హైదరాబాద్: ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ జీవీ మాల్ కు ప్రతిష్టాత్మక ‘టైమ్స్ బిజినెస్ అవార్డు’ దక్కింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టాలీవుడ్ హీరో నాగచైతన్య చేతుల మీదుగా జీవీ మాల్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గుర్రం ఉమామహేశ్వరరావు ఈ అవార్డును స్వీకరించారు. హైదరాబాద్ నోవాటెల్ (హైటెక్స్) వేదికగా గత రాత్రి అత్యంత ఘనంగా నిర్వహించిన ‘టైమ్స్ బిజినెస్ అవార్డ్స్’ వేడుకలో ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ జీవీ మాల్ (GV MALL) యాజమాన్యానికి ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రదానం చేశారు.
వినియోగదారులకు నాణ్యమైన సేవలను, అత్యుత్తమ షాపింగ్ అనుభవాన్ని అందిస్తున్నందుకు గాను జీవీ మాల్‌ను ‘పాపులర్ ఫ్యామిలీ షాపింగ్ మాల్’ పురస్కారం వరించింది. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గుర్రం ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, తమ వ్యాపార సంస్థ జీవీ మాల్‌కు ఈ స్థాయి గుర్తింపు లభించడం అత్యంత సంతోషదాయమన్నారు.

ఈ గుర్తింపు లభించడం వెనుక వినియోగదారుల నిరంతర ఆదరణ, నమ్మకం ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.. తమపై వ్యాపార నిర్వహణ తీరును, తాము అందిస్తున్న నాణ్యతపై నమ్మకాన్ని ఉంచి ఆదరిస్తున్న ‘కస్టమర్ దేవుళ్లందరికీ’ ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఉమా మహేశ్వర్ రావు చెప్పారు. మున్ముందు కూడా కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా అత్యుత్తమ ఉత్పత్తులను, నాణ్యమైన సేవలను అందిస్తూ ప్రజలకు మరింత చేరువ అవుతామని ఆయన వెల్లడించారు.
ఫొటో: నాగచైతన్య చేతుల మీదుగా అవార్డును స్వీకరిస్తున్న జీవీ మాల్ మేనేజింగ్ డైరెక్టర్ గుర్రం ఉమా మహేశ్వర్ రావు

