Top 5 This Week

Related Posts

పూర్తిగా ‘థర్డ్ క్లాస్’: కాంగ్రెస్ పాలనపై కేసీఆర్ కామెంట్

గజ్వేల్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్నది ప్రజాపాలన కాదని, అది పూర్తిగా ‘థర్డ్ క్లాస్ పాలన’ అని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అభివర్ణించారు. ‘తెలంగాణ రైజింగ్’ అన్న పదానికి బదులుగా అన్ని రంగాల్లోనూ ‘ఫాలింగ్’ (పతనం) స్పష్టంగా కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా అస్తవ్యస్తం చేశారని గులాబీ పార్టీ అధినేత ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ (BRSLP) కీలక సమావేశం ఆదివారం జరిగింది.

ఈ సమావేశంలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి, బూతులు మాట్లాడటం పరిపాటిగా మారిందని కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలోనూ, బయటా పద్ధతి లేని పదజాలం వాడుతూ దిగజారి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. పరిపాలన చేతకాక, ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ బూతుల సంస్కృతిని తెరపైకి తెస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు.

‘ఇలా బూతులు మాట్లాడే ఆ బూతుల వీరుడు నన్ను చర్చలకు అసెంబ్లీకి రావాలంటూ సవాళ్లు విసురుతున్నాడు. ఇలాంటి భాష మాట్లాడేవారితో చర్చించేందుకు నేను అసెంబ్లీకి వెళ్లడం అవసరమా? నేను అసెంబ్లీకి రావాలా? వద్దా? మీరే చెప్పండి” అంటూ సమావేశంలో పాల్గొన్న పార్టీ నేతల అభిప్రాయాన్ని కోరారు. తన రాజకీయ జీవితాన్ని అంతం చేయాలనే ఉద్దేశంతో, నిత్యం తన చావు కోరుతూ అధికార పార్టీ నేతలు పదేపదే ప్రసంగాలు చేస్తున్నారని, అసెంబ్లీకి రావాలని డ్రామాలు చేస్తూ ధర్నాలకు దిగుతున్నారని కేసీఆర్ అన్నారు.

కాగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు, ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పకొట్టేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగుతానని కేసీఆర్ ప్రకటించారు. త్వరలోనే లక్ష మంది రైతులతో కలిసి కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తామన్నారు. ప్రజా క్షేత్రంలోనే ప్రభుత్వ మోసాలను నిలదీస్తామన్నారు. అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడాలని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎలుగెత్తి చాటాలని పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ పిలుపునిచ్చారు.

Popular Articles