హైదరాబాద్: మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్ (64), అతని భార్య, రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేదర దానమ్మ అలియాస్ లత తెలంగాణా డీజీపీ సీవీ ఆనంద్ ముందు మంగళవారం లొంగిపోయారు.
హన్మకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడికి చెందిన నరహరి డిగ్రీ మొదటి సంవత్సరంలోనే చదువును అర్థంతరంగా ఆపేసి, రాడికల్ స్టూడెంట్ యూనియన్ (RSU)లో చేరి, అంచెలంచెలుగా పార్టీ కేంద్ర కమిటీ సభ్యుని స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం నరహరి బీహార్-జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ కార్యదర్శిగానూ వ్యవహరిస్తున్నారు. తుపాకులు, మోర్టార్లు, రాకెట్ లాంఛర్లు, గ్రెనేడ్లు, బూబీ ట్రాప్స్ తయారీలో, వాటి నిర్వహణలో నరహరి నిపుణుడు.
అదేవిధంగా నరహరి భార్య మేదర దానమ్మ అలియాస్ లత ఏపీలోని గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడుకు చెందినవారు. బీహార్-జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా వ్యవహరిస్తున్న దానమ్మ పార్టీలో చేరాక, నరహరిని వివాహం చేసుకుంది.

ఈ ఇద్దరి లొంగుబాటు సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ, ఈ పరిణామం మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా అభివర్ణించారు. మావోయిస్టు పార్టీకి మిగిలి ఉన్నటువంటి ఏకైక తూర్పు ప్రాంతీయ బ్యూరో పతనం అంచుకు చేరినట్లయిందని చెప్పారు.
తెలంగాణాకు చెందిన ఇక ముగ్గురు మావోయిస్టులు మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారని, వారిలో ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి, జాడె రత్నాభాయి అలియాస్ సుజాత, వార్త శేఖర్ అలియాస్ మంగ్తు ఉన్నారని తెలిపారు. వీళ్లు కూడా ప్రభుత్వానికి లొంగిపోయి తెలంగాణా ప్రభుత్వం ద్వారా లభించే అన్ని ప్రయోజనాలను పొందాలని డీజీపీ ఆనంద్ పిలుపునిచ్చారు.

