కూసుమంచి: తెలంగాణా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలంలో గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తో కలిసి మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
తన పర్యటనలో భాగంగా మండలంలోని రాజుపేట బజార్ గ్రామం వద్ద ఈశ్వర మాదారం నుండి భద్రు తండా వరకు రూ.1.76 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, ఈశ్వరమాదారం-భద్రు తండా రోడ్డు నుండి తాళ్లగడ్డ తండా వరకు రూ.50 లక్షలతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం చౌటుపల్లి గ్రామంలో రూ.3.20 కోట్లతో నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జి పనులకు, లింగారం తండాలో రూ.1.28 కోట్లతో ఆర్ అండ్ బి రోడ్డు నుండి లింగారం తండా వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన నిర్వహించారు. లింగారం తండాలో రైతులను కలిసి వ్యవసాయ పనులపై ఆరా తీశారు. ఈశ్వర మాదారం గ్రామంలోని చౌక ధరల దుకాణంలో లబ్ధిదారులకు మూడు నెలల ఉచిత సన్న బియ్యాన్ని పంపిణీ చేశారు.
పాలేరుప్రాంతంలో భూ రీ-సర్వే చేపట్టామని, పరిశీలించి అర్హులైన వారికి పట్టాదారు పాస్‌బుక్ లు అందిస్తామని మంత్రి చెప్పారు. నకిలీ పాస్ బుక్ లను రద్దు చేసి, సర్వే ఆధారంగా ప్రతి రైతుకు న్యాయబద్ధమైన భూమికి పాస్‌బుక్ అందజేస్తామని ఆయన పేర్కొన్నారు.
అదేవిధంగా ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మం రూరల్ మండలంలో కూడా మంత్రి పర్యటించి మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. గుదిమల్లలో రూ.5 కోట్లతో ఖమ్మం రూరల్ మండలం ప్రకాష్ నగర్ బ్రిడ్జి నుంచి గుదిమల్ల వరకు చేపట్టనున్న రహదారి నిర్మాణ పనులకు, 2 కోట్ల 10 లక్షలతో కామంచికల్ గ్రామం నుంచి కోయచలక వరకు నిర్మించనున్న బీటీ రహదారి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
మంత్రి పర్యటనలో ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీరాజ్ ఎస్.ఈ. వెంకట్ రెడ్డి, డీవైఎస్‌వో సునీల్ రెడ్డి, ఆర్ అండ్ బి అధికారులు, ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ సైదులు, లింగారం తండా సర్పంచ్, ఉప సర్పంచ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

