ఖమ్మం: ఖమ్మం నగరంలో దారుణ ఘటన వెలుగు చూసంది. ఓ వ్యక్తి తన భార్యను గొంతు నులిమి చంపి, కారులోనే ఆమె మృతదేహాన్ని తీసుకుని, ఓ చోట కారును పార్క్ చేసి, ఘటనను స్నేహితునికి ఫోన్ ద్వారా సమాచారం అందించిన ఉదంతం తీవ్ర కలకలం రేపింది. ఫోన్ సిగ్నల్ ద్వారా ఖమ్మం పోలీసులు నిందితుని ఆచూకీని పసిగట్టి అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
పోలీసు వర్గాల కథనం ప్రకారం వివరాల్లోకి వెడితే.. ఇల్లెందుకు చెందిన మేడిపల్లి విద్యాసాగర్ (44) అనే వ్యక్తి కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కుటుంబ కలహాల కారణంగా మొదటి భార్యతో విడాకులు తీసుకుని, ఆ తర్వాత తనకు పరిచయమైన చిన్నబోయిన రేణుక అనే మహిళను నాలుగు నెలల క్రితం రెండో వివాహం చేసుకున్నాడు. ఖమ్మంలోని సీసీఎస్ పోలీస్ స్టేషన్ ఏరియాలోనే రేణుకతో కలిసి నివాసముంటున్నాడు.

అయితే రేణుకకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానం విద్యాసాగర్ లో కలిగింది. దీంతో ఇరువురి మధ్య కుటుంబ కలహాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే విద్యాసాగర్ నిన్న సాయంత్రం వేళ తన రెండో భార్య రేణుకను తన కారులో ఎక్కించుకుని బయటకు తీసుకువెళ్లాడు. కారులో ప్రయాణిస్తున్న సమయంలోనే ఇరువురి మధ్య ఘర్షణ ప్రారంభమైంది. ఈ పరిణామాల్లోనే విద్యాసాగర్ రేణుక గొంతు నులిమి చంపేశాడు.
తాను తన భార్యను చంపినట్లు విద్యాసాగర్ ఇల్లెందులోని తన స్నేహితునికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. తాను కూడా చనిపోతున్నట్లు తెలిపాడు. దీంతో విద్యాసాగర్ స్నేహితుడు కలవరపడి రఘునాథపాలెం సీఐకి ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో సీఐ అప్రమత్తమై విద్యాసాగర్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతని ఆచూకీని కనిపెట్టారు. గత రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఖమ్మం-ఇల్లెందు రోడ్డులోని ప్రగతి స్కూల్ దగ్గర విద్యాసాగర్ ఉన్నట్లు గ్రహించారు.

విద్యాసాగర్ ఫోన్ నెంబర్ కు పోలీసులు రింగ్ చేసి, ప్రగతి స్కూల్ పక్కనే నిలిపి ఉంచిన ఓ కారు సమీపాన అతను ఉన్నట్లు గ్రహించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు. విద్యాసాగర్ గొంతు నులిమి చంపిన అతని భార్య రేణుక మృతదేహం గల కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితుడు ఖమ్మం అర్బన్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
అయితే రేణుకను విద్యాసాగర్ ఎక్కడ చంపాడు? చంపిన తర్వాత ఆమె మృతదేహంతో ఎక్కడి నుంచి ఖమ్మం వరకు ఎంత దూరం ప్రయాణించాడు? వంటి అనేక ప్రశ్నలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఖమ్మం నగరంలో తీవ్ర కలకలం రేపింది. పూర్తి వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
