ఖమ్మం: ఖమ్మం జిల్లా కోర్టు న్యాయవాదుల సంక్షేమ సంఘం అధ్యక్షునిగా ప్రముఖ న్యాయవాది కాసర రాజశేఖర్ రెడ్డి మరోసారి ఎన్నికయ్యారు. దీంతో ఈ సంఘానికి అధ్యక్షునిగా రాజశేఖర్ రెడ్డి నాలుగోసారి ఎన్నిక కావడం ప్రత్యేక విశేషం.
ఏటా నలుగురు డైరెక్టర్లను ఈ సంఘం ఎన్నికల్లో కొత్తగా ఎన్నుకుంటారు. ఓసారి డైరెక్టర్ గా ఎన్నికైన వ్యక్తి మూడేళ్లపాటు అదే హోదాలో కొనసాగుతారు. ఈ ప్రాతిపాదికన నలుగురు కొత్త, ఎనిమిది పాత డైరెక్టర్లతో కలిపి ఏటా కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు. బుధవారం జరిగిన న్యాయవాద సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నికల్లో కాసర రాజశేఖర్ రెడ్డిని నాలుగోసారి అధ్యక్షునిగా ఎన్నుకోవడం విశేషం.

మిగతా కార్యవర్గంలో ఉపాధ్యక్షునిగా అనుముల నరసింహారావు, ప్రధాన కార్యదర్శిగా భూక్యా రమేష్, జాయింట్ సెక్రెటరీగా పాలవెల్లి వెంకటేశ్వర్లు, కోశాధికారిగా పలివెల శ్రీలక్ష్మి ఎన్నికయ్యారు. ఈసారి నూతన డైరెక్టర్లుగా కొలకలూరి ప్రసాద్, చింతల వెంకటేశ్వర్లు, షేక్ మల్లూర్, తేరాల గంగాధర్ ఎన్నికయ్యారు.

పేరు పేరునా.. అందరికీ ధన్యవాదాలు: రాజశేఖర్ రెడ్డి
తనను మరోసారి సొసైటీ అధ్యక్షునిగా ఎన్నుకున్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కాసర రాజశేఖర్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. అందరి అశీస్సులతో, మద్ధతుతో మూడుసార్లు డైరెక్టర్ గా, అధ్యక్షునిగా నాలుగోసారి కూడా విజయవంతంగా గెలిచినట్లు చెప్పారు. తనపై నమ్మకంతో బాసటగా నిలిచి గెలిపించినవారందరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు. నిజాయితీతో, అంకితభావంతో సొసైటీ అధ్యక్షునిగా తన బాధ్యతను నిర్వర్తిస్తానని, న్యాయవాదులకు నిరంతరంగా సేవ చేస్తూనే ఉంటానని రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు.

