తల్లాడ: ఖమ్మం జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని తల్లాడ మండల కేందంలో రైతులు మంగళవారం నిరసన తెలిపారు. మొక్కజొన్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రైతుల నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య బాసటగా నిలిచారు. ప్రాథమిక సహకార సంఘం (పీఏసీఎస్) ఆఫీసు వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వెంకట వీరయ్య పరిశీలించారు.

ఈ సందర్బంగా వెంకటవీరయ్య మాట్లాడుతూ, ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన వాగ్ధానాలను, సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయటంలో విఫలమైందన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నప్పటికీ, ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రైతులకు ప్రకటించిన సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం విఫలమైందన్నారు.

ముఖ్యంగా రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ వంటి కర్షక సంక్షేమ పథకాలు సరిగ్గా అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు పంటలు పండించే సమయంలో యూరియా సరఫరా చేయడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 24వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టరేట్ ను ముట్టడించనున్నట్లు సంద్ర వెంకట వీరయ్య ప్రకటించారు.

