Top 5 This Week

Related Posts

తెలంగాణాలో తొలి సర్వే మ్యాప్ ఆధారిత రిజిస్ట్రేషన్

కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో సర్వే మ్యాప్‌తో తొలి రిజిస్ట్రేషన్ మంగళవారం జరిగింది. తద్వారా భూదార్ తో రైతు హక్కుకు శాశ్వత భరోసా లభించింది. రెవెన్యూ మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలో ఈ ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సర్వే మ్యాప్ ఆధారిత రిజిస్ట్రేషన్’ ప్రక్రియ పట్టాలెక్కినట్లుగా ఈ ఘటనలో భావిస్తున్నారు.

గతంలో రిజిస్ట్రేషన్ అంటే కేవలం కాగితాల మీద రాసుకునే దస్తావేజులు మాత్రమే ఉండేవి. దీనివల్ల సరిహద్దు వివాదాలు తలెత్తి రైతులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నట్లు ప్రభుత్వం భావింవచింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ ‘భూభారతి’ చట్టం ద్వారా రిజిస్ట్రేషన్ సమయంలో ఆ భూమికి సంబంధించిన స్పష్టమైన సర్వే మ్యాప్ (ఎల్ పి ఎం) ఉండటాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది.

ఇందులో భాగంగా కూసుమంచి మండలం గట్టు సింగారం గ్రామంలోని సర్వే నంబర్ 156/ఇ/1 లో గల ఒక ఎకరా నాలుగు గుంటల భూమికి సంబంధించి రాష్ట్రంలోనే తొలి ‘మ్యాప్ ఆధారిత’ రిజిస్ట్రేషన్ జరగడం విశేషం. నేలకొండపల్లి మండలం మోటాపురం గ్రామానికి చెందిన రైతు భాగం కిషన్ రావు తన భూమిని, అదే గ్రామానికి చెందిన కట్టా వెంకటేశ్వరరావుకు విక్రయించగా, తహశీల్దార్ కార్యాలయంలో భూమి హద్దులతో కూడిన మ్యాప్‌ను జతచేసి ప్రక్రియను పూర్తి చేశారు. దీనివల్ల భవిష్యత్తులో పొరుగు రైతులతో వచ్చే సరిహద్దు తగాదాలకు ఇకపై తావుండదని అధికార వర్గాలు చెప్పాయి.

మనిషికి ఆధార్ కార్డు తరహాలోనే.. ఇకపై ప్రతి భూకమతానికి ఒక విశిష్టమైన ‘భూధార్’ నెంబర్‌ను ప్రభుత్వం కేటాయిస్తోంది. కూసుమంచిలో జరిగిన ఈ చారిత్రక రిజిస్ట్రేషన్‌కు ‘795GCHDCUPJ7H0’ అనే భూధార్ సంఖ్యను (భూ కమత పటము-1) కేటాయించారు. దీనివల్ల భూమి యజమాని వివరాలు, విస్తీర్ణంపై ఎలాంటి సందేహాలకు తావుండదని అధికారులు స్పష్టం చేశారు. యాజమాన్య హక్కులను శాశ్వతంగా నిర్ధారించడమే కాకుండా, ఎవరైనా స్వచ్ఛందంగా తమ ఆస్తుల సర్వే సర్టిఫికేట్ పొందాలనుకుంటే కూడా దరఖాస్తు చేసుకునే వీలును ప్రభుత్వం కల్పించింది.

కాగా ఈ విధానం ద్వారా భూ వ్యవహారాల్లో పూర్తిస్థాయి పారదర్శకత వస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకువస్తూ రూపొందించిన ‘ఇంటిగ్రేటెడ్ భూభారతి’ పోర్టల్‌ను ఈ నెల 2వ తేదీ నుంచి ఐదు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలంతో పాటు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, నారాయణపేట జిల్లా కొస్గి, రంగారెడ్డి జిల్లా అమన్‌గల్, సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలాల్లో ఈ కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయని తెలిపారు.

పాతకాలపు గొలుసు సర్వేలకు స్వస్తి పలికి, అత్యాధునిక ‘రోవర్ల’ సహాయంతో కచ్చితమైన కొలతలు తీస్తున్నట్లు చెప్పారు. ఈ వినూత్న విధానం త్వరలోనే దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలవనుందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. రైతు జీవితం భూమితో ముడిపడి ఉందని, ఆ హక్కుకు సర్వే మ్యాప్, భూధార్‌తో రక్షణ కల్పించినప్పుడే రైతు కుటుంబానికి భవిష్యత్తుపై నమ్మకం కలుగుతుందని మంత్రి ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

Popular Articles