హైదరాబాద్: గడచిన రెండు నెలలుగా ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కుల విడుదల కుంటుపడింది. సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్న నిరుపేదల కళ్లు కాయలు కాస్తున్నాయి. కారణమేమిటో తెలియదుగాని గడచిన 60 రోజుల్లో రెండుసార్లు విడుదల కావలసిన CMRF చెక్కులకు అతీగతీ లేదు. ఫలితంగా అప్పో, సప్పో చేసి ప్రయివేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుని, ప్రాణాలు నిలుపుకున్న నిరుపేదలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వాస్తవానికి ప్రతీ 25 రోజుల కోసారి CMRF చెక్కులను ప్రభుత్వం విడుదల చేస్తుంది. ప్రతీ నెల మొదటి, రెండు వారాల మధ్యలో దరఖాస్తుదారులకు మంజూరైన చెక్కులను స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు తమ తమ పరిధిలోని లబ్దిదారులకు ‘పబ్లిసిటీ’ చేసుకుంటూ మరీ పంపిణీ చేస్తుంటారు. దరఖాస్తు చేసుకున్న తర్వాత వివిధ దశల్లో వాటి పరిశీలన పూర్తయిన తర్వాత పేదలకు సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ సహాయ నిధిపై ‘సీలింగ్’ కూడా విధించడం గమనార్హం.
గతంలో బిల్లు మొత్తంలో 70-80 శాతం వరకు CMRF నుంచి సాయం అందించగా, ప్రస్తుత ప్రభుత్వంలో బాధిత రోగి ఆసుపత్రిలో ఎంత ఖర్చు చేసినా రూ. 60,000 మొత్తానికి మించి సాయం చేయడం లేదు. ఏవేని ప్రత్యేక సిఫారసుల్లో మాత్రమే స్వల్పంగా సాయాన్ని పెంచుతున్నారు. అయితే గత మార్చి మొదటి వారంలో మంజూరైన సీఎం సహాయ నిధి చెక్కుల ఘటన తర్వాత ఇప్పటి వరకు మళ్లీ CMRF నిధులు మంజూరు కాలేదని వివిధ ప్రజా ప్రతినిధుల కార్యాలయ వర్గాలు దరఖాస్తుదారులకు చెబుతున్నాయి.
సాధారణంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో మాత్రమే CMRF చెక్కుల మంజూరు, జారీలో కాస్త జాప్యం జరుగుతుంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత మరే ఎన్నికలు కూడా జరగలేదు. కానీ మార్చి మొదటి వారంలో వచ్చిన CMRF చెక్కుల తర్వాత గడచిన 60 రోజులుగా మళ్లీ సీఎం సహాయ నిధి నుంచి పేదలకు ఎటువంటి ఆర్థిక సాయపు చెక్కులు జారీ కాలేదని ఎమ్మెల్యే వంటి ప్రజా ప్రతినిధుల కార్యాలయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
సగటున ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి నెలకోసారి 400 మందికి CMRF చెక్కులు మంజూరవుతుంటాయి. ఆయా చెక్కుల విలువ దాదాపు రూ. కోటి మొత్తం ఉంటుంది. ఈ ప్రాతిపదికన గడచిన రెండు నెలలుగా రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 95,200 మంది పేదలు CMRF సహాయ నిధి ద్వారా చెక్కుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇందుకు సంబంధించి రూ. 238.00 కోట్ల మొత్తం చికిత్స చేయించుకున్న పేదలకు అందాల్సి ఉంది. ఇవిగాక ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీల ద్వారా సిఫారసు చేసే CMRF దరఖాస్తులు ఆయా సంఖ్యకు, మొత్తానికి అదనం.
అంటే రాష్ట్ర వ్యాప్తంగా రమారమి రూ. 250.00 కోట్ల మొత్తం CMRF సహాయ నిధి చెక్కుల కోసం సుమారు లక్ష మంది పేద, నిరుపేద అభాగ్యులు ఎదురుచూస్తున్నట్లుగా భావించవచ్చు. అయితే ఏప్రిల్ మొదటి వారంలో రావలసిన చెక్కులకే ఇప్పటి వరకూ మోక్షం లభించని పరిస్థితుల్లో తాజాగా మంజూరయ్యే చెక్కులపై దరఖాస్తుదారులు ఎంతగానో ఆశతో ఎదురుచూస్తున్నారు. ‘ప్రజా ప్రభుత్వం’లో తమకు సీఎం సహాయ నిధి అందుతుందనే ఆశాభావంతోనే పేదలు రెండు నెలలుగా ఎదురుచూస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కరుణిస్తారో, లేదో వేచి చూడాల్సిందే..!

