Top 5 This Week

Related Posts

హిట్లర్ బంకర్ లో దాక్కున్న రోజు.. గోబెల్స్ తో కలిసి విషగుళికలు తీసుకున్న చరిత్ర మీకు తెలుసా?

ప్రపంచాన్నే గడగడలాడించిన ఫాసిస్టు హిట్లర్ సేనలను మాస్కో నుంచి బెర్లిన్ దాకా తరిమితరిమి కొట్టిన రోజు. తమకు ఎదురే లేదని విర్రవీగిన నాజీలను మట్టి కరిపించి రీచ్‌స్టాగ్ (జర్మన్ పార్లమెంటు) పై సోవియట్ సైనికులు ఎర్ర జెండా రెపరెపలాడించిన రోజు. మూడు కోట్ల మంది రష్యన్లు రక్తతర్పణం చేసి ఫాసిజాన్ని చిత్తుచిత్తుగా ఓడించిన రోజు. ఫాసిజాన్ని ఓడించగలిగే సత్తా సోషలిజానికే ఉందని సగర్వంగా చాటిచెప్పిన రోజు. అదే 1945, మే 9వ తేదీ. ఈ రోజును ‘విక్టరీ డే’ గా రష్యా ప్రతి ఏటా జరుపుకుంటున్నది.

ఇరవయ్యో శతాబ్దంలో మానవ నాగరికతను అత్యంత భయంకరమైన అంధకారంలోకి నెట్టిన శక్తి ఏదైనా ఉందంటే అది హిట్లర్ ఫాసిజమే. ఫాసిజం కేవలం ఒక రాజకీయ విధానం కాదు. అది జాత్యహంకారం, దురాక్రమణ, యుద్ధోన్మాదం, ప్రజాస్వామ్య వ్యతిరేకత, మానవత్వంపై ద్వేషం కలగలిపిన ఒక క్రూర సిద్ధాంతం. ప్రపంచాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలనే ఆశతో నాజీ జర్మనీ ప్రారంభించిన యుద్ధం కోట్లాది ప్రజల ప్రాణాలను బలి తీసుకుంది.

మొదటి ప్రపంచ యుద్ధం అనంతరం జర్మనీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. వెర్సైల్స్ ఒప్పందం జర్మనీపై భారీ పరిహార భారం మోపింది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పేదరికం ప్రజలను తీవ్ర అసంతృప్తిలోకి నెట్టాయి. ఈ పరిస్థితిని ఉపయోగించుకుని అడాల్ఫ్ హిట్లర్ జర్మన్ జాతీయతను రెచ్చగొట్టాడు ప్రజల్లో ద్వేషాన్ని, యుద్ధోన్మాదాన్ని పెంచాడు. యూదులు, కమ్యూనిస్టులు, సోషలిస్టులు, కార్మిక సంఘాలు అన్నింటినీ శత్రువులుగా చిత్రీకరించాడు.

అయితే హిట్లర్ దూకుడుకు కేవలం అతని వ్యక్తిగత క్రూరత్వమే కారణం కాదు. అప్పటికే ప్రపంచ మార్కెట్లపై బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా వంటి సామ్రాజ్యవాద శక్తుల ఆధిపత్యం కొనసాగుతోంది. వలస రాజ్యాలు, వాణిజ్య మార్గాలు, ముడిసరుకు వనరులు ఇప్పటికే వారి చేతుల్లో ఉన్నాయి.

ప్రపంచ పునర్విభజన కోసం ఆలస్యంగా రంగంలోకి వచ్చిన జర్మన్ పెట్టుబడిదారీ వర్గం కొత్త మార్కెట్లు, వనరులు, భూభాగాల కోసం దూకుడు మార్గాన్ని ఎంచుకుంది. ఆర్థిక సంక్షోభం, పెట్టుబడిదారీ పోటీ, సామ్రాజ్యవాద విభేదాలు చివరకు ఫాసిజాన్ని యుద్ధ మార్గంలోకి నెట్టాయి.

హిట్లర్ మొదట ఆస్ట్రియాను ఆక్రమించాడు. తరువాత చెకోస్లోవేకియాలోని సుడేటన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఈ దశలో బ్రిటన్, ఫ్రాన్స్ ‘బుజ్జగింపు’ విధానాన్ని అనుసరించాయి. హిట్లర్‌ను ఎదుర్కొనే బదులు అతడిని ప్రసన్నం చేయడానికి ప్రయత్నించాయి, 1938 మ్యూనిక్ ఒప్పందం ద్వారా చెకోస్లోవేకియా భూభాగాన్ని నాజీ జర్మనీకి అప్పగించాయి.

ఫాసిజం సోవియట్ యూనియన్‌పై దాడి చేస్తుందని, కమ్యూనిజాన్ని అణచివేస్తుందని భావించిన పాశ్చాత్య శక్తులు హిట్లర్‌ను మొదట్లో ప్రమాదంగా కాకుండా ఒక ఉపయోగకరమైన శక్తిగా కూడా చూశాయి. కానీ ఫాసిజం ఎవరితోనూ రాజీ పడదు. అది విస్తరణ కోసమే జీవిస్తుంది. అది ఎల్లలు లేని ఫాసిజాన్నీ, క్రూరమైన దాడిని కొనసాగిస్తుంది.

1939లో పోలాండ్‌పై దాడితో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. నాజీ సైన్యాలు యూరప్‌లో అనేక దేశాలను చిత్తు చేశాయి. ఫ్రాన్స్ కొద్ది వారాల్లోనే కూలిపోయింది. యూరప్ అంతటా నాజీ జెండా ఎగరడం ప్రారంభమైంది. కానీ హిట్లర్ అసలు లక్ష్యం సోవియట్ యూనియన్. కమ్యూనిజాన్ని నాశనం చేయడం, సోవియట్ భూభాగాలను స్వాధీనం చేసుకోవడం, స్లావిక్ ప్రజలను బానిసలుగా మార్చడం అతని ప్రణాళికలో భాగం.

1941 జూన్ 22న ‘ఆపరేషన్ బార్బరోస్సా’ పేరుతో జర్మనీ సోవియట్ యూనియన్‌పై అతిపెద్ద దాడిని ప్రారంభించింది. లక్షలాది సైనికులు, వేలాది ట్యాంకులు, యుద్ధవిమానాలతో నాజీ సైన్యం సోవియట్ భూభాగంలోకి దూసుకెళ్లింది. గ్రామాలు దగ్ధమయ్యాయి. నగరాలు ధ్వంసమయ్యాయి. కోట్లాది సోవియట్ ప్రజలు మరణించారు.

లెనిన్గ్రాడ్ ముట్టడి, స్టాలిన్గ్రాడ్ యుద్ధం, మాస్కోపై దాడి వంటి ఘటనలు మానవ చరిత్రలోనే అత్యంత భయంకరమైన అధ్యాయాలుగా నిలిచాయి. నాజీ దళాలు కేవలం యుద్ధమే చేయలేదు.సామూహిక హత్యలు, యూదుల నిర్మూలన, గ్రామాల నరమేధం, యుద్ధ ఖైదీల హత్యలు జరిపాయి.

కానీ సోవియట్ ప్రజలు లొంగలేదు. జోసెఫ్ స్టాలిన్ నాయకత్వంలో రెడ్ ఆర్మీ అపార త్యాగాలతో ప్రతిఘటించింది. కార్మికులు కర్మాగారాల్లో రాత్రింబవళ్లు ఆయుధాలు తయారు చేశారు. రైతులు ఆహారం సమకూర్చారు. మహిళలు కూడా యుద్ధరంగంలోకి దిగారు. స్టాలిన్గ్రాడ్ యుద్ధం ఫాసిజం వెన్ను విరిచిన మలుపుగా మారింది. అక్కడ నాజీ సైన్యాలు చిత్తుగా ఓడిపోయాయి. ఆ తర్వాత రెడ్ ఆర్మీ తిరుగుబాటు దాడిని ప్రారంభించింది.

సోవియట్ సైన్యం ఒక్కో పట్టణాన్ని విముక్తి చేస్తూ బెర్లిన్ వైపు కదిలింది. పోలాండ్, హంగేరీ, చెకోస్లోవేకియా వంటి దేశాలను నాజీ ఆక్రమణ నుండి విముక్తం చేసింది. చివరకు 1945లో రెడ్ ఆర్మీ బెర్లిన్‌ను చుట్టుముట్టింది.

నాజీ పాలన కూలిపోతున్నదని గ్రహించిన హిట్లర్ తన బంకర్‌లో దాక్కున్నాడు. అతని అత్యంత సన్నిహితుడు జోసెఫ్ గోబెల్స్ సహా నాజీ నాయకత్వం అంతిమ ఓటమిని అంగీకరించింది. హిట్లర్, గోబెల్స్ తదితరులు విషగుళికలు తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

1945 మే 9న నాజీ జర్మనీ అధికారికంగా లొంగిపోయింది. బెర్లిన్‌పై ఎర్రజెండా ఎగిరింది. ఆ రోజు ప్రపంచ చరిత్రలో ఫాసిజంపై మానవజాతి సాధించిన మహా విజయంగా నిలిచింది. ఇది కేవలం ఒక యుద్ధ విజయం కాదు; మానవత్వం, ప్రజాస్వామ్యం, సామాజిక సమానత్వం, స్వాతంత్ర్యం కోసం సాగిన పోరాట విజయం.

ఫాసిజాన్ని ప్రధానంగా ఓడించిన శక్తి సోవియట్ ప్రజలదే అనే విషయాన్ని చరిత్ర ఎప్పటికీ మరచిపోలేదు. కోట్లాది సోవియట్ ప్రజల త్యాగాల ఫలితంగానే ప్రపంచం నాజీ బానిసత్వం నుండి బయటపడింది.

మే 9 విజయదినోత్సవం ప్రపంచ ప్రజలకు ఒక చారిత్రక సందేశం ఇస్తుంది. ఫాసిజం ఒక్కసారిగా పుట్టదు. ఆర్థిక సంక్షోభాలు, సామ్రాజ్యవాద పోటీ, జాత్యహంకారం, మత విద్వేషం, అబద్ధ ప్రచారం, ప్రజాస్వామ్య సంస్థల బలహీనత.. ఇవన్నీ కలిసి ఫాసిస్టు శక్తులకు మార్గం వేస్తాయి.

నేడు ప్రపంచవ్యాప్తంగా మళ్లీ యుద్ధోన్మాదం, జాత్యహంకారం, మత విద్వేషం, అధినాయకత్వ ధోరణులు పెరుగుతున్నాయి. బలమైన దేశాలు బలహీన దేశాలపై ఆర్థిక, సైనిక ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నాయి. ప్రజల సమస్యలను పరిష్కరించలేని పాలక వర్గాలు విభజన రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాయి.

ఇలాంటి సమయంలో మే 9 కేవలం చరిత్ర జ్ఞాపకం కాదు. అది ఒక హెచ్చరిక. ఫాసిజాన్ని ఓడించిన ప్రజల ఐక్యత, త్యాగస్ఫూర్తి, ప్రతిఘటన నేటికీ అవసరం. ప్రజాస్వామ్యాన్ని, కార్మిక హక్కులను, మానవ సమానత్వాన్ని కాపాడాలంటే సామ్రాజ్యవాద దాడులకు, ఫాసిస్టు రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రపంచ ప్రజలు సంఘటితంగా నిలవాలి.

నేడు ఫాసిజాన్ని మట్టి కరిపించిన రోజు..
హిట్లర్ ఫాసిజంపై రెడ్ ఆర్మీ విక్టరీ డే..
మే 9వ తేదీ..

Popular Articles