హైదరాబాద్: ప్రపంచ ఔషధ రంగంలో తెలంగాణా రాష్ట్రం ఖ్యాతిని సముపార్జించుకుందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తమ పదేళ్ల పాలనలో ఫార్మాస్యూటికల్ పరిశ్రమ అభివృద్ధికి విశేష కృషి చేశారని ఆయన కొనియాడారు. దీంతో ఫార్మా రంగానికి హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా అవతరించిందన్నారు. కోల్డ్ చెయిన్ అన్ బ్రోకెన్-2026 (COLD CHAIN UNBROKEN) పేరుతో గ్లోబల్ కోల్డ్ చెయిన్ కనెక్షన్ ఆధ్వర్యాన శంషాబాద్ విమానాశ్రయం వద్ద గల నోవాటెల్ హోటల్ కాన్ఫరెన్స్ హాలులో బుధవారం సదస్సు జరిగింది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరై, రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ రంగాన్ని రవిచంద్ర మాట్లాడుతూ, తెలంగాణాలో ఔషధ రంగాన్ని మరింతగా విస్తరించేందుకు, అభివృద్ధి చేసేందుకు 33 వేల ఎకరాలను గత ప్రభుత్వం సేకరించి పెట్టగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు దానిని ఫ్యూచర్ సిటీ అంటూ ప్రచారం చేసుకుంటున్నారన్నారు. కరోనా మహమ్మారి నివారణకు ఇక్కడి జినోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ కంపెనీ కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను తయారు చేసిందని, ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా వచ్చి కృష్ణ ఎల్లాను ప్రశంసించారని గుర్తు చేశారు.

హెటిరో, ఏంఎస్ఏం, రెడ్డీస్, దివీస్ వంటి పేరుగాంచిన ఫార్మా కంపెనీలు ఇక్కడే ఉన్నాయన్నారు. హెటిరో ఫార్మా కంపెనీ యజమాని పార్థసారథిరెడ్డి తనతో పాటు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులని, ఆయన నెలకొల్పిన సింధూ ఆస్పత్రిని ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల ప్రారంభించారని ఎంపీ రవిచంద్ర వివరించారు. ప్రపంచానికి అవసరమయ్యే ఔషధాలలో సుమారు 35 శాతం ఇక్కడ తయారైనవేనని, ఏటా 49వేల కోట్ల రూపాయల ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయని తెలిపారు.
కోల్డ్ స్టోరేజ్ ఇండస్ట్రీ ఇటీవల బాగా అభివృద్ధి చెందుతున్నదని, తెలంగాణలో మంచి అవకాశాలు కూడా ఉన్నాయన్నారు. రొయ్యలు, చేపలు, పూలు, పండ్లు, కూరగాయల రవాణాకు నిల్వ చేసేందుకు కోల్డ్ స్టోరేజీలు అవసరమని ఎంపీ వద్దిరాజు చెప్పారు. తెలంగాణ సముద్ర తీరంలో లేనందున ఎగుమతులు, దిగుమతుల కోసం ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం, కాకినాడలతోపాటు ముంబాయిలపై ఆధారపడుతున్నామని పేర్కొన్నారు.
అందుకే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్,అప్పటి పరిశ్రమల మంత్రి కే.టీ.రామారావు ఆంధ్రాకు సమీపాన కోదాడ, మహారాష్ట్రకు దగ్గరలో ఉన్న జహీరాబాద్ లలో డ్రైపోర్టుల ఏర్పాటుకు కృషి చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించి కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అవుతారని, మరిన్ని పెట్టుబడులు రాబట్టి పరిశ్రమల స్థాపనకు, అభివృద్ధికి అండగా ఉంటారని ఎంపీ వద్దిరాజు వివరించారు. ఈ సదస్సులో శంకర్,సర్వేష్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
