హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలోని నాగోల్ బండ్లగూడ వద్ద భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. నాగోల్ బండ్లగూడలోని ఆనంద్ నగర్ చౌరస్తాలో గత రాత్రి జరిగిన ఈ ఘటనలో రౌడీ షీటర్ మహ్మద్ నయీమ్ ను ప్రత్యర్థులు నరికి చంపారు. హతుని ఒకప్పటి ప్రాణ స్నేహితుడైన మరో రౌడీ షీటర్ గ్యాంగ్ చేతిలోనే నయీమ్ హత్యకు గురి కావడం గమనార్హం.
పోలీసుల కథనం ప్రకారం… ఇల్లెందు పట్టణానికి చెందిన రౌడీషీటర్లు ఉమామహేశ్వర్ అలియాస్ జేకే మహేష్, మహమ్మద్ నయీమ్ చిన్ననాటి నుండి కలిసి చదువుకున్న ఆప్తమిత్రులు. సెటిల్మెంట్లు చేసిన డబ్బు లావాదేవీలు, పంపకాల విషయంలో గత మూడు నెలలుగా వీరిద్దరి మధ్య వైషమ్యాలు నెలకొన్నాయి. ఇవి ముదిరి పాకానపడ్డాయి. నయీమ్ బండ్లగూడ సమీపంలోని సహభావన అపార్ట్మెంట్ లో నివాసముంటున్నాడు.

అయితే గత రాత్రి నయీమ్ కదలికలను గమనించిన జేకే మహేష్ గ్యాంగ్ బండ్లగూడ వద్ద అతనిపై కత్తులు, వేటకొడవళ్లతో దాడికి పాల్పడ్డారు. ప్రత్యర్థుల దాడిలో గాయపడిన మహ్మద్ నయీమ్ సమీపంలోని ఓ వైన్ షాపులోకి దూరాడు. గమనించిన దుండగులు వైన్ షాపులోనే నయీమ్ ను కిరాకతంగా నరికి చంపారు. ఈ హత్యోదంతంపై సమాచారం అందుకున్న నాగోల్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఇద్దరు రౌడీషీటర్ల మధ్య పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. జేకే మహేష్ అండ్ గ్యాంగ్ కోసం పోలీసులు స్పెషల్ టీంలతో గాలిస్తున్నారు. కాగా ఈ హత్యకు సంబంధించి ఆరుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే సమాచారం ధ్రువపడాల్సి ఉంది.

