ఖమ్మం: తక్కువ ధరకే బంగారాన్ని ఇప్పిస్తామని ప్రజలను నమ్మంచి, భారీ మొత్తాన్ని వసూల్ చేసి, ఆ తర్వాత వంచించిన ఇద్దరిని ఖమ్మం జిల్లా కారేపల్లి పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అయితే ప్రజల నుంచి వీళ్లు వసూలు చేసిన 85.70 లక్షల రూపాయలను జల్సాలకు, పూజలు, పునస్కారాలకు, తీర్థయాత్రలకు, చేసిన అప్పులు తీర్చుకునేందుకు ఖర్చు చేశారని కారేపల్లి పోలీసులు ప్రకటించారు.
కారేపల్లి సీఐ ఎన్. సాగర్ కథనం ప్రకారం.. బెంగళూరుకు చెందిన నారాయణ గురప్ప @ ఆనందరెడ్డి @ హరి ప్రసాద్ @ భోగా లక్ష్మీనారాయణ అనే వ్యక్తి వివిధ రాష్ట్రాల్లో పలు మోసాలకు పాల్పడినట్లు చరిత్ర ఉంది. ఉద్యోగాలు ఇప్పిస్తానని, భూములను, బంగారాన్ని తక్కువ ధరకే ఇప్పిస్తానని చెప్పి వివిధ రాష్ట్రాల్లో ఈ తరహా మోసాలకు పాల్పడ్డాడు. గురప్ప ఖమ్మం జిల్లాకు వచ్చి భోగా లక్ష్మీనారాయణ పేరుతో చెలామణి అయ్యాడు. అయ్యప్ప మాల ధరించి ఆధ్మాత్మిక వ్యక్తిగా గ్రామాల్లో పరిచయం పెంచుకున్నాడు.
అనంతరం కామేపల్లి మండలం బాసిత్ నగర్ కు చెందిన బానోత్ సాయికుమార్ (20)ను తన డ్రైవర్ గా, సహాయకుడిగా నియమించకుని, గత ఫిబ్రవరి నుంచి స్థానికంగా పలువురిని మోసం చేశాడు. కెప్టెన్ బంజారా గ్రామం కేంద్రంగా పూజలు, అన్నదానాలు, పడిపూజలు, శబరిమల, ఏడుపాయల జాతర వంటి యాత్రలు నిర్వహించడం ద్వారా స్థానికంగా ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నాడు. బానోత్ సాయికుమార్ తో కలిసి తక్కువ ధరలో బంగారం ఇప్పిస్తామని చెప్పి ప్రజల నుంచి భారీ మొత్తాలను వసూళ్లు చేశారు.

తొలుత కొందరికి డబ్బులు తిరిగి ఇస్తూ నమ్మకాన్ని పెంచి, ఆ తర్వాత పెద్ద మొత్తాల్లో ప్రజల నుంచి నగదును సేకరించిన గురప్ప, బానోత్ సాయికుమార్ లు పరారయ్యారు. కామేపల్లి మండలానికి చెందినవారినేగాక, ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాలకు చెందిన 18 మంది బాధితుల నుంచి రూ. 85.70 లక్షల మొత్తాన్ని ఇదే తరహాలో వసూల్ చేసి నిందితులు ఉడాయించారు.
ఈ విధంగా వసూళ్లు చేసిన మొత్తాలతో అయ్యప్ప పడిపూజలు, అన్నదాన కార్యక్రమాలకు, తీర్థయాత్రలకు, స్థానిక దేవాలయాల ఉత్సవాలకు, ఛత్రపతి శివాజీ విగ్రమ ప్రతిష్ట వంటి కార్యక్రమాలకేగాక, గ్రామస్తులకు అప్పుల రూపంలో రూ. 10.50 లక్షలు ఇచ్చారు. మిగతా డబ్బును విలాసాలకు, గోవా ట్రిప్పులకు, పాత అప్పులు తీర్చేందుకు ఖర్చు చేశామని నిందితుుల పేర్కొన్నట్లు కారేపల్లి సీఐ సాగర్ వివరించారు.
అయితే నిందితులు గురప్ప, బానోత్ సాయికుమార్ లు ఓ మైనర్ బాలికను తమ వెంట తీసుకువెళ్లిన ఘటనపై కల్లూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్లు చెప్పారు. ఈ విషయం తెలుసుకుని బాలికను కల్లూరులో దింపిన నిందితులు బాసిత్ నగర్ కు వచ్చి వెడుతుండగా అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీరి నుంచి ఒక మారుతి ఎకో కారు, రెండు మొబైల్ ఫోన్లు, భోగా లక్ష్మీనారాయణ పేరుతో ఉపయోగిస్తున్న ఆధార్ కార్డును స్వాధీనం చేసుకున్నట్లు కారేపల్లి సీఐ తెలిపారు. ప్రధాన నిందితుడు తెలంగాణా, ఏపీ, కర్నాటక రాష్ట్రాల్లో వివిధ పేర్లతో సంచరిస్తూ ఈ తరహా మోసాలకు పాల్పడి జైలు శిక్షను కూడా అనుభవించినట్లు ఆయన పేర్కొన్నారు.

