(సమీక్ష ప్రత్యేకం)
యుద్ధాల కారణంగా పర్యాటకుల రాకపోకలు తగ్గిన సమయంలో జపాన్ టూరిజానికి 9 నెలల వయస్సు గల మంచు కోతి పిల్ల కొత్త ఉత్తేజాన్ని నింపింది. Macaque అనే జాతికి చెందిన కోతులను జపాన్ ప్రభుత్వం ఇచికావా అనే జూలో సంరక్షిస్తోంది. అందులో ఒక ఆడ కోతి తొలి కాన్పులో పుట్టిన బిడ్డను పట్టించుకోకుండా విసిరికొట్టడాన్ని జూ సిబ్బంది గుర్తించారు. జూ సంరక్షకులు ఆ మగబిడ్డకు Punch Kun అనే పేరు పెట్టి ప్రత్యేక శ్రద్ధతో సాకడం మొదులపెట్టారు.
అయితే దగ్గరకు వెళ్లినా ఆ బిడ్డ ఎవరో తనకు తెలియనట్టు తల్లి వ్యవహరించడం, మిగతా కోతులు పంచ్ ను వేధించడం సోషల్ మీడియా ద్వారా బయటి ప్రపంచానికి తెలిసింది. పంచ్ ను పెద్ద మకాక్ లు నేలకేసి కొట్టడం, ఈడ్చుకుంటూ వెళ్లే వీడియోలు వైరల్ అయ్యాయి. తోడుగా ఒకరున్నారనే భావన కల్పించేందుకు జూ సిబ్బంది నారింజ రంగు ఒరాంగుటాన్ దూదిబొమ్మను అందజేశఆరు. ఆందోళనకు గురైనప్పుడల్లా కోతిపిల్ల పంచ్ కున్ ఆ బొమ్మ దగ్గరకు చేసి సేద తీరడం మరో ఆకర్షణగా మారింది.

ఈ నేపథ్యంలోనే ఒరాంగుటాన్ బొమ్మను IKEAలో కొన్నట్టు తెలియడంతో ప్రపంచవ్యాప్తంగా వాటి అమ్మకాలు పెరిగాయి. మిలియన్ల కొద్ది ఒరాంగుటాన్ స్టఫ్డ్ డాల్స్ ను ఐకియా ప్రత్యేకంగా తయారు చేయించి విక్రయించింది. జపాన్ లోని Yomiuri Shimbun లాంటి మెయిన్ స్ట్రీమ్ పత్రికలు అనాథగా మారిన పంచ్ కున్ వెతలను ప్రత్యేక వార్తా కథనాలుగా ప్రచురించాయి. ఈ కథనాలను పశ్చిమ దేశాల మీడియా కూడా అందుకోవడంతో ఈ కోతి పిల్ల ప్రస్తుతం పెద్ద సెలెబ్రిటీగా మారింది.
పంచ్ కున్ సంరక్షణ కోసం జంతు ప్రేమికులు రూ. 20 కోట్ల విరాళాలను జూకి పంపించడం విశేషం. పంచ్ ను స్వయంగా చూసేందుకు 5 లక్షల మంది టూరిస్టులు ఈ నాలుగైదు నెలల్లో జపాన్ ను సందర్శించారు. పంచ్ కున్ ముద్దు చేష్టల వందలాది వీడియోలు రోజూ వివిధ భాషల్లో వైరల్ అవుతున్నాయి. మకాక్ కోతుల జీవిత కాలం 22 ఏళ్లు.

✍️ బి.టి. గోవిందరెడ్డి
సీనియర్ జర్నలిస్ట్

