Top 5 This Week

Related Posts

ఖమ్మం హార్వెస్ట్ కాలేజీలో దారుణం: వినాయకుని మాల ధరించిన విద్యార్థులకు నో ఎంట్రీ!

ఖమ్మం: ఖమ్మం నగరంలోని హార్వెస్ట్ జూనియర్ కళాశాల యాజమాన్యం విఘ్నేశ్వరస్వామి మాల ధరించిన విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించిందనే ఆరోపణలు తీవ్ర కలకలానికి దారి తీశాయి. అందిన సమాచారం ప్రకారం.. కళాశాలలో విద్యనభ్యసిస్తున్న ఆరుగురు ఇంటర్ విద్యార్థులు వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా గణేషుని మాల ధరించారు. మాలధారణలోనే విద్యార్థులు మంగళవారం తరగతులకు హాజరయ్యేందుకు కాలేజీకి వెళ్లారు.

బీజేపీ నేత గల్లా సత్యనారాయణ, కళాశాల నిర్వాహకుడు రవిమారుత్ ల మధ్య సంవాదం

అయితే మాల ధరించినవారు కళాశాల లోనికి రావడానికి వీల్లేదని, మాల తీసేని వస్తేనే అనుమతిస్తామని ఆరుగురు విద్యార్థులను కాలేజీ యాజమాన్యం వారిని వెనక్కి పంపిందనే అభియోగాలపై బీజేపీ, ఏబీవీపీ నాయకులు తీవ్రంగా స్పందించారు. కాలేజీ యాజమాన్యం తీరుపై బీజేపీ, ఏబీవీపి నాయకులు, కార్యకర్తలతోపాటు మాల ధరించిన విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాల ఎదుట నిరసనకు దిగారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు గల్లా సత్యనారాయణ ఈ సందర్భంగా కాలేజీ నిర్వాహకులపై ఆగ్రహించారు. కాలేజీ నిర్వాహకుల తీరును నిరసిస్తూ గేటు ముందు ఆందోళనకు దిగారు.

కళాశాల ఆవరణంలో విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన

ఈ కళాశాల యాజమాన్యం మొదటి నుంచీ హిందూ వ్యతిరేక భావజాలంతో ఉందని గల్లా సత్యనారాయణ వ్యాఖ్యానించగా, అదేమీ లేదని కళాశాల నిర్వాహకుడు రవి మారుత్ జవాబిచ్చారు. మట్టి వినాయకులను పూజించాలని తాము ప్రచారం చేశామని గల్లా సత్యనారాయణకు రవి మారుత్ ఈ సందర్బంగా వివరణ ఇచ్చారు. బీజేపీ, ఏబీవీపీ, విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన తీవ్రతరమవుతున్న పరిణామాల్లో కళాశాల యాజమాన్యం మాల ధరించిన విద్యార్థులకు హారతి ఇచ్చి, బొట్టు పెట్టి లోనికి అనుమతించడం కొసమెరుపు.

కాగా భవిష్యత్తులో విద్యార్థులకు ఏ ఇబ్బందీ కలిగినా సహించేది లేదని గల్లా సత్యనారాయణ హెచ్చరించారు. హార్వెస్ట్ కాలజీ ముందు ఈ సందర్భంగా చోటు చేసుకున్న పరిస్థితులకు సంబంధించిన మిరిన్ని దృశ్యాలను దిగువన చూడవచ్చు.

మాలధారులకు నచ్చజెబుతున్న రవి మారుత్
బీజేపీ, ఏబీవీపీ నాయకులకు వివరణ ఇస్తున్న రవి మారుత్
చివరికి మాలధారులకు బొట్టుపెట్టి లోనికి అనుమతిస్తున్న చిత్రం

Popular Articles