Top 5 This Week

Related Posts

ఖమ్మంలో అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్: భారీగా బంగారం రికవరీ

ఖమ్మం: ఖమ్మం నగర పోలీసులు ఓ అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేశారు. దొంగ నుంచి రూ. 32.00 లక్షల విలువైన 32 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. రాత్రివేళ తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ గా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఈ దొంగను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఖమ్మం సిటీ ఏసీపీ ఎస్.వి. రమణమూర్తి బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఏసీపీ రమణమూర్తి కథనం ప్రకారం.. మధిర మండలం ఆత్కూరుకు చెందిన కంబంపాటి ఏసోబు అలియాస్ కందుల సురేష్ రెడ్డి (45) అనే వ్యక్తి గత కొన్ని నెలలుగా రాత్రి పూట తాళం వేసిన ఇళ్ళను లక్ష్యంగా చేసుకొని వరుస దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఇటు తెలంగాణా, అటు ఏపీలోని అనేక ప్రాంతాల్లో ఇదేే తరహాలో ఏసోబు పలు దొంగతనాలకు పాల్పడ్డాడు. వివిధ కేసుల్లో అరెస్టయి, పలుసార్లు జైలు శిక్షను కూడా అనుభవించిన ఏసోబును ఖమ్మం నగరంలోని కిన్నెర హోటల్ ఎదురుగా ఉన్న పెట్రోల్ బంకు వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పందంగా కనిపించిన ఏసోబు సెంట్రింట్ పనులు కూడా చేస్తుంటాడు.

దొంగ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న బంగారు, వెండి ఆభరణాలు

గడచిన ఏడాది కాలంలో ఏసోబు తెలంగాణా, ఏపీ రాష్ట్రాల్లోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడ్డాడు. ఏసోబుపై గతంలోనే 22 దొంగతనాల కేసులు ఉన్నాయి. పోలీస్ స్టేషన్ల వారీగా ఖమ్మం టూ టౌన్ పరిధిలో 4, ఖానాపురం హవేలీ పరిధిలో 3, వేంసూరు, వీఎం బంజర, చిల్లకల్లు, తిరువూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒక్కోటి చొప్పున ఏసోబు గడచిన ఏడాది కాలంలో చోరీలకు పాల్పడినట్లు ఏసీపీ తెలిపారు. అరెస్ట్ చేసిన ఏసోబు నుంచి రికవరీ చేసిన చోరీ సొత్తులో రూ. 40 వేల విలువైన వెండి ఆభరణాలు కూడా ఉన్నట్లు కూడా ఆయన వివరించారు.

మీడియా సమావేశంలో సీసీఎస్ ఏసీపీ సర్వర్, నగరంలోని ఖమ్మం టూ టౌన్, హవేలీ, వన్ టౌన్ స్టేషన్ల సీఐలు బాలకృష్ణ, భానుప్రకాష్, కరుణాకర్ లతోపాటు ఎస్ఐ రమేష్, సీసీఎస్ సిబ్బంది కూడా పాల్గొన్నారు.

Popular Articles