Top 5 This Week

Related Posts

ఖమ్మంలో భారీ చోరీ

ఖమ్మం: ఖమ్మం నగరంలో ఈ తెల్లవారుజామున భారీ చోరీ ఘటన జరిగింది. నగరంలోని ప్రధాన మార్గమైన వైరా రోడ్ లో గల సోనో విజన్ షాపులో దుండగులు ప్రవేశించి విలువైన సెల్ ఫోన్లను, ఇతర సొత్తును దొంగలించారు. దోపిడీకి గురైన సొత్తు విలువ సుమారు రూ. 60.00 లక్షల వరకు ఉంటుందని నగర ఏసీపీ రమణమూర్తి ‘సమీక్ష’ న్యూస్ కు తెలిపారు.

ఖమ్మం సిటీ ఏసీపీ కథనం ప్రకారం.. ఈ తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఘటన జరిగింది. షాపులోకి దుండగులు ప్రవేశించగానే అలారం మోగింది. అలారం మోతను విజయవాడలోని సోనో విజన్ షాపునకు సంబంధించినవారు గమనించి 3.40 గంటల ప్రాంతంలో స్థానిక షాపు నిర్వాహకులకు, సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన ఖమ్మం సోనో విజన్ షాపునకు చెందిన వ్యక్తుల అక్కడికి చేరుకునేలోపే దుండగులు చోరీకి పాల్పడి షాపు నుంచి బయటకు వస్తున్నారు.

ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకుంటున్న పోలీస్ కమిషనర్ సునీల్ దత్, చిత్రంలో సిటీ ఏసీపీ రమణమూర్తి కూడా ఉన్నారు.

అప్పటికే షాపు ముందు గల తమ కారులో దుండగులు పరారీ అయ్యేందుకు ప్రయత్నిస్తుండగా, అదే సమయానికి చేరుకున్న షాపు సిబ్బంది ఇద్దరు తమ బుల్లెట్ వాహనాన్ని కారుకు ముందు ఉంచి నిలువరించేందుకు ప్రయత్నించారు. కానీ దుండగులు తమ కారును రివర్స్ మార్గంలో యూ టర్న్ తీసుకుని వైరా మార్గం వైపు అత్యంత వేగంతో జారుకున్నారు. దుండగుల కారును బుల్లెట్ పై షాపు సిబ్బంది అనుసరించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.

షాపులో విలువైన ఐ ఫోన్లు, ఛార్జర్లు, అడాప్టర్లు వంటి సొత్తు చోరీకి గురైందని, వీటి విలువ రూ. 60.00 లక్షల వరకు ఉంటుందని ప్రాథమికంగా గుర్తించినట్లు ఏసీపీ రమణమూర్తి చెప్పారు. సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని, దుండగుల కోసం గాలిస్తున్నామని ఆయన చెప్పారు. అలారం మోతకు సంబంధించి విజయవాడ షాపు నిర్వాహకులు వారి సిబ్బందికి కాకుండా, తమకు సమాచారం అందిస్తే దొంగలను పట్టుకునేవారమని ఏసీపీ రమణమూర్తి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

కాగా ఘటనా స్థలాన్ని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సందర్శించి, చోరీ జరిగిన ప్రాంతాన్ని, షాపును పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిందితులను వీలైనంత తొందరలో పట్టుకునేలా పోలీస్ అధికారులకు దిశా, నిర్దేశం చేశారు.

Popular Articles