విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ లో సోమవారం సాయంత్రం చోటు చేసుకున్న ప్రమాదంలో ఘోర విషాదం అలుముకుంది. స్టీల్ ప్లాంట్ లోని స్టీల్ మెటల్ లిక్విడ్ ల్యాడిల్ పేలిన ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం చెందగా, మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
స్టీల్ ప్లాంట్ లోని ఎస్ఎంఎస్-2, ఎస్టీసీ-3 హీట్ ఎఫ్జీలో స్టీల్ మెటల్ లిక్విడ్ ల్యాడిల్ పేలడంతో ఉక్కు ద్రవం లీకైంది. దీంతో మంటలు చెలరేగి తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 1,500 డిగ్రీల వేడితో ఉక్కు ద్రవానని లిఫ్ట్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైనా కార్మికులు, ఉద్యోగులు బయటకు పరుగులంకించుకున్నారు. చనిపోయినవారిలో ఏడుగురిని గుర్తించారు. మృతుల్లో ఐదుగురు ఉద్యోగులు కాగా, మిగతావారు ఔట్ సోర్సింగ్ కార్మికులుగా అధికారులు చెబుతున్నారు.

కాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చనిపోయినారి కుటుంబాలకు రూ. 2.00 లక్షలు, గాయపడినవారికి రూ. 50 వేల చొప్పున ప్రధాన మంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ కింద పరిహారం చెల్లించున్నట్లు కేంద్రం ప్రకటించింది.

