నేలకొండపల్లి: ప్రజలు ఇచ్చిన ప్రతీ వినితికీ న్యాయం చేస్తామని తెలంగాణా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. ప్రజల వద్దకే పాలనను అందించేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. ఈ సందర్భంగా ప్రజలు ఇచ్చిన ప్రతీ వినతీకి న్యాయం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బోదులబండ గ్రామంలో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగా లేకున్నా గత 2.4 సంవత్సరాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డు దారులకు సన్నబియ్యం, కొత్త రేషన్ కార్డులు వంటి పథకాలు ప్రారంభించామన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఇండ్లు ఇవ్వలేదని, తమ ప్రభుత్వం మొదటి ఏడాదిలోనే 4.5 లక్షల ఇళ్లు మంజూరు చేసిందని పేర్కొన్నారు. ప్రతి సోమవారం ఇళ్ల నిర్మాణానికి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నామన్నారు.

విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ, డైట్ చార్జీలు 40 శాతం, కాస్మొటిక్ చార్జీలు 200 శాతం పెంచినట్లు తెలిపారు. ప్రభుత్వ పనితీరు వల్లే ప్రతి ఎన్నికల్లో ప్రజలు అధిక మెజారిటీతో గెలిపిస్తున్నారన్నారు. గత ప్రభుత్వం ఇళ్లు ఇవ్వకపోవడం వల్లే ఇందిరమ్మ ఇళ్లకు ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయని, తమ ప్రభుత్వం ఇళ్లు ఇవ్వడమే కాకుండా ప్రతి సోమవారం నిధులు విడుదల చేయడంతో ప్రజల్లో నమ్మకం పెరిగిందన్నారు. మే నెలాఖరులో రెండవ దశ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. పార్టీలకతీతంగా ప్రతి అర్హుడికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, మూడవ, నాలుగవ దశల్లో కూడా ఇళ్లు మంజూరు చేస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
భూమి సమస్యలపై ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొంటూ, గత ప్రభుత్వ ధరణి విధానం వల్ల అనేక సమస్యలు ఏర్పడ్డాయని తెలిపారు. రాబోయే 2 నెలల్లో అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. భూ భారతి ద్వారా అనేక సమస్యలు ఇప్పటికే పరిష్కరించామని, మిగిలిన వాటిని త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. సాదాబైనామా దరఖాస్తులను కూడా పరిష్కరిస్తామని, ప్రభుత్వ భూములను సాదాబైనామా ద్వారా ఆక్రమించే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి, పాలేరు నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ రమేష్, ఆర్డీవో శ్రీనివాస్ తదితర అధికారగణం, వివిధ గ్రామాల సర్పంచ్ లు పాల్గొన్నారు.

