కొత్తగూడెం: తెలంగాణా రాష్ట్రంలో పాలన పూర్తిగా కుంటుపడిందని బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పదేపదే ఢిల్లీకి చక్కర్లు కొట్టడంతోనే కాలం గడిచిపోతోందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లుగా అనిపించడం లేదని, ప్రతి చిన్న విషయానికి ఢిల్లీ బాటపడుతున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ 1,000 రోజుల పాలనా వైఫల్యాలను ఎండగడుతూ భద్రాద్రి జిల్లా కొత్తగూడెం, ఇల్లందు కేంద్రాల్లో శుక్రవారం నిర్వహించిన వంటా-వార్పు కార్యక్రమాలకు ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వద్దరాజు మాట్లాడుతూ, ఢిల్లీ పార్టీలతో రాష్ట్రానికి ఒరిగేదేమీ ఉండదన్నారు. తెలంగాణను సాధించిన మన ఇంటి పార్టీ బీఆర్ఎస్, మహానేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వమే శ్రీరామరక్షగా చెప్పారు. మహిళా మంత్రి సురేఖను మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేసిన రేవంత్ రెడ్డి, ఆమె కుటుంబ సభ్యులు అడుగుతున్న ప్రశ్నలకు బదులివ్వకుండా దాటవేస్తున్నారని ఎంపీ రవిచంద్ర అన్నారు. కేసీఆర్ పాలనలో మహిళలతో పాటు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా జీవించారని, ఈ ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ రవిచంద్ర ఆవేదన వ్యక్తంచేశారు.

కాంగ్రెస్ నాయకులు ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లోనే అమలు చేస్తామంటూ 420 మోసపూరిత హామీలు, 6 గ్యారంటీలు ఇచ్చారని, వాటిలో ఏ ఒక్కటి దానిని కూడా పూర్తి చేయలేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో వంటావార్పు ద్వారా ప్రజలందరిని ఐక్యం చేస్తూ, రేవంత్ సర్కారు వైఫల్యాలను నిలదీస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించడం, కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోవడం, కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావడం తథ్యమని ఎంపీ వద్దిరాజు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాల్లో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, పార్టీ నాయకులు దిండిగల రాజేందర్, రంగనాథ్, జే.కే. శ్రీనివాస్, సత్యనారాయణలతో పాటు పలువురు పాల్గొన్నారు.
