Top 5 This Week

Related Posts

శిశువు మృతి: ‘కూరపాటి’ ఆసుపత్రి ముందు ఆందోళన

ఖమ్మం: ఖమ్మం నగరంలోని కూరపాటి చిల్డ్రన్స్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ముందు ఇల్లెందుకు చెందిన ఓ దంపతుల జంట, వారి బంధువులు ఆందోళనకు దిగారు. చికిత్సకోసం ఆసుపత్రికి తీసుకువచ్చిన 11 నెలల శిశువు మృతి చెందిన ఘటనపై ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు దాదాపు మూడు గంటలపాటు హాస్పిటల్ ముందు జరిగిన ఆందోళన, పరిస్థితిని చక్కదిద్దేందుకు చివరికి పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది.

వివరాల్లోకి వెడితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన పి. శ్రీకాంత్, సంధ్య దంపతులు తమ 11 నెలల కుమార్తె శ్రీనిధికి జ్వరం రావడంతో ఖమ్మం వైరారోడ్ లో గల కూరపాటి చిల్డ్రన్స్ అండ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. శిశువును పరీక్షించిన అనంతరం వైద్యుడు ఇన్ పేషెంట్ గా చేర్చుకుని చికిత్స చేస్తుండగా, ఆదివారం మధ్యాహ్నం ఆరోగ్యం విషమించిందని, వేరే ఆసుపత్రికి తీసుకువెళ్లాలని చెప్పినట్లు తల్లిదండ్రులు పేర్కొన్నారనే వార్తలు వచ్చాయి.

రోదిస్తున్న శిశువు కుటుంబీకులు

ఈ పరిస్థితుల్లో శిశువును మరో ఆసుపత్రికి తీసుకువెళ్లేసరికి, అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే ఆమె మరణించినట్లు చెప్పారనేది శిశువు తల్లిదండ్రులు పేర్కొన్నట్లు ఆయా వార్తల సారాంశం. దీంతో తమ బిడ్డకు చికిత్స చేసిన ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంతోనే మరణించినట్లు ఆరోపిస్తూ శిశువు తల్లిదండ్రులతోపాటు ఆమె బంధువులు కూరపాటి చిల్డ్రన్స్ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఫర్నీచర్ ను చిందరవందర కూడా చేసినట్లు సమాచారం.

ఆసుపత్రి ముందు ఆందోళన చేస్తున్నవారిని నిలువరిస్తున్న పోలీసులు

ఘటన గురించి సమాచారం అందుకున్న టూటౌన్ సీఐ బాలకృష్ణ తమ సిబ్బందితో ఆసుపత్రికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పి శాంతింపజేశారు. ఈ ఘటనపై తమకు ఎటువంటి లిఖితపూర్వక ఫిర్యాదు రాలేదని, కేసు కూడా నమోదు కాలేదని సీఐ బాలకృష్ణ తెలిపారు.

ఆసుపత్రి వద్ద పరిస్థితిని పరిశీలిస్తున్న టూ టౌన్ సీఐ బాలకృష్ణ

కాగా శిశువు మరణించడంలో వైద్యలోపం లేదని ఆసుపత్రి నిర్వాహకుడు డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ మీడియాతో చెప్పారు. శిశువుకు ఇల్లెందులోనే మూడురోజులపాటు ఆసుపత్రిలో చూపించుకున్న తర్వాత తమ వద్దకు వచ్చారని, శిశువు పరిస్థితి సీరియస్ గానే ఉందని తాము ముందే చెప్పామని డాక్టర్ ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు. తమ చికిత్సలో ఎటువంటి లోపం లేదని ఆయన ప్రకటించారు.

Popular Articles