Top 5 This Week

Related Posts

రసరమ్యం.. స్వాతీ సోమనాథ్ కామసూత్ర అర్ధనారీశ్వర ప్రదర్శన

అద్భుత సాహిత్యం, అందుకు తగ్గట్లు వినసొంపైన సంగీతం, ఇట్టే అర్ధం చేసుకుని ఒదిగిపోయే యువ డ్యాన్సర్లు, సొగసైన కొరియోగ్రఫీ, అద్భుత ఆహార్యం, సన్నివేశాలకు తగిన రంగోద్దీపనం, అంకితభావ శిక్షణ… ఇవన్నీ ఒకేచోట చేరితే ప్రదర్శన రక్తి కట్టక ఏమవుతుంది? అదే జరిగింది… అందుకే ప్రేక్షకులు స్టాండింగ్ వోయేషన్ తో తన్మయత్వం చెందారు.

చాలా కాలం తరువాత రవీంద్రభారతి కిక్కిరిసిపోయింది. అన్యోన్య దాంపత్య ఆనందం అనుభవించడానికి వాత్సాయన మహర్షి బోధించిన కామసూత్రాలు, ధర్మ మార్గాలు, మోక్ష సాధకాలను అద్భుతంగా కూచిపూడి నృత్య శైలిలో కామసూత్ర అర్ధనారీశ్వరం నృత్య నాటిక ద్వారా ప్రదర్శించి మంత్రముగ్దులను చేశారు. వాత్సాయన కామసూత్ర బూతు పుస్తకం కాదని, సమాజంలో నెలకొన్న అనేక అనిశ్చితి పరిస్థితుల్లో యువ దంపతులకు సరైన మార్గ నిర్దేశక గ్రంథం అని నృత్యం ద్వారా చాటి చెప్పారు. సంప్రదాయం కల్చరల్ ట్రస్ట్, శ్రీకాకుళం ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో కూచిపూడి నాట్య గురు “కళారత్న” స్వాతీ సోమనాథ్ గురుకుల శిష్య బృందం కామసూత్ర అర్ధనారీశ్వరం నృత్య నాటిక రసరమ్యంగా ప్రదర్శించారు.

కళారత్న బ్నిమ్ 23 ఏళ్ల క్రితం రాసిన ఈ నృత్య నాటికను ఇదే రవీంద్రభారతిలో అప్పట్లో స్వాతి సోమనాథ్ ప్రదర్శించి సంచలనం సృష్టించారు. మళ్ళీ ఇన్నాళ్ళకు కొద్దిపాటి మార్పులు చేసి ఎలాంటి అసభ్యత అశ్లీలత లేకుండా, కూచిపూడి సంప్రదాయం చెదరకుండా, ఆధునికత జోడించి తన సంప్రదాయం గురుకుల శిష్యులతో ప్రదర్శింపజేయడం విశేషం. అసలు కామసూత్రాలు ఎందుకు ప్రచారం చేయాలనే ప్రశ్నతో నృత్య నాటిక ప్రారంభమై అర్ధనారీశ్వర పరస్పరానంద కేళి వినోద ప్రార్ధనతో ముగించిన తీరు ఆద్యంతం కళ్ళను కట్టిపడేసింది. నృత్యంలో నృత్తానికి శృంగార భంగిమలకు సమకూర్చిన అంగీకాభినయం, హస్త పదముద్ర విన్యాసాలు, అందుకు తగిన సంగీతం ఈ నృత్య నాటికకు ప్రాణం పోశాయి. యోగ శాస్త్రంలోని మూలాధార చక్రాలతో శృంగార ప్రేరేపిత అంశాలను మిళితం చేసి నృత్య రూపంలో సాక్షాత్కరింపచేసిన స్వాతి సోమనాథ్ దర్శకత్వ సాహస ప్రయోగం విశేషంగా ఆకట్టుకుంది.

అలుమగలు జీవితాన్ని అందంగా ఆహ్లాదకరంగా మలచుకోవడానికి అవసరమైన అనుభూతి ఎలా ఆస్వాదించాలో అద్భుతంగా నయన మనోహరంగా ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. నరనారీ ఉద్భవం, భర్త్రుహరి శృంగార శతకం, సిగ్గే సింగారం భార్యాభర్తల అనుబంధం, నిత్య నూతన జీవన యానం ఆనందాల హరివిల్లుకు దోహదపడే అనేక అంశాలతో మలచి గొప్ప సందేశాన్ని చాటిచెప్పారు. నరనారీల పంచేంద్రియాలు స్పందించి జీవ చేతనానికి కారణమయ్యేలా నవసృష్టికి ఆరంభమయ్యేలా నఖ క్షతాలు, దంత క్షతాలు, చుంబన ఆలింగనాదుల పారవశ్య విధానాన్ని సౌందర్యవంతంగా సవివరంగా కూచిపూడి నృత్యం ద్వారా రక్తి కట్టించారు. వాత్సాయనుడికి కళాంజలి సమర్పించి ముగించారు. బ్నిమ్ రాసిన నృత్య నాటికకు ఎన్.సురేష్ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో గరిమెళ్ల గోపాలకృష్ణ బృందం సంగీతం సమకూర్చారు. కాన్సెప్ట్, కొరియోగ్రఫీ, నట్టువాంగం స్వాతి సోమనాథ్ కాగా, రంగాలంకరణ, రంగోద్దీపనంతో ఎస్.వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం బృందం ప్రత్యేక ఆకర్షణను ఇచ్చారు.

గొప్ప సాహస నృత్య ప్రయోగం: డా. సుచిత్ర ఎల్లా
ఇదొక గొప్ప సాహసమని, కామసూత్ర నృత్య నాటిక నేటి యువత చూసేలా ప్రతి వేదికపై ప్రదర్శించాల్సిన అవసరం ఉందని భారత్ బయోటెక్స్ ఎండి పద్మభూషణ్ డాక్టర్ సుచిత్ర ఎల్లా అన్నారు. గొప్ప సందేశాత్మక దృశ్య కావ్యం, నిజంగా రంగస్థలంపై అసభ్యత లేని అద్భుత ప్రదర్శనగా ఆమె అభివర్ణించారు. కూచిపూడి అద్భుత నాట్యం అని భక్తితత్వాన్ని అంకితభావాన్నీ పెంపొందిస్తుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో సిఎస్ఆర్ బోయింగ్ ఇండియా హెడ్ ప్రవీణ యజ్ఞంభట్, రచయిత డాక్టర్ దీర్ఘాసి విజయ్ భాస్కర్, డాక్టర్ మహ్మద్ రఫీ, నాట్య గురువులు డా.భాగవతుల సేతురామ్, పసుమర్తి శేషుబాబు, డా. యశోద ఠాకూర్, కె.పి.రావు పాల్గొని స్వాతి సోమనాథ్, వారి శిష్య బృందాన్ని సత్కరించారు. నాయకుడిగా కొర్రా బలరాం, నాయికలుగా యామిని కసిరెడ్డి, అంజలి నిమ్మల వయ్యారంగా సౌందర్యవంతంగా నర్తించి జీవం పోశారు. వాత్సాయనుడిగా రవితేజ, శివుడిగా మెహర్ ప్రభాకర్, సఖిగా జి.లిఖిత, పార్వతిగా దూసి వైష్ణవిరావు ఆయా పాత్రల్లో ఒదిగి చక్కగా రాణించారు. సూత్రధారులుగా శృతి, హేమాంజలి, హేమవళ్ళి, భానుశ్రీ, భవ్యశ్రీ, యశస్వి, తేజస్వి, గీతిక ప్రదర్శించారు. వైష్ణవి ఆర్ట్ థియేటర్స్ ఎస్.రాజేష్, ధన్ రాజ్ సమన్వయం చేశారు.

కామసూత్ర బూతు కాదు : స్వాతీ సోమనాథ్
ఈ సందర్భంగా స్వాతి సోమనాథ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూచిపూడి నాట్య వికాసం కోసం శ్రీకాకుళంలో 12 ఎకరాల స్థలం కేటాయించగా, సంప్రదాయం కల్చరల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి గత పదేళ్లుగా గురుకుల పధ్ధతిలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. తెలుగు యూనివర్సిటీ అనుబంధంగా డిప్లొమా, పిజి కోర్సులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం కలెక్టర్ ట్రస్ట్ చైర్మన్ గా, ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జెఎస్వి ప్రసాద్, టిటిడి చైర్మన్, కాకినాడ జెఎన్టీయు వైస్ ఛాన్సలర్, సాంస్కృతిక శాఖ సంచాలకులు సభ్యులుగా, తాను డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నట్లు స్వాతి సోమనాథ్ వివరించారు. ప్రపంచంలో ఇంత వరకు ఎవరూ కామసూత్ర రంగస్థలంపై చేయలేదని, కూచిపూడి నృత్య నాటిక ద్వారా తానే ఈ ప్రయోగం చేసినట్లు ఆమె తెలిపారు. కామసూత్ర బూతు కాదని, పెడదారి పడుతున్న సమాజాన్ని మార్చడానికి గొప్ప సాధక గ్రంథం అని ఆమె అన్నారు. కిక్కిరిసిన ప్రేక్షకులు లేచి నిలబడి కరతాళ ధ్వనులతో గౌరవంగా అభినందించారు.

Popular Articles