Top 5 This Week

Related Posts

అదే నిజమైతే ఇదే అతిపెద్ద ‘కోవర్ట్’ ఆపరేషన్!

భారత విప్లవోద్యమ చరిత్రలో మరో భారీ కోవర్ట్ ఆపరేషన్ జరుగుతోందా? మావోయిస్టు పార్టీ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా కేంద్ర కమిటీ సభ్యుని హోదాలో గల నాయకుడు పోలీసులకు ‘కోవర్ట్’గా మారాడా? ఇదే నిజమైతే ఇప్పటి వరకు జరిగిన కోవర్ట్ ఆపరేషన్లలో ఇదే భారీ ఘటనగా చరిత్రలో నిక్షిప్తం కానుందా? తాజాగా వెలువడుతున్న వార్తల ప్రకారం మావోయిస్ట్ పార్టీ ప్రస్థానంలో అతిపెద్ద కోవర్ట్ ఆపరేషన్ జరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆయుధాలు వదిలేస్తున్నామంటూ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను అలియాస్ అభయ్ ప్రకటన, అది అతని వ్యక్తిగత అభిప్రాయమని పార్టీ తెలంగాణా రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ విడుదల చేసిన కౌంటర్ స్టేట్మెంట్ గురించి తెలిసిందే. ఈ పరిణామాల్లోనే సోనును విప్లవ ద్రోహిగా అభివర్ణిస్తూ మావోయిస్ట్ పార్టీ మరో ప్రకటన విడుదల చేసింది. అతని వద్దగల ఆయుధాలను వెంటనే పార్టీకి అప్పగించాలని, లేనిపక్షంలో పీపుల్స్ గెరిలా ఆర్మీ స్వాధీనం చేసుకుంటుందని పార్టీ హెచ్చరించింది.

ఈ నేపథ్యంలోనే మల్లోజుల వేణుగోపాల్ కోవర్టుగా మారాడని, ఇందులో భాగంగానే సాయుధ పోరాట విరమణ లేఖ రాశాడనే వార్తా కథనాలు వచ్చాయి. అంతేకాదు మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కోసా, కట్టా రామంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ ల ఎన్కౌంటర్ ఘటన కోవర్ట్ ఆపరేషన్ ఫలితమనే ఆరోపణల సారాంశంతో తాజాగా వార్తలు వచ్చాయి. ఈ పరిణామాల్లో మావోయిస్ట్ పార్టీలో ‘కోవర్ట్’ అపరేషన్ల ఘటనలు మరోసారి చర్చనీయాంశాలుగా మారాయి. ఇటువంటి కోవర్ట్ ఆపరేషన్లకు ఆ పార్టీలో 1990లో బీజం పడడం గమనార్హం.

కొయ్యూరులో స్మారక స్థూపం (ఫైల్ ఫొటో)

ఇప్పటి మావోయిస్ట్ పార్టీ, అప్పటి పీపుల్స్ వార్ పార్టీ హుజూరాాబాద్ దళంపై 1990 దశకంలో (బహుషా 1992 కావచ్చు) తొలి కోవర్ట్ ఆపరేషన్ జరిగింది. ఈ ఘటనలో కత్తుల సమ్మయ్య అనే డిప్యూటీ దళ కమాండర్ భూపతి దళంపై తుపాకీ గుళ్ల వర్షం కురిపించాడు. వీణవంక మండలంలోని ఓ పంటచేలో జరిగిన ఈ సంఘటనలో దళ కమాండర్ సహా ముగ్గురిని హత్య చేసి కత్తుల సమ్మయ్య పోలీసులకు లొంగిపోయిన నేపథ్యం అప్పట్లో తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఆ తర్వాత పరిణామాల్లో కత్తుల సమ్మయ్య కొలంబోలోని విమానాశ్రమంలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు.

ఆ తర్వాత నల్లగొండ జిల్లా పావురాలగుట్టల్లోనూ మరో కోవర్ట్ ఆపరేషన్ జరిగింది. సోమ్లా నాయక్ అనే దళసభ్యుడు దళం భుజించే ఆహారంలో విషం కలిపాడు. దీంతో దళం మొత్తం మత్తులోకి వెళ్లాక తుపాకీ తూటాల వర్షం కురిపించి తుపాకులతో సహా పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటనలో దళనేత సహా దాదాపు తొమ్మిది మంది నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సోమ్లానాయక్ అరాచకాలు శృతిమించడంతో నల్లగొండ జిల్లాలోని ఓ గ్రామ ప్రజలు అతన్ని కొట్టి చంపారనేది వేరే అంశం.

ఈ ఘటనల నేపథ్యంలోనే కరీంనగర్ జిల్లా కమాన్ పూర్ మండల రామగిరి ఖిలా అడవుల్లో మరో కోవర్ట్ అపరేషన్ జరిగింది. సాయుధ దళానికి సెంట్రీ డ్యూటీలో గల జడల నాగరాజు అనే దళసభ్యుడు అప్పటి పీపుల్స్ వార్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి విజయ్ ను కాల్చి చంపి, ఏకే-47 ఆయుధంతో సహా జిల్లా ఎస్పీకి లొంగిపోయాడు. పార్టీ ప్లీనరీకి హాజరయ్యేందుకు వివిధ ప్రాంతాల దళాలు రామగిరి ఖిలాపైకి చేరుకుంటున్న సందర్భంలో ఈ ఉదంతం జరిగింది. అయితే ఈ ఘటనానంతరం కొన్నాళ్లపాటు తనదైనశైలిలో జీవనం గడిపిన జడల నాగరాజు దాదాపు 14 ఏళ్ల క్రితం ఉన్నట్టుండి అదృశ్యమయ్యాడు. జడల నాగరాజు ఆచూకీపై, అతను ఏమయ్యాడనే అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు.

వరుసగా జరిగిన ఈ మూడు ఘటనల అనంతరం పీపుల్స్ వార్ పార్టీలోని సాయుధ బలగాల్లో తీవ్ర అభద్రతా భావం ఏర్పడింది. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని అయోమయ స్థితిని పార్టీ ఎదుర్కుంది. ఆహారం తీసుకువచ్చిన కొరియార్ భుజించాకే దళాలు భోజనం చేసే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లోనే కరీంనగర్ జిల్లా మల్హర్ మండలం అడవి సోమన్ పల్లి-కొయ్యూరు అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ లో అప్పటి పీపుల్స్ వార్ కేంద్ర కమిటీ సభ్యులు నల్లా ఆదిరెడ్డి అలియాస్ శ్యామ్, యర్రంరెడ్డి సంతోష్ రెడ్డి అలియాస్ మహేష్, ఉత్తర తెలంగాణా స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి శీలం నరేష్ అలియాస్ మురళి మరణించారు.

అయితే ఈ ఎన్కౌంటర్ ఘటనలో చనిపోయిన ఆయా ముగ్గురు అగ్ర నేతలను బెంగళూరు నుంచి పట్టుకొచ్చి కాల్చి చంపారనే ఆరోపణలు వచ్చాయి. బెంగళూరులోని సారక్కి గేట్ డెన్ నుంచి వారిని పట్టుకొచ్చి ఎన్కౌంటర్ పేరుతో కాల్చి చంపినట్లు పౌరహక్కుల సంఘం నాయకులు అప్పట్లో ఆరోపించాయి. ఈ ముగ్గురు అగ్రనేతలు పోలీసులకు చిక్కడం వెనుక గోవిందరెడ్డి అనే డెన్ కీపర్ పోలీసులకు ‘కోవర్టు’గా వ్యవహరించినట్లు కూడా వార్తలు వచ్చాయి. మావోయిస్ట్ పార్టీగా రూపాంతరం చెందకముందు పీపుల్స్ వార్ పార్టీ చవి చూసిన కోవర్టు ఆపరేషన్ ఘటనల్లో ఇవి ప్రధానమైనవి.

అయితే ఈ నాలుగు ఘటనల్లోనూ కోవర్టులుగా వార్తల్లోకి వచ్చిన కత్తుల సమ్మయ్య డిప్యూటీ కమాండర్ కాగా, సోమ్లానాయక్, జడల నాగరాజులు సాధారణ దళ సభ్యులు మాత్రమే. గోవిందరెడ్డి మాత్రం డెన్ కీపర్ గా వార్తలు వచ్చాయి. తాజా పరిణామాల్లో మావోయిస్ట్ పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుని హోదాలో గల మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోనును విప్లవ ద్రోహిగా పార్టీ ప్రకటించింది. మావోయిస్ట్ పార్టీ అగ్ర నాయకత్వాన్ని బయటకు రప్పించడంలో భాగంగానే అభయ్ అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ నుంచి ప్రకటన వెలువడినట్లుగా మాజీలు అంచనా వేస్తున్నారనేది తాజా వార్తల సారాంశం.

అయితే కేంద్ర కమిటీ సభ్యుని స్థాయి హోదాలో గల నాయకుడు ‘కోవర్టు’గా మారే అవకాశముందా? అనే సందేహంపైనా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను అలియాస్ అభయ్ కోవర్టుగా మారినట్లు ధ్రువపడితే మాత్రం మావోయిస్ట్ పార్టీ విప్లవోద్యమ చరిత్రలోనే ఇది అతిపెద్ద ‘ఆపరేషన్’గా చరిత్రలో నిలిచిపోయే అవకాశాలు లేకపోలేదనేది విప్లవ కార్యకలాపాల పరిశీలకుల భావన.

Popular Articles