ఖమ్మం: తమ పొలంలో సేద్యం చేసుకుంటున్న ఓ జంటపై దౌర్జన్యానికి పాల్పడిన కేసులో నలుగురికి ఆరు నెలల జైలు శిక్షను విధిస్తూ ఖమ్మం సెకండ్ అడిషనల్ ఫస్ట్ క్లాస్ కోర్టు న్యాయమూర్తి బిందుప్రియ ఆరు నెలల జైలు శిక్షను విధిస్తూ తీర్పు చెప్పారు.
ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. ఖమ్మం నగరంలోని పాకబండ బజార్ కు చెందిన రావూరి విద్యాసాగర్, ఉషారాణి దంపతులు తమకు ధంసలాపురంలో గల మూడెకరాల భూమిని సాగు చేసుకుంటుండగా 2017 డిసెంబర్ 12వ తేదీన అల్లీపురానికి చెందిన ఇనగండ్ల బాబూరావు, రామారావు, సత్యనారాయణ, శ్రీనివాసరావు అనే వ్యక్తులు వారిని అటకాయించి దౌర్జన్యం చేశారు.
తమ తండ్రి వద్ద తక్కువ ధరకు భూమిని కొనుగోలు చేశారని, ఆ భూమిని తిరిగి తమకు అమ్మాలంటూ సోదరులైన ఆయా నలుగురు వ్యక్తులు విద్యాసాగర్, ఉషారాణి దంపతులను బెదిరించి, వారిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఘటనపై బాధిత దంపతులు ఖానాపురం హవేలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులపై కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు.
కేసులో వాద, ప్రతివాదనల అనంతరం నిందితులైన ఇనగండ్ల బాబూరావు, రామారావు, సత్యనారాయణ, శ్రీనివాసరావులపై అభియోగాలు రుజువు కావడంతో నిందితులను దోషులుగా నిర్ధారిస్తూ, వారికి ఆరు నెలల జైలు శిక్షను విధిస్తూ న్యాయమూర్తి బిందుప్రియ తీర్పు చెప్పారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున ఏపీపీ గాయత్రి వాదించారు.

