Top 5 This Week

Related Posts

కరీంనగర్ లో మరో ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం

కరీంనగర్: కరీంనగర్ లో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల వరుస దగ్ధపు ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా బుధవారం కరీంనగర్ -2 బస్సు డిపోలో ఎలక్ట్రిక్ బస్సును అగ్ని కీలలు చుట్టుముట్టాయి. గడచిన పది రోజుల వ్యవధిలోనే కరీంగనర్ లో మరో ఎలక్ట్రిక్ బస్సు దగ్డం కావడం గమనార్హం. అయితే ఈ రెండు ఘటనల్లోనూ అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ, బస్సులు ఇలా వరుసగా దగ్ధమవుతున్న ఘటనలు సహజంగానే ప్రయాణీలకు భద్రతపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి.

ఈనెల 21వ తేదీన కరీంనగర్ శివార్లలోని హైదరాబాద్ మార్గంలో గల అలుగునూరు వద్ద ఎలక్ట్రిక్ బస్సు దగ్ధమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో డ్రైవర్ వెంటనే స్పందించి బస్సును రోడ్డు పక్కకు నిలిపారు. అత్యంత చాకచక్యంగా ఎమర్జెన్సీ డోర్ ద్వారా 41 మంది ప్రయాణికులను డ్రైవర్ సురక్షితంగా దించేశారు. కానీ అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికే బస్సు పూర్తిగా దగ్ధమైంది.

కరీంనగర్ డిపోలో బుధవారం ఎలక్ట్రిక్ బస్సు ప్రమాదపు చిత్రం

ఈ ఘటనను పూర్తిగా మర్చిపోకముందే బుధవారం తెల్లవారుజామును కరీంనగర్-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సు ప్రమాదానికి గురైంది. డిపోలో 104 ఎలక్ట్రిక్ బస్సులు ఉండగా, ఈ తెల్లవారుజామున పార్కింగ్ చేసి ఉన్న బస్సు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆర్టీసీ సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను అదుపులోకి తెచ్చేసరికే బస్సు పాక్షికంగా దగ్ధమైంది.

మొత్తం 12 బ్యాటరీలు గల ఎలక్ట్రికల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడం సిబ్బందిని తీవ్ర ఆందోళనకు గురి చేసింది. బ్యాటరీ లోపం వల్లే ప్రమాదాలు జరుగుతున్నట్లు ప్రాథమికంగా ఆర్టీసీ అధికారులు నిర్ధారణకు వచ్చారు. అలుగునూరు బస్సు దగ్ధం ఘటనలోనూ బస్సులోని హెచ్‌వీ (HV) బ్యాటరీ కంపార్ట్‌మెంట్‌లో సాంకేతిక లోపంవల్లగాని, షార్ట్ సర్క్యూట్ కారణంగానో మంటలు చెలరేగినట్లు గుర్తించారు. ఎలక్ట్రిక్ బస్సుల వరుస ప్రమాదాలపై సమగ్ర విచారణకు అధికారులు ఆదేశించారు.

Popular Articles