాను. కాలక్రమంలో మండలానికో విలేకరిని అన్ని ప్రధాన పత్రికలు నియమించినప్పటికీ, ఇప్పటి ఈనాడు తెలంగాణా ఎడిటర్ డీఎన్ ప్రసాద్ గారు (అప్పట్లో కరీంనగర్ యూనిట్ మేనేజర్) నేను వార్తలు కవర్ చేసే మంగపేట, తాడ్వాయి మండల కేంద్రాలకు మరెవరినీ నియమించలేదు. నా న్యూస్ కవరేజీ పట్ల అనేక సందర్భాల్లో ప్రశంసలు కురిపించిన డీఎన్ ప్రసాద్ గారు నేను ఉన్నంతకాలం ఆ మూడు మండలాలు నా పరిధిలోనే ఉంచారని గర్వంగా చెప్పగలను.

ఇటువంటి పరిస్థితుల్లో ఈనాడు విలేకరిగా నాకు ఆ ప్రాంతంలో గల పేరు, ప్రఖ్యాతివల్ల చలమన్న నా మాటను గౌరవిస్తారనేది వరంగల్ స్టాఫర్లుగా పనిచేసిన అప్పటి సీనియర్ల భావన. ఇదే అవకాశంగా హిట్ లిస్టులో గల కృష్ణారావు నా వెంటపడడం ప్రారంభించాడు. తరచూ ఏటూరునాగారం వచ్చి ‘బాబాయ్’ ఓసారి నా గురించి ప్రయత్నించవా? నన్ను కాపాడి నా కుటుంబాన్ని ఆదుకోవా? అని అభ్యర్థించేవాడు. కృష్ణారావు ప్రాణభయాన్ని గమనించిన నేను ఓ ప్రయత్నం చేద్దామని నిర్ణయానికి వచ్చాను. వార్తల కవరేజీ కోసం అప్పుడప్పుడే కాదు.. తరచూ అడవుల్లోకి ఏటూరునాగారం విలేకరులను చలమన్న పిలిపించుకునేవారు. ముఖ్యంగా మద్యపాన నిషేధ ఉద్యమంలో ప్రతిఘటన గ్రూపు కూడా పాలుపంచుకుంది. ఈ సమయంలో ఎక్కువసార్లు చలమన్న అడవుల్లోనే మీడియాతో మాట్లాడేవారు. ఈ పరిచయంతోనే ఓ కొరియర్ కమ్ లీగల్ కార్యకర్త ద్వారా ‘మిమ్మల్ని కలవాలి’ అనే సమాచారాన్ని చలమన్నకు పంపించాను. రెండు, మూడు రోజుల తర్వాత ఆ కొరియర్ వచ్చి ‘విషయం ఏమిటో చెప్పమన్నాడు అన్న’ అని నాతో చెప్పగా, విషయం చలమన్నతోనే మాట్లాడుతాను.. అని బదులిచ్చాను.
ఆ తర్వాత ఓ వారానికో, పదిరోజులకో వచ్చి ఆ కొరియర్ నన్ను మంగపేట మండలం చుంచుపల్లి గుట్టల్లోకి చలమన్నవద్దకు తీసుకువెళ్లాడు. ‘ఏందన్నా అంత రహస్యమా? విషయం కొరియర్ కు కూడా చెప్పలేదు?’ అని చలమన్న నన్ను కుశలోపరిగా ప్రశ్నించాడు. అసలు విషయం చెప్పేస్తూ, కృష్ణారావు గురించి మాట్లాడడానికి వచ్చాను.. అన్నాను. ఆరోజు బీరెల్లికి వచ్చిన మీ జిల్లా విలేకరులతో నువ్వు ఉన్నట్లు నాకు తెలియదనుకున్నావా? వాళ్లతోనే మాట్లాడలేదు.. నీతో ఏం మాట్లాడాలి? కృష్ణారావును వదిలే ప్రసక్తే లేదు. శ్రీహరి గతే అతనికీ పడుతుంది.. అని చలమన్న తేల్చేశాడు. విషయాన్ని ముక్కుసూటిగా చెప్పడంలో చలమన్నకు ప్రత్యేకత ఉంది. నేను నిట్టూర్చాను.. అయినా పట్టు వీడలేదు.
‘రెండు గుట్టలు ఎక్కి వచ్చాను.. మరీ అంత ఖరాఖండిగా చెబితే ఎట్లన్నా? శ్రీహరిని చంపడం వల్ల మీ పార్టీకి జర్నలిస్టుల్లో ఎంతటి వ్యతిరేక భావం ఏర్పడిందో తెలుసా? జర్నలిస్టుల్లో వ్యతిరేకతను పెంచుకుంటే అది దీర్ఘకాలంలో మీకు వ్యక్తిగతంగానే కాదు పార్టీకి కూడా భారీ నష్టం’ అనే పాయింట్ ప్రామాణికంగా చలమన్నతో చాలా సేపు వాదన చేశాను. ఎట్టకేలకు కాస్త మెత్తబడ్డ చలమన్న ‘సరే అన్నా.. ఓసారి వాన్ని (కృష్ణారావు) తీసుకుని రా.. అన్నాడు. ఎక్కడికి తీసుకురావాలో మళ్లీ ఇన్ఫర్మేషన్ పంపిస్తా.. అన్నాడు చలమన్న. తీసుకొచ్చాక.. మీరు ఏమైనా చేస్తే..? నా అనుమానాన్ని చలమన్న ముందుంచాను. మాట ఇచ్చాక తప్పుతానా? నీకు తెలియదా? అని అన్నాడు చలమన్న. హమ్మయ్య.. అనుకుంటూ సగం విజయం సాధించినట్లుగానే ఫీలయ్యాను. దాదాపు రెండు నెలల తర్వాత చలమన్న నుంచి వర్తమానం వచ్చింది.
కృష్ణారావును నాకు గల పాలపిట్ల కలర్ బజాజ్ చేతక్ (AEO 4994) స్కూటర్ పై కూర్చోబెట్టుకుని ఏటూరునాగారం నుంచి 35 కిలోమీటర్లు ప్రయాణించి పస్రాకు చేరుకున్నాను. అక్కడ ఓ చాయ్ తాగాక లింగాల వైపు బండి నడుపుతున్నాను. బండి అయితే నడుపుతున్నానుగాని, లోలోన భయంగానే ఉంది. నన్ను నమ్మి కృష్ణారావు వచ్చాడు, నేను నమ్మి ఇతన్ని చలమన్న వద్దకు తీసుకువెడుతున్నాను. అక్కడికి వెళ్లాక కృష్ణారావును వాళ్లు ఏమైనా చేస్తే..? ఆ తర్వాత నా పరిస్థితి ఏమిటి..? ఇదీ నా భయం. కానీ ‘మాట ఇచ్చాక తప్పుతానా? నీకు తెలియదా?’ అని చలమన్న చేసిన కామెంట్ నా చెవుల్లోనే తిరుగుతోంది. అదే నమ్మకంతో లింగాల శివారుకు వెళ్లగానే.. చలమన్న కొరియర్ మా రాకను గమనిస్తూనే బండి ఆపాడు. స్కూటర్ ను ఇక్కడే ఓ చెట్టుకింద కాస్త లోనికి పార్క్ చేయించాడు. బండి పార్క్ చేసిన వ్యతిరేక దిశలో గల దట్టమైన అడవుల్లోకి దాదాపు అరగంట సేపు నడిచాక ఓ భారీ ఇప్పచెట్టు కింద దాదాపు 30 మంది సాయుధ నక్సలైట్లు కనిపించారు. ఆ పక్కనే నారవేప చెట్టు కింద చలమన్న కూర్చుని రమ్మని సైగ చేశాడు.

నారవేప చెట్టు కింద మళ్లీ కాసేపు ఇద్దరి మధ్య వాదన. ఎందుకు వదిలేయాలి వీన్ని? అన్నాడు చలమన్న కృష్ణారావువైపు చూస్తూ. నాకు చల్లచెమటలు పట్టాయి. నమ్మి మోసపోయానా? అని లోలోనే ఆందోళన చెందుతున్నాను. కానీ కాస్త ధైర్యం తెచ్చుకుని పిలిపించి మోసం చేస్తారా? అని ప్రశ్నించాను. ఈలోగా ఇద్దరు మహిళా నక్సలైట్లు వచ్చి నా పక్కనే భయంభయంగా నిల్చుని ఉన్న కృష్ణారావును గుత్పలతో కొట్టడం ప్రారంభించారు. కృష్ణారావు అరుస్తున్నాడు. మొండికేసిన ధైర్యంతో చలమన్నా.. ఏందిది? వాన్ని చంపేస్తారా? అని గట్టిగా అరిచాను. అక్కలూ.. అగండి.. అని చలమన్న వారిని వారించాడు. తీవ్ర ఉద్రికత్త పరిస్థితుల మధ్య మొండిధైర్యంతో చలమన్నను గట్టిగా ప్రశ్నించాను. ‘అట్టా కాదన్నా.. చిన్న శిక్ష కూాడా లేకుండా వాన్ని వదిలేస్తే ఎలా? నన్ను నమ్మి తీసుకొచ్చాక చంపే ఉద్ధేశం ఉండదు’ అని చలమన్న పేర్కొనడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నాను. ఆ తర్వాత చాలా సేపు పార్టీ పరిస్థితిపై అనేక విషయాలు మాట్లాడాక కృష్ణారావుకు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. పార్టీవైపు మళ్లీ కన్నెత్తి చూస్తే శ్రీహరికన్నా ఘోరమైన శిక్షను అనుభవిస్తావ్.. అని చలమన్న హెచ్చరించాడు. ఇక వెళ్లండి అన్నా.. అని నావైపు తిరిగి చెబుతూ, రోడ్డువరకు సాగనంపాల్సిందిగా కొరియర్ ను పురమాయించాడు చలమన్న.
మొత్తంగా ఓ తోటి జర్నలిస్టు ప్రాణాన్ని ఇలా రక్షించగలిగాను. కానీ ఆ తర్వాత విలేకరిగిరిని వదిలేసిన కృష్ణారావు కాంట్రాక్టరుగా బాగానే ఎదిగాడు. ఏటూరునాగారం ప్రాంతంలోనూ పలు కాంట్రాక్టు పనులు చేశాడు. కారణాలు ఏమిటో స్పష్టంగా తెలియదుగాని సుమారు ఏడెనిమిదేళ్ల క్రితం బెంగళూరుతో ఆత్మహత్య చేసుకున్నాడు అత్యంత మొండి ధైర్యసాహసంతో నేను రక్షించిన సహచర జర్నలిస్టు జీవితం అత్యంత విషాదకరంగా ముగియడం కలచివేసింది.
పోలీస్ ఇన్ ఫార్మర్ ముద్రను సంపాదించుకుని నక్సల్స్ హిట్ లిస్టులోకి ఎక్కి హన్మకొండకు పరారై ప్రస్తుతం ప్రముఖ పాత్రికేయునిగా చెలామణిలో గల ఇంకో విలేకరి గురించి, అన్నల ప్రజాకోర్టులో తగుదునమ్మా.. అంటూ ఓవరాక్షన్ చేసి కరీంనగర్ కు పారిపోయిన ఇంకో ‘సుద్దపూస’ విలేకరి గురించి మున్ముందు కథనాల్లో సమీక్షించుకుందాం.
-ఎడమ సమ్మిరెడ్డి

