కొత్తగూడెం: బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర విద్యార్థులతో కలిసి కొత్తగూడెంలో కదం తొక్కారు. విద్యార్థుల, యువత జీవితాలతో చెలగాటమాడిన పాలకులెవరూ బతికి బట్టకట్టిన దాఖలాలు లేవన్నారు. వారి శక్తి ముందు ఎంతటి నియంత అయినా కూడా తలవంచక తప్పదని రవిచంద్ర అన్నారు. కాంగ్రెస్ సర్కార్ 1,000 రోజుల పాలనా వైఫల్యాలను నిలదీస్తూ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో శనివారం విద్యార్థులు, నిరుద్యోగ యువతతో కలిసి పాదయాత్ర చేశారు. మార్కెట్ నుంచి సూపర్ బజార్ వరకు సాగిన ఈ ర్యాలీలో విద్యార్థులు, యువత ప్లకార్డులు చేబూని ప్రభుత్వ తప్పుడు విధానాలను ఎండగడుతూ పెద్ద పెట్టున నినాదాలిచ్చారు.
ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ, నీట్ పేపర్ లీక్ ను నిరసిస్తూ జంతర్ మంతర్ వద్ద వేలాది మంది విద్యార్థులు, యువత గుమిగూడడంతో ప్రధాని నరేంద్రమోడీ దిగివచ్చి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించడాన్ని గుర్తు చేశారు. తమిళనాడు రాజకీయ ముఖ చిత్రాన్ని కూడా సమూలంగా మార్చివేసింది విద్యార్థి శక్తేనని ఆయన వివరించారు. రేవంత్ రెడ్డి 1,000 అబద్ధాలతో అధికారంలోకి వచ్చి విద్యార్థులు,విద్యావంతులైన యువతను అరిగోస పెడుతున్నారని ఎంపీ రవిచంద్ర విమర్శించారు.

అన్ని వర్గాల వారికి ఇంగ్లీష్ మీడియంలో నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఉచిత విద్యను అందించాలనే సంకల్పంతో కేసీఆర్ 1,050 గురుకులాలను గొప్పగా తీర్చిదిద్దితే.. అవగాహన లేని ఈ పాలకులు వాటిని అధ్వాన్నంగా మార్చారని మండిపడ్డారు. తమ బంగారు భవిష్యత్తు కోసం కళాశాలలో ఉండాల్సిన విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగడం బాధాకరమన్నారు. రేవంత్ రెడ్డి 1,000 రోజుల పాలన వెర్రి పరిపాలనగా అభివర్ణిస్తూ, 100 రోజుల్లోనే అన్నింటినీ పరిష్కరిస్తానని గొప్పలు చెప్పి ఈ 33 నెలలలో ఏ ఒక్క వాగ్ధానం కూడా అమలుపర్చలేదని ఆయన మండిపడ్డారు.
రాష్ట్ర వార్షిక బడ్జెట్ 3లక్షల కోట్లు అని చెప్పుకునే ఈ ముఖ్యమంత్రి రూ. 13 వేల కోట్ల ఫీజు బకాయిలను విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఎంపీ రవిచంద్ర దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ సరూర్ నగర్ స్టేడియంలో ఆర్భాటంగా ప్రకటించిన యూత్ డిక్లరేషన్ ఒట్టిదేనని ఈ 1,000 రోజుల పాలనలో తేలిపోయిందన్నారు. రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకునే తిరిగే రాహూల్ గాంధీకి అశోక్ నగర్, చిక్కడపల్లిలకు వచ్చి యువతకు ఇచ్చిన హామీలు గుర్తుకు రావడం లేదా? అని వద్దిరాజు నిలదీశారు. కాంగ్రెస్ సర్కార్ రే విద్యార్థుల, యువత చేతుల్లో ఘోర పరాభవం తప్పదన్నారు.

పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుకు గుదిబండగా మారిన జీవో 97ను రద్దు చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ. 13 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేయాల్సిందిగా ఎంపీ వద్దిరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

