Top 5 This Week

Related Posts

చిన్నారుల్లో మనోవికాసాన్ని కలిగించే ‘పిల్లల జాబిల్లి’ కథలు

(సమీక్ష ప్రత్యేకం)
తెలుగు సాహితీవనం ఆధ్వర్యంలో నిర్వహించిన “స్నిగ్ధ రెడ్డి బాలసాహిత్యం పురస్కారం” పొందిన కథల సంపుటి “పిల్లల జాబిల్లి”. రచయిత “వడ్డేపల్లె వెంకటేష్”. ఇతను నల్గొండ జిల్లాలోని ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయులు.

మెరుగైన సమాజాన్ని నిర్మించగలిగే ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూ వడ్డేపల్లి వెంకటేష్ అందించిన ”పిల్లల జాబిలి” కథలు సరళమైన శైలిలో, రంగు రంగుల చిత్రాలతో పిల్లల మనసులను ఆకట్టుకునేలా ఉన్నాయి.​ పిల్లల్లో ఊహాశక్తిని, నైతిక విలువలను, సమాజం పట్ల అవగాహనను పెంచడానికి ఈ కథల సంపుటి ఎంతో తోడ్పడుతుంది. ప్రకృతి సంరక్షణ, పరస్పర సహాయం, బుద్ధి బలం, కృతజ్ఞత వంటి ఎన్నో మంచితనాల్ని ఈ కథలు ప్రబోధిస్తున్నాయి.

”హరితవనం” కథ సమకాలీన సమస్యకు ఒక మార్గం చూపిస్తుంది. పిల్లల్లో ప్రకృతి – పర్యావరణ స్పృహను కలిగిస్తూ చెట్లను నరకడం వల్ల కలిగే నష్టాలను, పర్యావరణానికి జరిగే కీడును వివరిస్తుంది. చెట్లు మన ప్రాణకోటికి ఆధారం పర్యావరణాన్ని రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత..అనేది కథ ఉద్దేశంగా రచయిత నాటకీయంగా వినిపించాడు.

“సింహం మిఠాయి” కథ పిల్లలను బాగా ఆకట్టుకుంటుంది. ఎనకటి కాలంలో అమ్మమ్మ, నాయనమ్మలు చెప్పే, వినే కొద్ది వినాలనిపించే ఒక మంచి అనుభూతి ఈ కథ ద్వారా పాఠకులకు కలుగుతుంది. హనుమయ్య అనే వ్యాపారి అడవి మార్గం గుండా వెళ్తున్నప్పుడు నక్కల ఉపాయాలను దాటుకుని, చివరకు సింహం ఎదురైనప్పుడు భయపడకుండా తన బుద్ధి బలంతో, సమయస్ఫూర్తితో ఎలా తప్పించుకున్నాడనేది ఈ కథ సారాంశం. ఈ కథ వల్ల ఆపద సమయాల్లో భయపడకుండా స్థిరచిత్తంతో, సమయస్ఫూర్తితో ఆలోచిస్తే ఎంతటి ప్రమాదం నుంచైనా బయటపడవచ్చు అనే పరిజ్ఞానం పిల్లలకు అలవడుతుంది

మనకు ఉన్నదానితో ఇతరులకు సహాయం చేయడం వల్ల నిజమైన ఆనందం లభిస్తుందనే సందేశాన్ని ఇచ్చిన కథ “కోతి -బంగారు గాజు”. అడవిలో దొరికిన ఒక బంగారు గాజును చూసి ఆనందించిన కోతి, ఆ తర్వాత ఒక పాపకు సహాయం చేయడానికి ఆ గాజును ఎలా ఉపయోగించింది, దానికి బదులుగా ఆ పాప తల్లిదండ్రులు కోతికి ఎలా కృతజ్ఞత చూపించారనేది ఈ కథ చూపిస్తుంది.

”ఏనుగుల శక్తి… తేనెటీగల యుక్తి” కథ ఐకమత్యాన్ని ప్రబోధిస్తుంది. బలమైన ఏనుగుల గుంపు చెట్లను ఊపుతూ పక్షుల గూళ్లను పాడుచేస్తుంటే, చిన్నవైన తేనెటీగలు అన్నీ కలిసికట్టుగా ఒక ఉపాయం పన్ని ఆ ఏనుగులను ఎలా తరిమికొడుతాయి. “ఐక్యమత్యమే మహాబలం”. రూపంలో చిన్నవైనా, కలిసికట్టుగా పోరాడితే ఎంతటి పెద్ద సమస్యనైనా పరిష్కరించవచ్చు అనేది ఇక్కడ పిల్లలకు బోధ పడుతుంది.

మూగజీవాలకు మనం చేసే సహాయం, ఏదో ఒక రూపంలో మనకు మేలు కలిగిస్తుందనే నైతిక విలువలను నేర్పిస్తూ పరోపకారం – జీవకారుణ్యం అంశాలను స్పృశించిన “ఊరి కరువు తీరింది” కథ జంతువులకు మానవులకు మధ్య ” బంధం ” అనే ఒక వారధిని ఏర్పరిచింది. కరువుతో అల్లాడుతున్న గ్రామంలో, శేషయ్య అనే రైతు ఒక నక్కను ఆపద నుండి కాపాడతాడు. దానికి కృతజ్ఞతగా ఆ నక్క కొండ మీద నుండి నీరు ఊరిలోకి వచ్చేలా ఒక అద్భుతమైన ఉపాయాన్ని చెప్పి గ్రామ కరువును తీరుస్తుంది.

“చెట్టు చెప్పిన పాఠం” కథలో పరస్పర విరుద్ధ స్వభావాలైన “అహంకారం – వినయం” సమీపంగా కనిపిస్తూ పర్యవసానాల్ని వివరిస్తాయి. కథలోకి వెళ్తే.. ఒక అడవిలో నిటారుగా, అందంగా ఉండే చెట్టు తను చాలా గొప్పదానినని అహంకారంతో పక్కనే ఉన్న వంకర చెట్టును, పక్షులను అవహేళన చేస్తుంది. కానీ, కలప వ్యాపారులు వచ్చినప్పుడు నిటారుగా ఉన్న చెట్టునే నరకడానికి సిద్ధపడతారు. అప్పుడు వంకర చెట్టు, తేనెటీగలు కలిసి ఆ చెట్టును కాపాడతాయి. ఈ విధంగా అహంకారం ఎప్పటికైనా పతనానికి దారితీస్తుంది. రూపం ముఖ్యం కాదు, వినయం పరస్పర సహాయం ముఖ్యం అనే సందేశం చెప్పబడుతుంది.

ఏదో చిన్న విషయాన్ని చూసి ‘నది మునిగింది’ అంటూ అడవిలోని జంతువులన్నీ భయపడి పరుగులు తీస్తాయి. చివరకు సింహం, కాకి వంటి వివేకవంతులైన జంతువులు అసలు నిజాన్ని తెలుసుకుని అందరి భయాన్ని పోగొడతాయి. పుకార్లను నమ్మకూడదు… ఏదైనా విషయాన్ని కళ్లతో చూసి, నిజానిజాలు గ్రహించిన తర్వాతే నిర్ణయానికి రావాలి. అనే సందేశాన్ని “నది మునిగింది”కథ అందించింది.

“మూడు కొండ గొర్రెలు” కథను గమనిస్తే..
తోడేళ్ల గుంపు దాడి చేయాలని చూసినప్పుడు మూడు కొండ గొర్రెలు కొండ అంచున ఉంటూ, భయపడకుండా ఒకరికొకరు తోడుగా ఉంటూ, తోడేళ్ల వ్యూహాన్ని ఎలా తిప్పికొట్టాయో ఈ కథ తెలియజేస్తుంది. కష్టకాలంలో స్నేహితులు కలిసికట్టుగా ఉంటే శత్రువులను సులభంగా ఓడించవచ్చు అనే ఐక్యతను ఈ కథ ప్రబోధిస్తుంది.

బుద్ధికుశలతను తెలియజేస్తున్న కథ – దారి చూపిన రామచిలుక. చంద్రసేనుడు అనే రాజు పరిపాలనలో దొంగల భయం ఎక్కువైనప్పుడు, ఒక తెలివైన రామచిలుక దొంగల స్థావరాన్ని కనుగొనడంలో రాజుకు మరియు సైనికులకు ఎలా సహాయపడిందో ఈ కథ చెబుతుంది. శారీరక బలం కంటే బుద్ధి బలం, పరిశీలనా శక్తి సమాజానికి ఎంతో మేలు చేస్తాయి అనే నీతి ఈ కథ ద్వారా చెప్పబడింది.

“గాడిదకు తెలిసొచ్చింది” అనే కథ మన బాధ్యతల నుండి పారిపోవడం తాత్కాలిక ఆనందాన్ని ఇవ్వచ్చు కానీ, అది మనల్ని ప్రమాదంలోకి నెడుతుంది అనే నిజాన్ని తెలియజెప్పింది. కథలోకి వెళ్తే.. పిచ్చయ్య అనే గొర్రెల కాపరి వద్ద ఉన్న గాడిద, తన యజమాని పెడుతున్న పనుల నుండి తప్పించుకోవాలని అడవిలోకి పారిపోతుంది. కానీ అక్కడ ఎదురైన కష్టాలు, క్రూర జంతువుల భయం చూసి, చివరకు యజమాని ప్రేమే గొప్పదని తెలుసుకుని తిరిగి వచ్చేస్తుంది. ఈ విధంగా ఉన్నదానితో తృప్తి చెందడం నేర్చుకోవాలనే నీతి పిల్లలకు బోధపడుతుంది.

ముగింపు:
ఈ కథలన్నీ కేవలం కాలక్షేపం కోసం మాత్రమే కాకుండా, పిల్లల్లో నైతిక ప్రవర్తనను పెంపొందించడానికి అద్దం పడుతున్నాయి. ప్రకృతిని ప్రేమించడం, జంతువుల పట్ల దయ చూపడం, ఆపదలో బుద్ధిని ఉపయోగించడం వంటి నిత్య జీవిత పాఠాలను ఈ కథలు ఎంతో చక్కగా బోధిస్తున్నాయి. విద్యార్థులకు బాలలకు ఇవి ఎంతో పఠనీయమైనవి.

Popular Articles