హైదరాబాద్: హైదరాబాద్ రెడ్ హిల్స్ లోని జలమండలి జనరల్ మేనేజర్ సగ్గం అనంతలక్ష్మి కుమార్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ తదితర జిల్లాల్లో గల అతని బంధువులకు చెందిన మొత్తం ఎనిమిది ఇండ్లలోనూ ఏకకాలంలో ఏసీబీ సోదాలు చేస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే అభియోగాలపై కుమార్ నివాసంలో నిర్వహిస్తున్న సోదాల్లో బహిరంగ మార్కెట్ ధరల ప్రకారం రూ. 100 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ ఇప్పటికే ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది.

సోదాల్లో హైదరాబాద్ మల్లాపూర్ లోని కుమార్ నివాసంలో రూ. 1.10 కోట్ల నగదును, కిలోకుపైగా బంగారు నగలను, రెండున్నర కిలోల వరకు వెండిని స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ లో 3.00 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్ లో ఆరు ఓపెన్ ప్లాట్లు, మూడు గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్లను గుర్తించి, వాటికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ లాకర్లను కూడా గుర్తించిన ఏసీబీ అధికారులు వాటిని తెరిచే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఏసీబీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
Update:
ఇవీ అధికారిక ప్రకటనలో కుమార్ ఆస్తుల వివరాలు:
సగ్గం అనంతలక్ష్మీ కుమార్ నివాసంలో సోదాల అనంతరం ఏసీబీ మంగళవారం రాత్రి అధికారిక ప్రకటన విడుదల చేసింది. అక్రమాస్తుల అంశంలో కుమార్ పై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపింది. కుమార్ ఇంట్లోనేగాక, అతని బంధువులు, స్నేహితులు, బినామీల పేరుతో గల ఆస్తులను ఏసీబీ గుర్తించింది. తనిఖీల అనంతరం ఏసీబీ ప్రకటించిన ప్రకారం.. నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో 18 ఎకరాల వ్యవసాయ భూములు, ఆరు ఓపెన్ ప్లాట్లు, మూడు ఫ్లాట్లు, ఓ ఇల్లును కుమార్ హైదరాబాద్ లో కలిగి ఉన్నట్లు కనుగొన్నారు. ఈ సందర్భంగా సుమారు 1.10 కోట్ల నగదు, 2.1 కిలోల బంగారం ఆభరణాలు, 9.2 కిలోల వెండి సహా మొత్తం రూ. 5.88 కోట్ల ఆస్తులను గుర్తించారు. వీటి విలువ మార్కెట్ ధర ప్రకారం అనేక రెట్లు అధికంగా ఉండవచ్చని ఏసీబీ భావిస్తోంది.


