Top 5 This Week

Related Posts

300 ఎకరాలు దానం చేశాడు.. చివరికి ఇల్లులేని నిష్క్రమణం! ఎవరీ మహానుభావుడు!!

ప్రజా సమస్యల కోసం..
దీన జనుల బతుకు కోసం..
మెరుగైన సమాజం కోసం..
శ్రమించిన ప్రజా నాయకుడు..
కొమ్మిడి నరసింహరెడ్డి..
ప్రజలు ప్రేమగా పిలుచుకునే
భూదాన్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా, బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కొమ్మిడి రామచంద్రారెడ్డి , లక్ష్మమ్మ దంపతులకు 1943 సెప్టెంబర్ 10న జన్మించారు. తల్లిదండ్రులకు మొత్తం ఐదుగురు సంతానం. వరుసగా కోదండరామిరెడ్డి, శశిరేఖ, సుగుణ, నరసింహారెడ్డి, బుచ్చిరెడ్డి. భూస్వామ్య కుటుంబం. నాలుగువందల ఎకరాల భూమి ఉండేది. ఊర్లో రెండు అంతస్తుల ఇల్లు, పన్నెండు మంది జీతగాళ్లు, ఎనిమిది గుర్రాలు, రెండువందల ఆవులు, వందల మేకలు, గొర్రెలు ఉండేవి.

తండ్రి రామచంద్రారెడ్డి పోలీస్ పటేల్. ఈ విధంగా ఊర్లో పెత్తనం వీళ్లదే. కానీ ఆధిపత్య భావజాలం ఉండేది కాదు. ప్రజలను కుటుంబ సభ్యులుగా భావిస్తూ శిస్తు వసూలు చేయడంలో కూడా ధర్మాన్ని పాటించేవారు . ఈ విధంగా గ్రామంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొని ఉండేది. ఇందుకంతటికీ కారణం ఆదర్శ భావాలు కలిగిన సాయుధ పోరాట వీరుడు వీరి సోదరుడైన కొమ్మిడి కోదండరామిరెడ్డి.

రాజకీయ ప్రస్థానం – నిరాడంబర జీవితం:
1962 – 1970 వరకు ఎనిమిది సంవత్సరాలు బ్రాహ్మణపల్లి సర్పంచ్ గా పనిచేశారు . 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో సర్పంచ్‌గా తెలంగాణ పోరాట సమితి భువనగిరి తాలూకా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. 1978 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి నల్గొండలోని భువనగిరి నియోజకవర్గం శాసనసభ్యుడుగా ఎన్నికయ్యారు. 1983 సార్వత్రిక ఎన్నికలలో ఎన్టీ రామారావు ప్రభంజనం రాష్ట్రమంతా ప్రభావం చూపినప్పటికీ, భువనగిరి నియోజకవర్గం నుండి రెండవసారి కాంగ్రెస్ పార్టీ నుండే శాసనసభ్యుడుగా విజయం సాధించారు.

1985 మధ్యంతర ఎన్నికల్లో కొమ్మిడి నరసింహారెడ్డి ఎమ్మెల్యే ఎన్నికల నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. ఇందుకు కారణం ఎన్నికల ఖర్చు భరించలేని ఆర్థిక పరిస్థితి. అప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆయన ఆస్తులు కూడబెట్టుకోలేదు. రాజకీయాల్లో చిన్న చిన్న పదవులు వచ్చినా, బంధువులు లేదా స్నేహితులు అధికారంలో ఉన్నా కోట్లు వెనకేసుకునే రోజుల్లో… ఆయన రెండుసార్లు శాసనసభ్యుడిగా పనిచేసినా ఎలాంటి ఆస్తులు సంపాదించుకోలేదు. ప్రజాధనాన్ని ఎక్కడ కూడా కొల్లగొట్టలేదు. రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ సొంత వాహనం లేదు.సొంత ఇల్లు లేదు. సాధారణ బజాజ్ చేతక్ స్కూటర్ పైనే తిరిగారు.

ప్రజాపోరాటాలు:
గోదావరి నదీ జలాల సాధన కోసం నరసింహారెడ్డి సాగించిన పోరాటాలు చారిత్రాత్మకం. భువనగిరి, ఆలేరు ప్రాంతాలకు సాగు నీరు అందించాలని ఇచ్చంపల్లి వద్ద గోదావరిపై బ్యారేజీ నిర్మాణం కోసం అలుపెరుగని పోరాటాలు చేసిన ఘనత నరసింహారెడ్డికే దక్కుతుంది. నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని మూసీ పరీవాహక ప్రాంతంలో కాలుష్యం నివారణ కోసం శక్తి వంచన లేకుండా పోరాటం చేశారు. జాతీయ రహదారి 202 విస్తరణలో భాగంగా రంగాపురం గ్రామ ప్రజలు ఇండ్లు పొలాలు కోల్పోయి నిర్వాసితులయ్యారు. అవి భూదాన్ భూములంటూ ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందలేదు. వారికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని పోరాటం చేశారు.ఇందులో భాగంగనే 2013 మార్చిలో బీబీనగర్లో నిమ్స్ ఏర్పాటు కోసం కోసం ఆమరణదీక్ష చేశారు.

బీబీనగర్ నిమ్స్ యూనివర్సిటీ కోసమని అప్పటి ప్రభుత్వం బీబీనగర్‌లోని 161 ఎకరాల స్థలాన్ని సేకరించింది. 2004లో శంకుస్థాపన చేసి, కొన్ని భవనాలు నిర్మించింది. యంత్రాలు, సిబ్బంది లేకుండా భూత్ బంగ్లాగా మారింది. ఈ పరిస్థితిలో భవనాలు కూలిపోతున్నాయే తప్ప నిమ్స్ విస్తరణ పనులే మొదలు కాలేదని, రిఫరల్ వైద్యశాలగా తక్షణమే ప్రారంభించి.. తెలంగాణ వైద్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని నరసింహారెడ్డి ఆమరణ దీక్షకు దిగారు.

భూదానం:
బ్రాహ్మణపల్లి లో తన సొంత వాటా కిందికి వచ్చిన భూమిలో 300 ఎకరాల సాగు భూమిని భూములు లేని పేద ప్రజలకు పంచి ఇచ్చారు.అందులో కొన్ని ఎకరాలు దళితులకు ఇచ్చి ఓ కాలనీ ఏర్పాటు చేశారు. సీలింగ్ చట్టం ప్రకారం 80 ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చేశారు. ఆ విధంగా ప్రజలు నరసింహారెడ్డిని భూదాన్ రెడ్డి అని ప్రేమగా అభిమానంగా పిలుచుకుంటారు.

బ్లూప్రింట్:
గోదావరి జలాలను మూసీ నదిలోకి మళ్ళించడం ద్వారా లక్ష ఎకరాలను ఏ విధంగా సశ్యశ్యామలం చేయవచ్చో ఒక బ్లూప్రింట్ తయారుచేశాడు. బ్లూ ప్రింట్‌ను ఒక పెద్ద ఫ్లెక్సీపై ప్రింట్ చేయించి, దాన్ని గచ్చుమీద పరచి, ఒక ఉపాధ్యాయుడిలా వివరించడం చేస్తుంటారు . జర్నలిస్టులు ఈ విషయాన్ని వార్తగా రాస్తారు కానీ నాయకులకు ఈ విషయం తలకు ఎక్కకపోవడం విచారకరం .

అవమానించిన ఎన్టీ రామారావు:
ఎన్టీ రామారావు 1982 ఏప్రిల్ నుంచి 1983 జనవరి వరకు తొమ్మిది నెలలపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నలుమూలలా 40,000 కిలోమీటర్లు చైతన్య రథ యాత్రలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఎన్టీ రామారావు ఉమ్మడి కరీంనగర్ పర్యటనలో ఉన్నప్పుడు రాజకీయ కోణంలో ఎన్టీ రామారావుతో మర్రి చెన్నారెడ్డి కలవాల్సి వచ్చింది. ఈ బాధ్యతను చెన్నారెడ్డి నర్సింహారెడ్డికి అప్పజెప్పారు. ఎస్పీ ఆఫీస్‌లో ఉన్న ఎన్టీ రామారావును కలవడానికి నారాయణ అనే మరో నాయకుడి సహాయంతో నర్సింహారెడ్డి బయలుదేరి వెళ్ళారు.

అప్పటికే చైతన్య రథంలో కూర్చున్న ఎన్టీఆర్ ఏ మూడ్ లో ఉన్నారో ఏమో గాని, పరిచయం చేయబోతున్న నారాయణని, పక్కనే ఉన్న నరసింహారెడ్డిని అకారణంగా విసుక్కున్నారని, అక్కడినుంచి వెళ్లండంటూ గట్టిగా అరిచారని, ఎన్టీ రామారావు ప్రవర్తించిన తీరు నర్సింహారెడ్డి మనసును నొప్పించిందని, తీవ్ర మనస్తాపంతో అక్కడి నుండి వెనక్కి వచ్చేశారని, అది ఓ రాజకీయ ప్రజా నాయకుడికి ఉండాల్సిన లక్షణం కాదని నరసింహారెడ్డి వాపోయారని, నేటికిని రాజకీయ సంభాషణల్లో దొర్లుతున్న కథనం! అందుకే ఆ తర్వాత కాలంలో ఎన్టీ రామారావే స్వయంగా నరసింహారెడ్డిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించినా కూడా నరసింహారెడ్డి వెళ్లలేదనేది కూడా ఆ కథనపు సారాంశం!

సొంత ఇంటి కోసం:
మిగిలిన కొంత భూమిని అమ్మేసి పిల్లలను చదివించారు. మిగిలిన మరికొంత భూమి బొల్లేపల్లి కాలువ తవ్వకాల్లో పోయింది. కానీ తీసుకున్న భూమికి పరిహారం చెల్లించలేదు. పరిహారం వస్తే అద్దె ఇల్లు వదిలిపెట్టి సొంత ఇల్లు ఒకటి ఏర్పాటు చేసుకోవాలని సీఎం, ఎమ్మెల్యేలు, కలెక్టర్లను కలిసి వినతి పత్రాలు ఇచ్చినా పరిహారం డబ్బులు అందలేదు. కొమ్మిడి నరసింహారెడ్డి భార్య సుకన్యమ్మ . ఈ దంపతులకు నలుగురు కుమారులు. ఇద్దరు కూతుళ్లు, కుమారులు ప్రయివేటు ఉద్యోగాల్లో ఉన్నారు.

నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రజా హక్కుల కోసం, పరితపించిన, పోరాడిన,ఒక గొప్ప నిబద్ధత గల నాయకుడు. గత కొంతకాలంగా వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 7వ తేదీన ఉదయం తుదిశ్వాస విడిచారు. అధికార లాంఛనాలతో ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను నిర్వహించింది. కొమ్మిడి నరసింహారెడ్డి సేవలు చిరస్మరణీయం.

✍️ డా. తంగెళ్ల శ్రీదేవిరెడ్డి

Popular Articles