Top 5 This Week

Related Posts

మేడారం అభివృద్ధి పనులపై మంత్రి పొంగులేటి సమీక్ష

మేడారం: మేడారం జాతర శాశ్వత అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నట్లు తెలంగాణా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఆదివారం ఆయన ములుగు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా వనదైవతలైన మేడారం శ్రీ సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత మేడారం జాతర శాశ్వత అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్ననేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులతో, కాంట్రాక్టర్లతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, గత జనవరి నెలలో జరిగిన మహా జాతర వరకే అభివృద్ధి పనులు సింహభాగం పూర్తయినప్పటికీ, కొన్ని పనులు చివరి దశలో ఉన్నాయని చెప్పారు. వాటిని కూడ త్వరితగతిన పూర్తి చేసి, జాతరలో శాశ్వత ఏర్పాట్లు చేపట్టి అమ్మవార్ల భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మున్ముందు జాతరను నిర్వహించాలని అధికారులకు సూచించారు. గత జాతరలో సౌకర్యాలలో నెలకొన్న సమస్యలుంటే వాటిని పరిష్కరించుకుని మరింత మెరుగ్గా సౌకర్యాలను తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.

గొప్పగా అభివృద్ధి చెందిన ఈ ప్రాంతాన్ని, మేడారం శ్రీ సమ్మక్క, సారలమ్మ వన దేవతలను దర్శించుకోవడానికి ప్రజలు, భక్తులు ఏడాది పొడవునా వస్తున్న దృష్ట్యా సౌకర్యాల లోటు లేకుండా చూసుకోవాలని అధికారులకు నిర్దేశించారు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వన దేవతల జాతర ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన అభివృద్ధి పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఫేజ్-2లో భాగంగా మాస్టర్ ప్లాన్ ప్రకారం చేపట్టవలసిన అభివృద్ధి పనుల కోసం అవసరమైన భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. వనదేవతల ప్రాంగణంలో భక్తులకు మెరుగైన సేవలందించేందుకు, నిర్వహణ కోసం మొత్తం అవసరమైన సిబ్బంది సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు.

సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి, పక్కన మరో మంత్రి సీతక్క

అదేవిధంగా మంగపేట మండలం మల్లూరులోని శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దురదృష్టవశాత్తు మేడారం జాతర పూజారి రాణా రమేష్ కుమారుడికి జరిగిన ప్రమాదం విషయంలో ప్రభుత్వం ఇప్పటికే అన్ని విధాలుగా వారిని ఆదుకున్నట్లు చెప్పారు. ఆ కుటుంబంలో ఒకరికి దేవాదాయ శాఖలో ఉద్యోగం కూడ ఇప్పించామని చెప్పారు.

చిన్న వయసులో వారి కుమారుడు కాలు కొల్పోవడం చాల బాధాకరమని, ఆ చిన్నోడికి ఉత్తమ కృత్రిమ కాలు, మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందన్నారు. ప్రమాదాన్ని రాజకీయం చేసేవారిని వారి విజ్ఞతకు వదిలేస్తున్నానని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, ములుగు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Popular Articles