హైదరాబాద్: ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు తెలంగాణా హైకోర్టు ప్రకటించింది. ఈమేరకు అసెంబ్లీ స్పీకర్ కు, ఎన్నికల సంఘానికి ఇదే విషయాన్ని తెలిపింది. ప్రస్తుత ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వు జారీ చేసింది. ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్లు వెల్లడించింది. దానం నాగేందర్ అంశంలో స్పీకర్ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టడం ఈ సందర్భంగా గమనార్హం.
దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలనే అంశంపై స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బీజేఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిలు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. బీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారని, 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారని పిటిషన్లలో తెలిపారు. పదో షెడ్యూల్ ప్రకారం నడుచుకోకుండా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను అభ్యర్థించామన్నారు.
అయితే సరైన ఆధారాలు లేవంటూ స్పీకర్ ట్రైబ్యునల్ గత మార్చి 11వ తేదీన ఉత్తర్వులిచ్చిందని హైకోర్టుకు నివేదించారు. ఈ నేపథ్యంలో స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిన్లపై విచారణ అనంతరం దానం నాగేందర్ పై అనర్హత వేటు వేస్తూ తీర్పునిచ్చింది. ఇదే దశలో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు స్పీకర్ కు, ఎన్నికల సంఘాన్ని సమాచారం ఇచ్చింది. కాగా 2024 ఏప్రిల్ 23వ తేదీ నుంచి ఎమ్మెల్యేగా దానం నాగేందర్ అనర్హుడని హైకోర్టు స్పష్టం చేసింది. స్పీకర్ ఆదేశాలపై స్టే విధించింది.
కాగా హైకోర్టు తీర్పుపై దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలిసింది. సుప్రీంకోర్టులో అప్పీల్ చేసేందుకు అడ్వకేట్లతో దానం నాగేందర్ మాట్లాడుతున్నట్లు సమాచారం. మరోవైపు ‘సత్యమేవ జయతే’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ‘ఎక్స్’ ఖాతాలో ట్వీట్ చేశారు. మిగతా వారికి కూడా త్వరలో ఇదే గతి పడుతుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

