కేరళం కామ్రేడ్ల చివరి రాజప్రాసాదం. ఇది చేజారిపోతున్న స్వప్నం (paradise lost) లాగా కనిపిస్తోంది. సి-ఓటర్ లాంటి సర్వే సంస్థలు జరిపిన ముందస్తు ఓటర్ సర్వేలు ఈ విషయం చెబుతున్నాయి. అదే నిజమయితే –గతంలో బెంగాల్, త్రిపుర, ఇప్పుడు కేరళం. ఒక్కొక్కటిగా కమ్యూనిస్టు సౌధాలు కాలగర్భంలో కలిసిపోతున్నట్టే.
కారణాలు?
ఒక్కో చోట ఒక్కో కారణం. బెంగాల్ లో మమతా ధాటికి తట్టుకోలేక రక్షణ కోసం కుడి ఎడం అయినా పొరపాటు లేదనుకొని కాషాయం పంచన చేరిపోవడం. కేరళంలో మాత్రం స్వయంకృతాపరాధమే. నాయకత్వం నియంతృత్వపు పోకడలు, అంతర్గత ప్రజాస్వామ్యం అడుగంటిపోవడం, భిన్నాభిప్రాయలకు చోటు లేకపోవడం.. వెరసి సుధాకరన్ లాంటి సీనియర్లు పార్టీకి దూరమై హస్తం నీడన చేరడం లేదా బీజేపీ పంచన చేరడం.
సైద్ధాంతిక లొంగుబాటు:
ఎల్డీఎఫ్ అధినేత, ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ఈడీ కేసులకు భయపడి బీజేపీకి బీ-టీంగా మారిపోయారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేసీ వేణుగోపాల్ చేసిన ఆరోపణలతో ఇండియా కూటమిలో అనైక్యతా రాగాలకు బలం చేకూర్చింది. మోడీ సర్కార్ అదానీకి బినామీగా పని చేస్తోందని కమ్యూనిస్టుల అభిప్రాయం. ఇందుకు అనుగుణంగా పోర్టులు, విద్యుత్ ప్రాజెక్టులు అప్పనంగా అదానికి ప్రభుత్వాలు దారాదత్తం చేయడాన్ని ప్రతిఘటిస్తూ వామపక్షాలు దేశవాప్త ఆందోళనలు చేశాయి.
కానీ కేరళ విషయానికొస్తే జరిగిందేమిటి? సైద్ధాంతిక తిరోగమనం. ముప్పై వేల కోట్ల విలువైన అదానీ ప్రాజెక్టులు విజయన్ ప్రభుత్వం కనుసన్నల్లో ముందుకు సాగుతున్నాయి. అమెరికాతో విజయన్ ప్రభుత్వం డీప్ సీ ఫిషింగ్ కోసం చేసుకున్న ఎంవోయూలు సముద్ర వేటపై జీవనం సాగించే వేలాది మత్స్యకార కుటుంబాల జీవించే హక్కును హరించి వేసింది.
నందిగ్రామ్ లో జరిగినట్టే విజింజిమ్ (తిరువనంతపురం) పోర్టులో జరుగుతోంది. బెంగాల్లో కమ్యూనిస్ట్ కంచుకోట కూలిపోవడానికి బుద్ధదేవ్ సాక్షిగా మిగిలిపోయారు. ఇప్పుడు విజయన్ కూడా అలాగే సాక్షీభూతం అవుతారా? చూడాలి. చెప్పేది ఒక్కటి, చేసేది ఒక్కటి అయినప్పుడే ప్రజల్లో విశ్వాసం కోల్పోతారు. అప్పుడే కోటలు బీటలు వారి చరిత్ర పుటల్లోకి ఎక్కుతాయి.

✍️ గాలి నాగరాజా

