పదవీ విరమణ చేసిన కర్నాటక మాజీ డీజీపీ దారుణ హత్యకు గురయ్యారు. అయితే ఈ ఘోరంలో ఆయన భార్యే నిందితురాలిగా పోలీసులు ప్రాథమికంగా అంచనాకు రావడం గమనార్హం. తన భర్తను తానే హత్య చేసినట్లు నిందితురాలు మరో మాజీ డీజీపీకి పోన్ ద్వారా మెసేజ్ పెట్టారు. కర్నాటకలో తీవ్ర కలకలం రేపిన ఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.
బీహార్ రాష్ట్రానికి చెందిన ఓం ప్రకాష్ 1981 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. కర్నాటక డీజీపీగా 2015 మార్చి 1న బాధ్యతలు చేపట్టిన ఆయన 2017లో రిటైరయ్యారు. విశ్రాంత జీవనాన్ని బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్ లో సాగిస్తున్నారు. అయితే ఓంప్రకాష్ భార్య పల్లవి ఇచ్చిన సమాచారంతో ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు ఇక్కడి దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయారు. రక్తపు మడుగులో పడి ఉన్న తమ శాఖకు చెందిన విశ్రాంత ఉన్నతాధికారిని చికిత్స కోసం పోలీసులు ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఆయన అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఈ ఘటన వెనుక ఆస్తి తగాదాలు ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు. ఓం ప్రకాష్ తన భార్య పల్లవితో, ఇతర కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నట్లు పోలీసులు సమాచారాన్ని సేకరించారు. తన భర్త ఇంట్లో తుపాకీతో తిరుగుతున్నాడని ఓ ప్రకాష్ భార్య పల్లవి సోషల్ మీడియా ‘ఐపీఎస్ ఫ్యామిటీ గ్రూపు’లో మెసేజ్ పోస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులను తీవ్రంగా హింసిస్తున్నారని కూడా పల్లవి పేర్కొన్నట్లు పోలీసుల కథనం.

ఈ నేపథ్యంలోనే ఓం ప్రకాష్ కుటుంబంలో ఆస్తి తగాదాల గొడవ తీవ్రరూపం దాల్చడంతో పల్లవి తన భర్తను ఆదివారం పలుసార్లు కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనానంతరం మరో మాజీ డీజీపీకి ‘ఐ హ్యావ్ ఫినిష్డ్ మాన్ స్టర్’ అంటూ ఫోన్ లో మెసేజ్ పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఘటనలో హత్యకు గురైన మాజీ డీజీపీ ఓం ప్రకాష్ భార్య పల్లవిని, కుమార్తెను, కోడళ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

