హైదరాబాద్: రాజ్యసభలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ గా నియమించి, తనకు కల్పించిన పొలిటికల్ పదోన్నతికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం రాజ్యసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న రవిచంద్ర బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ గా ఎన్నికైనట్లు గులాబీ పార్టీ చీఫ్ కేసీఆర్ ప్రకటించారు. ఈమేరకు కేసీఆర్ రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు లేఖ కూడా రాశారు.

ఇప్పటి వరకు ఈ పదవిలో గల కేఆర్ సురేష్ రెడ్డి స్థానంలో వద్దిరాజు రవిచంద్ర ఎన్నికైనట్లు, ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని కేసీఆర్ ఆయా లేఖలో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తనను రాజ్యసభలో బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా నియమించిన సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను వద్దిరాజు రవిచంద్ర మర్యాదపూర్వకంగా కలిశారు. తన పట్ల ఎంతో నమ్మకంతో ఈ పదవిలో నియమించినందుకు పార్టీ అధినేత కేసీఆర్ కు వద్దిరాజు ధన్యవాదాలు చెప్పారు.

ఈ సందర్భంగా కేసీఆర్ రవిచంద్రను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ వాణిని రాజ్యసభలో వినిపించే అంశంలో ఎంపీ వద్దిరాజుకు కేసీఆర్ దిశా, నిర్దేశం చేశారు. పార్టీ తనపట్ల ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కేసీఆర్ అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని వద్దిరాజు రవిచంద్ర ఈ సందర్భంగా చెప్పారు.

